గర్భవతులు: వాస్తు, పూజలు, వ్రతాలు
మహిళలకు భక్తిభావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తారు. నిత్యం పూజ కోసం పూలు కోసి, మాలగా కట్టి భగవంతునికి సమర్పించడంలో సంతోషాన్ని, సంతృప్తిని పొంతుతారు. పూజలు, వ్రతాలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. ఇక శ్రావణ.. కార్తీక వంటి మాసాల్లో అయితే వాళ్లు మరింత తీరిక లేకుండా దేవుని సన్నిదానంలోనే గడుపుతుంటారు.
అయితే వారు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..? వారిపై ఇంటి వాస్తు ప్రభావం పడుతుందా..? అనే సందేహాలు ప్రతి వారిలో వస్తుంటాయి.
వాస్తు ప్రభావం
గర్భవతి నివాసం ఉండే గృహ ప్రభావం ఆమెపైన, ఆమె గర్భస్థ శిశువుపైనా పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందువల్ల మూడు నెలలు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త నిర్మాణాలు చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటపుడు పూర్తిగా చేయకపోయినా, కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం వలన ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కనుక ఇంటికి మార్పులు, చేర్పులు కాని, కొత్త నిర్మాణం చేపట్టడం గానీ మంచిది కాదు.
పూజలు, వ్రతాలు
స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా? లేదా ? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలనీ, కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని, గుడి చుట్టు ప్రదక్షిణాలు చేయకూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ, పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదు.
కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం, కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.
5వ నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని, ఆ తర్వాత చేయకూడదని శాస్త్రం చెబుతోంది.
పూజలు, వ్రతాలు పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి.. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది...
No comments:
Post a Comment