Thursday, October 28, 2021

శ్రీ దత్తాత్రేయ స్వామి అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.

ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః

శ్రీ దత్తాత్రేయ స్వామి  అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.
అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ


ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవి లో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామి లో బ్రహ్మ,రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన, ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు (అణిమా,లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం ,ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా ) పుత్రులై అవతరించారు .

అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంనందు ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది, కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే “మధుమతి ” అనే పేరు కూడా కలదు. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము . “అఘము” అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం.

దత్తుని రూపంలో అంతరార్థం:
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే •

1. మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.

2. నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.

3. ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.

4. మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.

5. త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.

6. చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.

7. డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.

8. కమండలము:సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.

దత్త తత్వం:
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!

దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది.

శ్రీ సిద్దమంగళ స్తోత్రం

1. శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

5. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

6. దో చౌపాతీ దేవ్‌లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

7. పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

8. సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పరమ పవిత్రమయిన యీ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏక భుక్తం చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుదురు.

ఓం ద్రాo దత్తాత్రేయాయ నమః

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS