శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలగిరి నల్లపాడు గుంటూరు SRI VENKATESWARA SWAMY TEMPLE NALLAPADU GUNTUR శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము..తిరుమలగిరి...నల్లపాడు..గుంటూరు.
ఓం శ్రీ వేంకటేశాయనమః🙏🙏
గుంటూరుకి అతి సమీపంలో ఉన్న నల్లపాడు హైవే మీద ఉన్న విఘ్నేశ్వర స్వామి గుడి మీదగా వెళ్ళగా, శబరిగిరి నగర్ లో ఉన్న తిరుమలగిరి గుట్ట మీద వెలసిన శ్రీ వెంటేశ్వరస్వామి ఆలయ విశేషాలు.
దేవాలయనికి ఈశాన్యంలో కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా కాలువ ఉండటం ఎంతో శుభప్రదం. ఆలయ ప్రవేశానికి ముందు వేప,రావిచెట్టు క్రింద శ్రీలక్ష్మీ అమ్మవారి విగ్రహం ప్రతిష్టించబడింది. అక్కడే పెద్ద గరుత్మంతుడు మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రాంగణంలో ద్వారపాలకుల మధ్య 42 మెట్ల మార్గం ద్వారా గుట్ట మీదకు చేరుకోవచ్చు. మార్గం ప్రక్కన అందంగా కొన్ని విగ్రహాలు ఉంచారు. దశావతారాలు,రంగనాథ స్వామి, ఆంజనేయస్వామి, శ్రీ కృష్ణుడు, వామనమూర్తి, హయగ్రీవుడు, పరశురాముడు, గరుత్మంతుడు, నారదుడు మొదలైన దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. పైకి చేరుకోగానే పెద్ద ధ్వజస్థంభం ఎదురుగా కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి, క్షేత్రపాలకులు, వనదుర్గాదేవి విగ్రహం, ఒకవైపు వల్మీకం (పుట్ట)పై నాగేంద్రుడు, తులసికోట దర్శనమిస్తాయి. లలిత పీఠపాలిత శ్రీ అలివేలు మంగ, ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అను బోర్డు కనపడుతుంది. ప్రక్కనే పెద్ద ద్వారపాలకులు చుట్టూ చిన్న ఉపాలయాలు గరుత్మంతుని మందిరం, మరోవైపు పవన సుతుడు సింధూరవర్ణ దక్షిణ ముఖ అభయాంజనేయ స్వామి, మరోవైపు వరాహస్వామి దర్శనమిస్తాయి.
మూలవిరాట్టు దర్శనం 9 అడుగుల 7 అంగుళాల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని చూచుటకు రెండు కన్నులు సరిపోవు. నిలువెత్తు విగ్రహం, తిరునామంతో, శంఖు, చక్రాలతో దివ్యంగా కనిపిస్తోంది స్వామివిగ్రహం. ఎంతో అందమైన అద్భుతమైన కలియుగ ప్రత్యక్ష దైవం.
ప్రక్కనే కళ్యాణ ఉత్సవ మూర్తులు ఉన్నాయి. ఏకాదశిలలో విశేష పూజలు కళ్యాణం నిర్వహిస్తారు. "ఓం నమో నారాయణాయ" మంత్రాన్ని చెప్పిన రామానుజుల వారి విగ్రహం, మరోప్రక్క విశ్వక్సేనుడి విగ్రహం, ఇంకొకవైపు పెద్ద అలివేలు మంగ వరద అభయ హస్తముద్రలతో అమ్మవారు దివ్యంగా ఉంటుంది. చల్లని తల్లి లక్ష్మీదేవి మరోవైపు దివ్య తేజస్సుతో దర్శనమిస్తుంది. ఆండాళ్ అమ్మవారు ధనుర్మాసంలో పూజలందుకుంటూ విరాజిల్లుతున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ గోదాకళ్యాణం నిర్వహింస్తారు.
గర్భదోషాలు, సంతానంలేని వారు ఇక్కడ 27 ప్రదక్షిణలు చేసి, పసుపు-కుంకుమ సమర్పిస్తే, దోషపరిహారం కలిగి సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఆలయ వ్యవస్తాపకులు చౌడవరపు శర్మగారి మాతృమూర్తి శ్రీమతి సుశీలమ్మ గారి విగ్రహం కూడా చూడవచ్చు.
తప్పక నల్లపాడు తిరుమలగిరిపై వేంచేసిన శ్రీ లలితాపీఠపాలిత శ్రీ అలివేలు మంగ, ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి, స్వామివారి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆశిస్తూ...
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
No comments:
Post a Comment