Saturday, August 19, 2023

తూర్పుగోదావరి కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకన్న

తూర్పుగోదావరి కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకన్న...!!




🌸ఏడువారాల వెంకన్న ‘వాడపల్లి’లో ఉన్నాడు…తూర్పుగోదావరి జిల్లా. గోదావరి రెండుగా చీలి ప్రవహిస్తోంది. కలియుగ పుణ్యథామంగా విలసిల్లుతున్న వాడవల్లి గ్రామంలోని వెంకన్న గురించి చెప్పుకుని తరించాల్సిందే! గౌతమి వశిష్ట పాయలుగా విడి సుమారు 100కిమీ మేర ప్రయాణించి సముద్రుణ్ణి చేరుతుంది. 

🌿రాజమండ్రి నుండి అటు ధవళేశ్వరం మీదుగా 30 కిమీ ప్రయాణం చేసినా.. ఇలా రావులపాలెంనుడి 8 కిమీ ప్రయాణం చేసినా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామం చేరుకోవచ్చు.

🌸ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాటేమంటే ఒక ఏడువారాలు వాడపల్లి వెంకన్నను దర్శిస్తే అనుకున్నది నెరవేరుతుందని. పుణ్యతీర్థాల దర్శనం గురించి మనకు పురాణేతిహాసాలు చెబుతూనే ఉన్నాయి. 

🌿భారతంలో ప్రతీపుడు అనేక పుణ్య తీర్థాల్లో స్నానం ఆచరించిన తర్వాతే శంతనుడు జన్మించాడు.తీర్థ స్నానాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి నదీ ప్రవాహం అనేక మూలికా ద్రవ్యాలతో కూడుకున్నది. 

🌸ఎన్నో వనాలనుండి నీరు ప్రయాణించుకుంటూ వస్తోంది. అందుకే నదీ స్నానం పరమ పుణ్యఫలం. అక్కడే భగవంతుని ప్రతిష్టలు జరిగాయి. ఈ వాడపల్లి క్షేత్రంకు అదే మహత్తు ఏర్పడటానికి కారణం.

🌿చందన వెంకన్న అని ఈయనకు పేరు. చందన వృక్షం మానులో ఈయన ఉన్న విషయాన్ని గ్రామ వాసులు కనుగొని ప్రతిష్టించారు. ఒకసారి పురాణ చరిత్రను చూద్దాం!

🌷స్థల పురాణం🌷

🌸కలియుగంలో ప్రజలు ఆహార విహారాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అధర్మం పాలు పెరిగింది. స్వార్థం పెరిగి కామ క్రోథాదులతో జనం అధర్మజీవనం గడుపుతన్నారని వైకుంఠంలో సనకసనందనాదులు శ్రీమన్నారాయణుణ్ణి వేడుకున్నారు.  

🌿తాను గౌతమీ నదీతీరంలోని నౌకాపురం వద్ద్ద లక్ష్మీ సమేతుణ్ణై చందన వృక్షపేటికలో వెలుస్తాను అని చెప్పడం, నారదుడు ఈవిషయాన్ని అందరికి చేరవేయడం జరిగింది.

🌸కొంతకాలానికి నౌకాపురం(ఇప్పటి వాడపల్లి) ప్రజలకు గౌతమీ గోదావరిలో కొట్టుకొస్తున్న వృక్షం కనిపించింది. తీరా ఒడ్డునకు తీసుకొద్దామంటే దారిలో మాయమయ్యేది. కలి కల్మషం వల్ల మీరు దీనిని గుర్తించలేకపోతున్నారని పండితులకు స్వామి కలలో కనబడి ‘నదీగర్భంలో కృష్ణ గరుడ వాలినచోట చందనపేటికలో ఉన్నానని‘ 

🌿తెలుపడంతో అందరూ వెళ్ళి చందన పేటికను కనుగొన్నారు. దానిని ఒడ్డునకు చేర్చి నిపుణుడైన శిల్పితో తెరిపిస్తే దానిలో శంఖ, చక్ర, గదలతో కంఠంలో వనమాలతో నుదుట ఊర్ధ్వపుండ్రాలతో పద్మాలవంటి కనులతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనబడింది.  

