Saturday, January 29, 2022

చతుర్ధామాలు (మఠాలు) వివరాలు

చతుర్ధామాలు (మఠాలు) వివరాలు:

🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳

మఠము-పీఠము :- 
~~~~~~~~~~~
సన్యాసులు,బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరుడు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు.

ద్వారకా మఠము :-
****************
ఈ మఠము శంకరులచే,దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది.దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. ఇది కీటవాళ సాంప్రదాయ మఠము.భూతదయతో నిత్యము కీటకములు మొదలైన వాటిని హింసించకుండా అహింసా వ్రతాన్ని ఆచరించడాన్ని కీటవాళ సాంప్రదాయమంటారు. ఈ మఠ సన్యాసులకు చివర 'తీర్ధ' అనిగాని 'ఆశ్రమ' అని గాని ఉంటుంది.ఈమఠానికి క్షేత్రం ద్వారక (గుజరాత్లో ఉంది); పీఠ దేవత సిద్ధేశ్వరుడు; పీఠ శక్తి భద్రకాళి; మఠము యొక్క మొదటి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యులలో ఒకడైన పద్మపాదాచార్యుడు; గోమతీ నది ఈపీఠ తీర్థము.ఇక్కడ ఉండే బ్రహ్మచారులను స్వరూపులని వ్యవహరిస్తారు.సన్యాసంతీసుకోబోయేముందు బ్రహ్మచారిగాచేరి శిక్షణపొంది సన్యాసం స్వీకరిస్తారు. స్వరూపులనే ఈ మఠ సన్యాసులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది.తత్త్వమసి అనేది ఈమఠంయొక్క మహావాక్యం.ఈ వాక్యం జీవ, బ్రహ్మల ఐక్యతను ప్రతిపాదిస్తుంది.బ్రహ్మచారులు అవిగత గోత్రానికి చెందినవారుగా పరిగణింప బడతారు.సింధు,సౌరాష్ట్ర,మహారాష్ట్రములు వాటి మధ్యనున్న పశ్చిమభారత ప్రాంతం ఈ మఠం పరిధిలోకి వస్తాయి.ఈ ప్రాంతంలో హిందూమతధర్మాన్ని సుస్థిరం చేయవలసిన బాధ్యత ఈ ద్వారకామఠానిది.

గోవర్ధన మఠము :-
****************
దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు.ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో ఉంది.ఈ మఠం భోగవార సంప్రదాయానికి చెందినది. ఇక్కడి సన్యాసులు 'వన','అరణ్య'అను యోగపట్టములు ధరిస్తారు.మఠక్షేత్రం పురుషోత్తమం (పూరీ);పీఠ దేవత పురుషోత్తముడు (జగన్నాథుడు; పీఠశక్తి వృషలాదేవి (సుభద్ర);మఠము యొక్క మొదటి ఆచార్యుడు హస్తామలకాచార్యుడు; మహోదధి ఈ మఠ తీర్థము.ఈమఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు.భోగమంటే విషయములు. ఎవరు జీవులను విషయ లంపటముల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ సాంప్రదాయం.ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది.'ప్రజ్ఞానం బ్రహ్మ' అనేది ఈ మఠం యొక్క మహావాక్యము.ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. ఇక్కడి బ్రహ్మచారులు కాశ్యపగోత్రీకులుగా పరిగణింపబడతారు. అంగ,వంగ,కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు.ఈ ప్రాంత హిందూధర్మ పరిరక్షణ ఈ పీఠం బాధ్యత.

శృంగేరీ మఠము :-
****************
ఇది దక్షిణామ్నాయమఠమని, శారదాపీఠమనీ పిలువబడుతుంది.కర్ణాటక రాష్ట్రములోని శృంగేరి (శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది.ఈ పీఠ దేవత వరాహుడు; పీఠ శక్తి శ్రీ శారదాదేవి; పీఠ క్షేత్రం రామేశ్వరం; పీఠ తీర్థం తుంగ నది.ఇక్కడి బ్రహ్మచారులను చైతన్యులని పిలుస్తారు. ఈ మఠము యొక్క మొదటి అధిపతి సురేశ్వరాచార్యుడు.ఈ మఠ సన్యాసులు పదియోగపట్టములలో దేనినైనా స్వీకరించవచ్చు. వీరు భూరివాళ సంప్రదాయానికి చెందిన వారు.భూరి అంటే బంగారము అని అర్థము.ఏ సాంప్రదాయం మానవులను కాంచనశక్తి (ధన వ్యామోహం,ధర్మబద్ధమైన ధనాపేక్షకాక) నుండి వారిస్తుందో అది భూరివాళ సాంప్రదాయం.ఇక్కడ యజుర్వేదం ప్రత్యేకంగా పఠించబడుతుంది.అహం బ్రహ్మాస్మి అనేది ఈ మఠము అనుసరించే మహావాక్యం. వీరిది భూర్భువ గోత్రం. ఆంధ్ర, కర్ణాట, ద్రవిడ, కేరళ ప్రాంతములు ఈ మఠ పరిధిలోకి వస్తాయి.

జ్యోతిర్మఠము :-
*************
దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం; పీఠ దేవత నారాయణుడు; పీఠ శక్తి పూర్ణగిరి; పీఠ తీర్థం అలకనంద (గంగానది). వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి","పర్వత","సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.

శంకర మఠము{కంచికామకోటి పీఠము} :-
**************** ****************
సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.

ఈ మఠము శంకర మఠముగా కన్న కంచి మఠముగానే ప్రసిద్ధము.దీనిని సర్వజ్ఞ పీఠము అని కూడా అంటారు. ఇది దక్షిణదేశము లోని కాంచీపురము లో ఉన్నది. ఇక్కడి ఆచార్యుల యోగ పట్టనామము 'ఇంద్రసరస్వతి'. ఈ నామము శ్రీ చంద్ర శేఖర ఇంద్ర సరస్వతి,శ్రీ జయేంద్ర సరస్వతి,శ్రీవిజయేంద్ర సరస్వతి ఈ విధముగా వాడబడుతున్నది. కంచిపీఠములో దేవత చంద్రమౌళీశ్వరస్వామి, శక్తి కామాక్షీదేవి. ఈ పీఠప్రథమ ఆచార్యుడు సాక్షాత్తు ఆది శంకరుడే అంటారు.తన తర్వాత పీఠాధిపతి గా సర్వజ్ఞాత్ముడనే బాల సన్యాసిని ఏర్పరచి, శృంగేరీ పీఠాధి పతి అయిన సురేశ్వరాచార్యుడి సంరక్షణ లో ఉంచాడని కంచి పీఠం చరిత్ర చెబుతోంది .ఐదవ శతాబ్దము నుండి కంచి పీఠము విజయ పథములో నడుప బడుతున్నది. 🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS