Monday, February 14, 2022

బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

 బంగారు బతుకమ్మ ఉయ్యాలో..



పల్లె సుద్దులు కలిసిన పదాలతో రకరకాల పూలతో అమ్మవారిని పువ్వుల రూపంలో ఆరాధిస్తూ గౌరమ్మను పువ్వుల నడుమ పెట్టుకొని గంగమ్మ చెంతన ఆడే వేడుకే సద్దుల బతుకమ్మ. బతుకునిచ్చేదిగా బతుకమ్మ అనే భావంతో జీవశక్తి ప్రసాదించే ప్రకృతి రూపంగా తలచి బతుకమ్మను పూజిస్తారు. ప్రకృతిలో వెలసిన ప్రకృతి మాతను శక్తి స్వరూపిణిగా భావించి ప్రకృతి సంపద అయిన పూలతోనే బతుకమ్మను పేర్చి చివరికి ప్రకృతిలోనే కలిపివేయడం బతుకమ్మ పండుగ విశిష్టత. ఈ వేడుకను తేలికైన పదాలతో జీవన విధానానికి దగ్గరైన పాటలతో ఆటలాడుతూ ఆరోగ్యానికి మేలు చేసే విధంగా నిర్వహించుకునే పండుగ.


 


బతుకమ్మ తయారు ఇలా..


సద్దుల బతుకమ్మను నిర్వహించుకునే వేడుకకు బతుకమ్మను పేర్చే క్రమంలో ముందుగా తాబాలం లేదా బుట్ట, శిబ్బిలో గుమ్మడి ఆకులు పర్చి వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. మొదటగా గుమ్మడి పువ్వును అమర్చి వాటిపై తంగేడు, బీర, గన్నేరు, నిత్యమల్లె, చామంతి, బంతి వంటి పుష్పాలను పేర్చుతారు. శ్రీ చక్రం ఆకారంలో బతుకమ్మను పేర్చి మీద తమలపాకును పెట్టి అందులో పసుపుతో గౌరమ్మను తయారు చేసి అలంకరిస్తారు. పేర్చిన బతుకమ్మలను ఇంటిలో పెట్టి రుచికరమైన పిండి వంటలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించి బతుకమ్మలో గౌరమ్మను ఏర్పాటు చేసి ధూప దీప నైవేద్యాలతో గంగమ్మ సన్నిధికి చేర్చుతారు. మైదానాల్లో, చెరువు గట్లవద్ద, కుంటల వద్ద మహిళలు బతుకమ్మను ఒక చోట పేర్చి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ బతుకమ్మల చుట్టు తిరుగుతూ వేడుకలను నిర్వహించుకుంటారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. గౌరమ్మను మహిళలందరూ వాయినంగా తీసుకొని తాము తెచ్చిన సద్దులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.


 


సద్దుల నైవేద్యాలు..


సద్దుల బతుకమ్మగా పిలుచుకునే పండుగ రోజున తెలంగాణ రుచులైన పిండి వంటలను నైవేద్యాలుగా తయారు చేసి బతుకమ్మకు నివేదన చేస్తారు. ప్రధానమైన నైవేద్యాలు సత్తుపిండి, బియ్యం పిండి, సౌల్ల పిండి, పల్లీ పిండి, నువ్వుల పిండి, కొబ్బరి పొడి, గోధుమ పిండి బెల్లం, చక్కెరతో తయారు చేసిన లడ్డూల ముద్దలను, పులిహోర, ఆవ, కొబ్బరి సద్ది, దద్దోజనం, రవ్వ ప్రసాదాలను సద్దుల బతుకమ్మకు నైవేద్యంగా పెడుతారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS