తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకొంటారు. అవి పాపనాశనం, కాణిపాకం.. చివరగా శ్రీకాళహస్తి.
శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదంటారు. అలా వెళితే అరిష్టం అని హిందు సాంప్రదాయంలో చెప్పబడింది. శ్రీకాళహస్తి దేవాలయమే ఎందుకు చివరగా దర్శించుకోవాలి. మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. వెళ్తే ఏమవుతుంది?
శ్రీకాళహస్తి దర్శనం తరువాత నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి?
పంచ భూతాల నిలయమైన ఈ విశ్వంలో (గాలి, నింగి, నేల, నీరు, నిప్పు) వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయులింగం.
అయితే ఇక్కడి గాలిని తగిలిన తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదు అనేది ఇక్కడి ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా తొలగుతాయని చెబుతారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణేశ్వరుని దర్శనంతో కాలసర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న వారు నేరుగా ఇంటికే వెళ్లాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ జరగదని ఇక్కడి విశ్వాసం.
గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరు దేవుళ్ళకు శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని పురాణాలలో ఉంది. ఇందుకు నిదర్శనంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దేవాలయంతో సహా మిగిలిన అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణ జరిపిన తరువాతే పునఃదర్శనం ప్రారంభమవుతుంది.
కానీ మూసివేయని ఒకే ఒక్క దేవాలయం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరునిది. ఇక్కడి దేవుడికి గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు. అందుకే ఇక్కడి దేవుడి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయానికి వెళ్లనవసరం లేదన్నమాట.
No comments:
Post a Comment