🌸దేవర్షి నారదుడు అక్కడికి చేరుకుని గతంలో స్వామి మునులకు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకుని ఇది విష్ణువు అర్చావతారంగా గుర్తెరిగి పురజనులకు తెలిపాడు. కలియుగంలో పాపం పెచ్చుమీరిన తరుణంలో స్వామి దర్శనంతో ఆలోచన సవ్యమై జీవనం సుఖంగా సాగుతుందనేది పురాణ ఇతివృత్తం.

🌿పెద్ద తిరుపతి, ద్వారకా తిరుమల(చిన్నతిరుపతి)లానే కోనసీమ తిరుపతిగా నౌకాపురమనే ఇప్పటి వాడపల్లి క్షేత్రం ఎంతో ఖ్యాతి గడించింది. నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం చూడగానే ఆనందింప చేసే రూపంగా లక్ష్మీ స్వరూపుడై వెంకన్నదర్శనమిస్తాడు.

🌷ఆలయం🌷

🌸మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింపజేసి లయం ముందుభాగంలో పదహారు స్తంభాలతో కూడిన యజ్ఞశాల కనిపిస్తాయి. ప్రధానాలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు మరియు ద్వాదశ గోపాలాలలో ఒకటిగా చెప్పుకునే నారద 

🌿ప్రతిష్టితమైన శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణు గోపాలస్వామి, త్తరం వైపున అలివేలుమంగ, ఆగ్నేయ భాగంలో రామానుజులు, ఆలయ అభిముఖంగా గరుత్మంతుని ఆలయం కనిపిస్తాయి. అలాగే ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుని ఆలయం దర్శనమిస్తుంది.

🌸పెద్దాపురం సంస్థానాధీశుడు రాజా వత్సవాయి తిమ్మగజపతి రాజు 1759లో స్థిరాస్థులు సమర్పించారు.
గజేంద్రుడు అనే ఓడల వ్యాపారి ఇక్కడే నివసించేవాడు. దీనికి ఓడపల్లి అనే గ్రామంగా విలసిల్లి తర్వాత వాడపల్లిగా వినుతికెక్కింది. 

🌿తన ఓడలన్నీ భ్రదంగా ఒడ్డుకు చేరితే గుడి కట్టిస్తానని మొక్కుకుని గజరాజు ఈ క్షేత్రం నెలకొల్పినట్టు స్థానికుల వాక్కు.

🌷చైత్రశుద్ధ ఏకాదశి🌷

🌸చైత్ర శుద్ద ఏకాదశి రోజున స్వామి కల్యాణం తీర్థం జరగుతాయి. వాడపల్లి తీర్థం అంటే ఈ ప్రాంతంలో ఎంతో ప్రశస్థి కెక్కింది. మరో విశేషమేమంటే సంతానం కలగని వారు ఈయనను దర్శించుకున్న తర్వాత సంతానవంతులౌతారు. 

🌿అందుకే పటికబెల్లం, హారతి, చిల్లరలతో సంతానం కలిగిన తర్వాత తూకం వేసి స్వామికి సమర్పించడం కద్దు. అంతేకాదు హారతికర్పూరం తోను తులాభారం వేస్తారు. ఈ వేడుకలు చూసి తరించాల్పిందే. కలియుగంలో పాప ప్రక్షాలన కోసం భగవదారాధన తప్పనిసరి. 

🌸పుణ్యక్షేత్రాల ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దేవతార్చన ప్రాంతాల్లో మంత్ర శక్తి (వైబ్రేషన్స్) ఉంటాయనడానికి ఆధునిక కాలంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి....స్వస్తి....🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS