*వినాయక స్వరూపంలోని ఆంతర్యం: అష్ట వినాయక ప్రత్యేకతలు.*
స్వస్తిశ్రీ గణనాయకం గజముఖం మొరేస్వరం సిద్ధిదం, బల్లాళం మురుడం వినాయకమడమ్ చింతామణీ థేవరం లేన్యాద్రిం గిరిజాత్మకం సువరదం విఘ్నేశ్వరం ఓఝరం ! గ్రామే రంజన సంస్థితో గణపతిః కుర్యాత్ సదా మంగళమ్ | ఈ శ్లోకమునందు అష్టవినాయక క్షేత్రములు, అచ్చటి వినాయకుల పేరు చెప్పబడినవి. ఈ శ్లోకము ద్వాదశ జ్యోతిర్లింగముల శ్లోకములను పోలియున్నది.
ఇదే విధముగా, అష్ట వినాయక మంగళ శ్లోకమునందు
వాటిక్రమము క్షేత్రము వినాయకుని పేరు క్షేత్రము వినాయకుని పేరు
1. మోర్గాం శ్రీ మోరేశ్వర్ (లేక) శ్రీ మయూరేశ్వర్ 2. సిద్దటేక్ శ్రీ సిద్ది వినాయక 3. పాలీ శ్రీబల్లాళేశ్వర్ 4. మహాడ్ శ్రీ వరద వినాయక్ 5. ధేవూర్ శ్రీ చింతామణి 6. లేన్యాద్రి శ్రీ గిరిజాత్మజ 7. ఓఝర్ విఘ్నేశ్వరుడు 8. రంజన్గాం శ్రీ మహాగణపతి ఈ ఎనిమిది వినాయక పుణ్యక్షేత్రములు పూణే పట్టణమును చుట్టుకొని వృత్తాకార మండలములో ఉన్నవి. "పూణే" అనగా పుణ్యక్షేత్రమని అర్థము. వినాయక భగవానుడు ఈ పుణ్యప్రదేశ పరిసరములలో తన క్షేత్రములను ఏర్పరుచుకొనినాడు.
అష్ట వినాయకుల పురాణ గాథలు ముద్దల పురాణమునను, గణేశ పురాణములోను, చెప్పబడినవి. వినాయక అనగా సర్వదేవతలకు నాయకుడు, తనకు ఇంకొక నాయకుడు లేడు. (వి-నాయక) అతడే గణపతి, గణనాయకుడు, గణేశుడు, గణ అనగా దేవగణములు, ప్రజలు. వీరికి పతి, నాయకుడు, ఈశుడు - కనుక ఆయనకు ఆ పేర్లు వచ్చినవి. ఆతడే విఘ్నేశ్వరుడు, ఏ ఆటంకములు, విఘ్నములురాకుండా కాపాడే దేవుడు, కనుక సమస్తసత్కార్యములలో ప్రప్రథమముగా పూజింపబడుచుండును.
వినాయకుడు గజముఖుడు, ఏనుగుతలను శిరస్సుగా కలవాడు, లంబోదరుడు, అనగా చాల పెద్దఉదరముకలవాడు, మూషికవాహనుడు, ఎలుకను వాహనముగా గలవాడు, ఏనుగు శిరస్సు - వివేకమునకు చిహ్నము, తుండము - ఓం కారమును సూచించును. ఉదరము - సమృద్ధికి ప్రతీక. మూషికము - కుశాగ్రబుద్ధిని తెలియ చేయును.
వేదవ్యాసులవారు అష్టాదశపురాణములను, అష్టాదశ ఉపపురాణాలను రచించిరి. ఈ ఉపపురాణములలో శ్రీ గణేశ పురాణము ఒకటి, గణేశుని స్మరణమాత్రముచేతనే విఘ్నములు పూర్తిగా తొలిగిపోయి, మనోభీష్టసిద్ది సకల కార్యసిద్ధి కలుగును. గజాననుడు భక్తవత్సలుడు, ప్రణవ స్వరూపుడు, నిత్యసత్య స్వరూపుడు.
గణేశ పురాణమును బ్రహ్మ వ్యాసులవారికి ఉపదేశించారు. ఆయన భృగువునకూ, భృగుమహర్షి సోమకాంత మహారాజునకు ఉపదేశించారు. గణేశ పురాణము, భృగు సోమకాంత సంవాదముతో ప్రారంభమగును. పూర్వము నైమిశారణ్యములో శౌనకాది మునులు లోకకళ్యాణార్థము పన్నెండు సంవత్సరముల సత్రయాగాన్ని తలపెట్టారు. అచ్చటకు సూత మహాముని కూడ వచ్చారు.
సూతులవారిని శౌనకాది మహామునులు కోరగా, ఆతడు ఈ గణేశపురాణమును వారికి వినిపించెను. మన ప్రాచీన సంప్రదాయములో పగటిపూట యజ్ఞయాగాదులు చేయుచూ, సాయంకాలము భగవత్కథా శ్రవణం చేసేవారు. ఈ విధంగా నిద్రలేచినప్పటినుండియు రాత్రిపరుండు వరకు, రోజంతా భగవద్భక్తితో గడిపేవారు.
