అందుకు నియమ నిబంధన ఏంటి?
ప్రతిష్టాపనకు అర్హులు ఎవరు ?
ప్రతిష్టాపన అంశంపై ఆధారిత గ్రంథాలు శాస్త్రాలు ఏవి?
పై ప్రశ్నలకు వివరములు కింద చదవండి.
కాశ్యప శిల్పశాస్త్ర అనుసారంగా చెప్పిన నియమాలు.
మొట్టమొదట యజమాని అనగా కర్త తన మనోభీష్ట అనుసారము సంకల్ప సిద్ధి కొరకు ఆలయ నిర్మాణము చేయదలచి సకల శాస్త్ర నిపుణులు అయినటువంటి
శిల్ప శాస్త్రములు ,వేదాధ్యయనము, ధర్మశాస్త్రాలు , జ్యోతిష్యం, పురాణ ఇతిహాసాలు, అధ్యయనం చేసి ప్రతిసృష్టి చేయగల నైపుణ్యం కలిగినటువంటి కళాకారుడైన శిల్పి/ స్థపతి యొక్క సన్నిధికి వెళ్లి తనతో పై కోరికను నివేదించుకొనవలెను.
అప్పుడు ఆ స్థపతి శిల్పశాస్త్రానుసారము ఆయాది వర్గములు లెక్కించి యజమానికి గ్రామమునకు దేవత మూర్తికి సంబంధించి శుభ వర్గములలో మానమును నిర్ణయించవలెను.
అప్పుడు శుభముహూర్తములో శిలా సంగ్రహము , వృక్ష సంగ్రహము మొదలైన కార్యక్రమములు సాంప్రదాయ పద్ధతిలో వేద ఘోషతో మంగళ వాయిద్యములతో శుభశకునములను చూసి గ్రామంలో ఉన్న అందరూ కలిసి ఊరేగింపుగా వెళ్లి స్థపతి కి పల్లకిపై కూర్చుండ పెట్టుకొని అరణ్యమునకు తీసుకువెళ్లి అక్కడ క్షేత్రపాలక హోమాదులు నిర్వహించి హరిద్రన్నము మొదలైన ద్రవ్యములతో బలి ప్రధానం చేసి దేవత విగ్రహములకు మరియు ఆలయ నిర్మాణమునకు కావలసిన శిలా వృక్షము ముదిరిన వస్తువులను పరీక్షించి అందులో శాస్త్రము చెప్పిన విధంగా శ్రేష్టమైనవి ఎంచుకొని శిల్ప శాలకు తీసుకొని రావలెను.
ప్రతినిత్యము చేయబోయే దేవత మరియు దేవాలయం యొక్క ఆది దేవతను కలశంలో ఆరాధించుకొని నిత్యము హవిస్సులను సమర్పించి శిల్ప కార్యక్రమాన్ని చేయవలెను. ఇందులో ముందుగా ఖిలపంజర నిర్మాణం ఉంటుంది. దాని తర్వాత బింబ నిర్మాణం ప్రారంభమవుతుంది.
దేవాలయ నిర్మాణం విషయంలో భూపరీక్ష, దిక్ నిర్ణయం యజమాని శక్తిని అనుసరించి దేవాలయం యొక్క విన్యాసాన్ని రచించుకొని శంకుస్థాపన చేస్తూ శిలాణ్యాసం జరిపించి శాస్త్ర ప్రకారం వేసినటువంటి చిత్రానుసారము ముగ్గు పోసి దేవాలయాన్ని పూర్తి చేయవలెను.
దేవాలయము మరియు దేవత విగ్రహములు పూర్తి అయిన తర్వాత ఆ యజమాని గ్రామ జనులతో స్థపతి యొక్క గృహానికి మంగళ వాయిద్యములతో సుమంగళ ద్రవ్యములతో సుమంగుళలతో సతీ కుటుంబ పరివార సమేతంగా వచ్చి ఆ ఆ స్థపతిని ధర్మపత్ని సమేతంగా ఉన్నతాసనం పై కూర్చుండబెట్టి. యజమానులు దంపతీ పరివార సమేతంగా రుత్విక్ ల మంత్ర ఉచ్చారణ లతో సకల ఉపచార పూజలను ముగించి భూ ధన కనక వస్తు వస్త్ర వాహన గో దానాది గలను సమర్పించి, విగ్రహానికి అథవా దేవస్థానము నిర్మించినందుకు గాను పూర్తి సంభావన చెల్లించి, ప్రతిష్టాపనాదులను నిర్వహించవలసిందిగా వినయంగా ప్రార్థించవలెను.
అప్పుడు ఆ శిల్పాచార్యులు ప్రతిమను లేక దేవస్థానము యజమానునకు దానము చేయవలెను.(దానము చేయవలెను అని శాస్త్రం చెబుతున్నది)
తరువాత మేళతాళములతో శిల్పిదంపతులకు ఊరేగింపుగా దేవస్థాన ప్రదేశమునకు పిలుచుకు రావలసి ఉంటుంది.
