మకరజ్యోతి దేవుని మాయకాదు.. మనిషి కల్పితమే!
శబరిమలను హిందువులు పుణ్యక్షేత్రంగా భావిస్తారు. పెరియార్ టైగర్ రిజర్వు ప్రాంతంల్లో పశ్చిమ కనుమల కొండల్లోఉంది. చుట్టూ ఉన్న 18 కొండల మధ్య.. అడవుల మధ్య ఒక కొండ మీద అయ్యప్ప గుడి ఉంది. సముద్ర మట్టానికి 4,133 ఫీట్ల ఎత్తులో.. పతనం తిట్ట జిల్లాలో, పెరునద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ప్రతీ యేటా ఈ దేవాలయాన్ని 45-50 మిలియన్ల భక్తులు దర్శించుకుంటున్నారు. అయ్యప్పను సస్ట అనీ, ధర్మ సస్ట అనీ కూడా పిలుచుకుంటారు. పన్నెండో శతాబ్దంలో పండలం రాజవంశీకుడు, యువరాజు మణికందన్ శబరిమలలో తపస్సు చేశాడని, ఆయన అయ్యప్ప అవతారమనీ భక్తులు భావిస్తారు. పండలం రాజవంశీకుల కాలం (1821) నాటికే ఈ గుడి అతిపురాతనమైందని చెపుతారు. ఇప్పుడున్న అయ్యప్ప విగ్రహం 1910లో ప్రతిష్టాపించారు.
కేరళ శబరిమలలో ప్రతీ సంవత్సరం మకరవిలక్కు.. అనే పండగ జరుగుతుంది. ఇందులో తిరువాభరణం.. మకరజ్యోతి అనే రెండు ముఖ్యమైన కార్యక్రమాలుంటాయి. తిరువాభరణం అంటే అయ్యప్పస్వామి ఆభరణాల్ని ఊరేగించడం. రెండోది మకరజ్యోతి దర్శనం. వీటిని చూడడానికే భక్తులు అక్కడికి చేరుకుంటారు.
రామాయణ కావ్యంలో కథానాయకుడు శ్రీరాముడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు. ఆదివాసి భక్తురాలైన శబరిని ఆ ప్రాంతంలో కలుసుకున్నందువల్ల దానికి శబరిమల అనే పేరు వచ్చిందని స్థల పురాణం ఉంది. అక్కడ శబరి-పండ్లు మంచివా కాదా అని ఒక్కొక్కటి రుచిచూసి, మంచి పండ్లు ఏరి రామునికి సమర్పించుకుందని కూడా స్థల విశేషాల్లో ఉంది. కొద్ది దూరంలో తపస్సు చేసుకుంటున్నది ఎవరని రాముడు శబరిని అడిగితే, అతను సస్ట అని చెపుతుంది. రాముడు సస్ట దగ్గరికి వెళతాడు. సస్టలేచి నిలబడి రాముడికి స్వాగతం పలుకుతాడు. ఆ సస్ట ఎవరో కాదు.. అయ్యప్పే అని తెలుస్తుంది. అక్కడ పూజింపబడుతున్న అయ్యప్పకు హరిహర పుత్ర అనే మరో పేరు ఉంది. అంటే ఈయన హరికి-హరుడికి కలిగిన సంతానం. మహావిష్ణు-శంకరుల సంతానమన్నమాట. మన హిందూ దేవుళ్ళకున్న మహిమల్లో ఇదొకటి. ఇద్దరు మగవాళ్లకు అయ్యకు అప్పకు పుట్టడమేమిటని అమాయకంగా ఎవరూ అడగొద్దు. కల్పించుకున్న దైవ మహిమలు ఎలాగైనా ఉంటాయి. అసంబద్ధమైన అంశాల్నే మన భక్తులు భక్తిపారవశ్వంతో పూజిస్తుంటారు. హేతుబద్ధత కోసం అంగలార్చేవారికి అదొక సమస్య. కానీ.. కండ్లు మూసుకుని విశ్వసించే వారికి అది సమస్యే కాదు.