వినాయకునికి గణాధిపత్యము వచ్చిన చోటు గిరిజాత్మజ క్షేత్రం- లేన్యాద్రి
పరమేశ్వరుని ఉపదేశానుసారము పార్వతీదేవి పుత్రాపేక్షతో 12 సంవత్సరములు గణేశమంత్రమును జపించెనని శ్రీమోరేశ్వర్కు సంబంధించిన పురాణకథలో ఉన్నది. పార్వతీదేవి ఈ విధముగా తపస్సు చేసిన స్థానమే ఈ లేన్యాద్రి పర్వత శిఖరము. ఒక భాద్రపద శుద్ధ చతుర్థినాడు, తలస్నానము చేయుటకు ముందుగా పార్వతీదేవి తనయొంటినుండి తీసిన నలుగుపిండితో విఘ్నేశ్వరునివిగ్రహము చేసి, పూజించెను.
ఆ పూజకు, తపస్సునకు సంతసించి, విఘ్నేశ్వరుడు బాలుని రూపమును ధరించి అవతరించెను. తరువాత 15 సంవత్సరములు పార్వతీమాతతో అక్కడే యుండి తనబాలలీలను ప్రదర్శించెను. బాలగణపతిని చంపుటకై సింధురాసురుడు పంపిన చాలామంది రాక్షసులను హతమార్చెను.
క్రూరాసుర, బాలాసుర, వ్యోమాసుర, కుశలాసుర, ఇంకను మొదలైన పెక్కు మంది రాక్షసులు బాలగణపతిచే చంపబడినారు. విశ్వకర్మ లేన్యాద్రిని సందర్శించి, 6 సంవత్సరములవయస్సులోనున్న గణపతిని పూజించి అతనికి పాశము, పరశువు, అంకుశము, కమలములను అర్పణచేసాడు. బాలగణపతి యొక్క 7వ సంవత్సరమున గౌతమమహాముని అతనికి ఉపనయమును చేసెను.
తరువాత, పరమేశ్వరుడు గణపతికి విఘ్నాధిపత్యమును ప్రసాదించెను. అప్పటినుండి అతడు విఘ్నేశ్వరుడాయెను. పార్వతి, గిరి రాజకుమార్తె, ఆత్మజుడు అనగా తనయుడు. గిరిజాత్మజుడు అనగా పార్వతీ తనయుడు. కనుక, ఇచ్చట వినాయకుని పేరు "గిరిజాత్మజుడు" అయినది. గమనిక: లేన్యాద్రి పర్వతము పూణే జిల్లాలో జన్స్టర్ తాలూకాలో, గోలేగామ్ అనే గ్రామమునందున్నది. ఇది పూణేకు 94 కిలోమీటర్ల దూరమున ఉన్నది.
వినాయక చవితి ప్రతి రోజు చదవ వలసినస్తుతి. శుక్లామ్బరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాన్తయే. అగజానన పద్మార్కం, గజానన మహర్నిశమ్ అనేకదం తం భక్తానాం, ఏకదంత ముపాస్మహే. గజాననం భూతగణాధిసేవితం, కపిత్థజమ్బూఫలచారుభక్షణమ్ ఉమాసుతం శోకవినాశకారకం, నమామి విఘ్నేశ్వరపాదపఙ్కజమ్. స జయతి సిన్ధురవదనో దేవో యత్పాదపఙ్కజస్మరణమ్ వాసరమణిరివ తమసాం రాశీన్నాశయతి విఘ్నానామ్. సుముఖశ్చైకదన్తశ్చ, కపిలో గజకర్ణకః, లమ్బోదరశ్చ వికటో, విఘ్ననాశో వినాయకః. ధూమకేతుర్గణాధ్యక్షో, ఫాలచన్ద్రో గజాననః, వక్రతుణ్డ శ్శూర్పకర్ణో, హేరమ్బః స్కన్ధపూర్వజః. షోడశైతాని నామాని, యః పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ, ప్రవేశే నిర్గమే తథా, సఙ్గ్రామే సఙ్కటే చైవ, విఘ్నస్తస్య న జాయతే. విఘ్నధ్వాన్త నివారణైక తరణి ర్విఘ్నాటవీ హవ్యవాట్ విఘ్నవ్యాళ కులస్య మత్త గరుడో విఘ్నేభ పఞ్చాననః, విఘ్నోత్తుఙ్గ గిరిప్రభేదన పవిర్విఘ్నాబ్ధి కుంభోద్భవో విఘ్నాఘౌఘ ఘనప్రచణ్డ పవనో విఘ్నేశ్వరః పాతుమామ్. ఇతి శ్రీ గణపతి వన్దనమ్
No comments:
Post a Comment