అప్పుడు జల, క్షీర ,ధాన్య ,పుష్ప ,శయన మొదలైన అది వాసములు నెరవేర్చి తరువాత శుభ ముహూర్తము స్థపతి యే నిర్ణయించి ఆ ముహూర్తానికి అష్ట బంధనము, కళావాహనము, నేత్రోన్మీలినము ,ప్రతిష్టాపన చేసిన తర్వాత శిల్పాచార్యులు ప్రథమ పూజ గావించి పూర్ణకుంభ అభిషేకము కూడా శిల్పా చార్యులు ఆధ్వర్యంలో యజమానుడు ఋత్విక్కులు తో సహా నిర్వహించి కార్యక్రమము పూర్తి చేయాలి.. ఇది శిల్ప శాస్త్రములు ప్రకారము ప్రతిష్టాపన చేయవలసిన విధి.
శిల్పాచార్యులు లేకుండా దేవాలయము మరియు విగ్రహ ప్రతిష్టాపన లకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమము కూడా జరగకూడదు.
పై కార్యక్రమాలు నిర్వహించుటకు పురోహితులకు గానీ మఠాధిపతులకు గానీ పీఠాధిపతి కి గానీ స్వామీజీలుకు గాని ఎటువంటి అధికారములు ఏ శాస్రమూ ఇవ్వలేదు.
పురోహితులు స్థపతి యొక్క మార్గదర్శనం లో మంటప కలసముల ఆరాధనా సకలోపచార పూజలు, స్థపతిని యజమానిని వారివారి స్థానంలో కూర్చొన్న తరువాత ప్రధానాహుతులు స్థపతి వేసిన తరువాత ఆయన అనుజ్ఞతో మిగతా ప్రతిష్టాసంబందిత పూజలు నిర్వహించాలి.
ఇంతటి ప్రాధాన్యత ఉన్న శిల్పాచార్యులను పురోహితులు కేవలము కూలీలుగా పరిగణించి ప్రతిష్టాపనకు సంబంధించిన ఏ అర్హత లేని పురోహితులు ప్రతిష్టాపన మొదలైన కార్యక్రమంలో స్థపతులు శిల్పులు లేకుండానే నిర్వహించి శాస్త్ర విరుద్ధంగా యజమాని క్షేమాన్ని కూడా ఆలోచించకుండా కేవలం స్వార్థం ధనాపేక్ష తో ఇటు కర్త ను ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. దీనివలన ఆ కర్త మరియు ఆ గ్రామము వినాశనానికి గురి అవుతుంది.
ఈ విషయాన్ని గంభీరంగా పరిగణించి శాస్త్రానికి శిల్పాచార్యులకు ప్రాధాన్యమిచ్చి ప్రతిష్టాపన లో నిజంగా నిజమైన దేవతావాహన జరిగేలా లోక కల్యాణం కోసం ప్రయత్నించాలని కోరుతున్నాను.
"శాస్త్ర విహీన ప్రతిష్టాపేన కర్తా భర్తా వినశ్యతి " -- శిల్పశాస్త్రములు,శిల్పాగమాలు.
ప్రస్తుత కాలమాన పరిస్థితులలో వేదములు శిల్ప శాస్త్రం అధ్యయనం చేయని శిల్పులు ద్వారా చేయించినట్లయితే అప్పుడు పురోహితులు శిల్పులు చెప్పవలసిన మంత్రములు చెబుతూ వారి చేతుల ద్వారానే అది వాసములు, అష్ట బంధన ,కళా వాహనము , అక్షి మోక్షణము, ప్రాణప్రతిష్ట , ప్రథమ పూజ , కుంభాభిషేకము మొదలైన కార్యక్రమాలు జరిపించిన వలసి ఉంటుంది. అంతేగాని స్థపతులు గాని శిల్పిగానే లేకుండా ఇటువంటి మహత్కార్యము జరగదు ఒకవేళ జరిపిన ఆ దేవత ఆవాహన జరగదు ఒకవేళ దేవతలను ఆవాహించిన కూడా ఆ దేవత వచ్చి జరుగుతున్న శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని గమనించి శాపం ఇచ్చి వెళ్లిపోతారని శిల్పశాస్త్రం చెబుతుంది.
దేవాలయాలు నిర్మించే యజమానులు ఈ విషయాన్ని గంభీరంగా తీసుకొని వలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మీ మీ యొక్క పూర్వజన్మ సుకృతంతో మీ యొక్క పుణ్యంతో మీ యొక్క ఆత్మ ఇచ్చే శుభప్రదమైన మార్గదర్శనంలో దేవాలయాలు నిర్మించాలని సంకల్పం చేసుకుంటారు. ఇందుకోసం కోట్ల లో ధనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతా ఖర్చు పెట్టి చక్కగా నిర్మాణం చేసిన తర్వాత ఈ చిన్న విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేసినట్లు అయినా కోట్లు ఖర్చుపెట్టి శాపానికి గురి కావడం ఎందుకు అనేది దీర్ఘంగా ఆలోచించి శిల్ప శాస్త్రానికి ప్రాధాన్యతనిస్తూ మీ వంశాన్ని ఉన్నతి గతిలో పురోగతి పొందేలా వ్యవహరించాలి అని నా యొక్క విశేషమైన సూచన.
మీయొక్క గురూజీ
No comments:
Post a Comment