హిందువులు ఏర్పరచుకున్న రాశులలో మకరరాశి ఒకటి. మకరజ్యోతి అంటే మకరరాశి వెలుగు. అయ్యప్ప మకరజ్యోతిగా మారి ప్రతి సంవత్సరం జనవరి 14 నాడు భక్తులకు ఒక నక్షత్రంగా (వెలుగుగా) కనిపించి దీవిస్తాడని స్థలపురాణం. ఒక విశ్వాసం ఉంది. ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తర దిశగా ఆరు నెలల పాటు ప్రయాణిస్తాడని, మకర సంక్రాంతి (జనవరి 14) రోజు ప్రారంభమై ప్రయాణం కర్క సంక్రాంతి (జూలై 14) రోజున ముగుస్తుందని చెపుతారు. సంక్రాంతికి పంటలు ఇండ్లకు రావడం, గ్రామాలన్నీ సంతోషంతో కళకళలాడడం జరుగుతుంది. మనిషి ప్రకృతితో అనుసంధానమైన పండగ ఇది. అని అనుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. మళ్ళీ రాముడు, శబరి, అయ్యప్ప అంటే మాత్రం కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మకర జ్యోతి వేరు. మకర విలక్కు అనేది వేరు. మకర జ్యోతి భక్తుల విశ్వాసం. మకర విలక్కు అనేది కేవలం మనిషి వెలిగించే అఖండ దీపం. దాన్నే ఇప్పుడు భక్తులు 'మకరజ్యోతి'గా పరిగణిస్తున్నారు.
శబరిమలలో అయ్యప్పదేవాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పొన్నాంబలం కొండమీద గతంలో మలార్య అనేగిరిజన జాతివారు పూజచేసి పెద్ద దీపం వెలిగించేవారు. దాన్నే 'మకర విలక్కు' అని అనేవారు. పొన్నాంబలం కొండ మీద కూడా ఒక చిన్న గుడి ఉంది. అక్కడి గిరిజనులు ఆ గుడిలోని దేవతా మూర్తికి హారతి ఇచ్చేవారు. కర్పూరం, నెయ్యి వంటి వాటితో పెద్ద దీపం వెలిగించి, అక్కడున్న విగ్రహం చుట్టూ మూడు సార్లు తిప్పి హారతి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ కొండమీది దేవాలయం వైపు ఎవరినీ పోనివ్వడం లేదు. అది అటవీశాఖ వారి ఆదీనంలో ఉంది. అటవీశాఖ పోలీసుశాఖ శబరిమల అయ్యప్ప దేవాలయ సిబ్బంది కలసికట్టుగా, గుట్టుగా నిర్వహిస్తున్న కార్యక్రమమే మకర విలక్కు. వీరు వెలిగించే అఖండ దీపమే మకర జ్యోతి. అంటే కొండమీద నక్షత్రమనే ఒకప్పటి భ్రమే, ఇప్పుడు వాస్తవంగా మారింది!
కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవోసం (దేవాలయ) బోర్డు, అటవీశాఖల సహకారంతో ఆ కార్యక్రమం నిర్వహిస్తోందని కేరళ హైకోర్టు ధృవీకరించింది. వాస్తవాలన్నీ బహిర్గతమయ్యాయి. కాబట్టి, ఇంకా ఈ విషయం మీద పరిశీలనలు అవసరం లేదని కూడా కోర్టు చెప్పింది.
ఒకప్పటి అమాయక గిరిజన సంప్రదాయాన్ని నేటి నాగరిక మూఢ భక్తాగ్రేసరులు కొనసాగిస్తున్నారు. దానికి ప్రభుత్వ యంత్రాంగాలన్నీ తమ శాయశక్తులా సహకరిస్తున్నాయి. ఒక మూఢ భక్తి, ఆచారం, చాదస్తం కొనసాగడానికి ఎక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసులే కారణం కాదు. రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కారణమేనని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. భద్రాద్రికి వెళ్ళే ముత్యాల తలంబ్రాలే కావొచ్చు. సమ్మక్క సారక్క జాతరే కావొచ్చు. ఇంకా అలాంటి ఏ ఇతర సంప్రదాయాలైనా కావొచ్చు. అన్నిటికీ సూత్రమొక్కటే! ఏ ప్రాంతంలోనైనా, సూత్రధారులు ఒకేరకంగా వ్యవహరిస్తారనేది మనం తెలుసుకోవాలి!!
జనవరి 14, ఉదయం పొన్నాంబలం (యిడు) కొండకు ఒక బృందం బయలుదేరి సాయంత్రానికి అక్కడికి చేరుకుంటుంది. మధ్యలో మధ్యాహ్నం కాసేపు సేదతీరి, భోజనాలు చేసి, మళ్ళీ ప్రయాణమవుతారు. ఆ బృందంలో యాభైమంది అటవీశాఖవారు, యాభైమంది పోలీసులు, విద్యుత్‌శాఖవారో పది మంది. అయ్యప్ప ఆలయ సిబ్బంది మరో పది మంది సామాన్లు మోయడానికి కూలీలు వగైరా అంతా కలసి ఆ బృందంలో వెళతారు. సాయంత్రానికి కొండమీదికి చేరిన ఆ బృందం సంధ్యవేళ 6-16 నుండి 6-20 వరకు అఖండ జ్యోతి వెలిగిస్తుంది. సుమారు పది కిలోల కర్పూరం వెలిగించే సరికి పెద్దజ్యోతి పైకి లేస్తుంది. ఆ వెలుగుకు అడ్డంగా కొందరు లావుపాటి దుప్పటి మూడుసార్లు అడ్డుపెట్టి తొలగిస్తారు. దాంతో శబరిమల ఆలయంలో ఉన్న భక్తులకు, ఇంకా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నవారికి ఆకాశంలో నక్షత్రం మూడుసార్లు మినుకుమని వెలిగి మాయమైందన్న భ్రమ కలుగుతుంది. అదే మనిషి చేసే మకర జ్యోతి మహాత్మ్యం!
ఈ కార్యక్రమాన్ని సన్నిధానం (అయ్యప్ప గుడి ఆవరణ) నుండి, పండిత వలం, పుల్‌మేడు, కొండపై నుండి చలకయం, అట్టతోడు, సరంకుతి, నీలిమల, మరకుటమ్ వంటి నిర్ణీత స్థలాల నుండి భక్తులు మకరజ్యోతిని దర్శించుకుంటూ ఉంటారు. పొన్నాంబలం (యిడు) కొండమీద హారతి కార్యక్రమం అయిపోగానే, కొండ కింద అయ్యప్పగుడి గోపురం నుండి అర్చకులు భక్తులకు సంకేతాలిస్తారు. దాంతో కార్యక్రమం ముగిసిందని భక్తులు తెలుసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోతారు.
అయ్యప్ప దర్శనానికి సంబంధించి... మహిళల విషయమొకటి కోర్టు కెక్కింది. 1991లో కేరళ హైకోర్టు 10-50 ఏండ్ల మధ్య గల బాలికల, మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఆ వయసులో వారు రుతుక్రమంలో ఉంటారని, వారి ప్రవేశం వల్ల ఆలయం అపవిత్రమైపోతుందన్న కారణంతో కోర్టు ఆ ఉత్తర్వు నిచ్చింది. (అదీగాక, అయ్యప్పకు తల్లిలేదు. ఆయన అయ్యకు అప్పకు పుట్టినవాడు కదా? స్త్రీలు అపవిత్రులయితే, పుట్టికే అపవిత్రం, మనుషులంతా అపవిత్రులే.. మరి దానికేమంటారు?) ఈ విషయం అక్టోబర్ 2017లో కాన్సిటిట్యూషన్ బెంచ్‌కి వెళ్లింది.
పొన్నాంబలం కొండమీద 1950 కంటే ముందు ఆదిమ తెగలు నివసిస్తూ ఉండేవి. సంక్రాంతి రోజున దేవుడికి పెద్ద దీపం వెలిగించి పూజలు చేసుకోవడం ఆనాటి గిరిజన సంప్రదాయం. అది ఆకాశంలో నక్షత్రమని చుట్టు పక్కల ప్రాంతాల్లోని వారు అనుకుంటూ ఉండేవారు. హైడల్ ప్రాజెక్ట్ కట్టడం మూలాన ఆ కొండ ప్రాంతం వారు నిర్వాసితులయ్యారు. మూడు నాలుగేండ్ల పాటు అక్కడ ఎవరూ దీపం వెలిగించలేదు. ఎవరికీ ఏ నక్షత్రమూ కనిపించలేదు. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని అలాగే నిలపడానికి కేరళ ప్రభుత్వమే మకరజ్యోతి వెలిగించడం ప్రారంభించింది. 1983, 84 సంవత్సరాల్లో కేరళ రాష్ట్ర హేతువాద, మానవ వాద సమాఖ్య (ఫారా) పూనుకుని, పొన్నాంబలం కొండపైకెక్కి రాకెట్లు, బాణా సంచా పేల్చారు. ఆ రోజుల్లో దూరదర్శన్ ప్రేక్షకులు ఆ దృశ్యాలు చూశారు. ఈ వ్యాసకర్త కూడా ఆ ప్రేక్షకుల్లో ఒకరు.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీ వేత్త,
బయాలజీ ప్రొఫెసర్.
No comments:
Post a Comment