Sunday, January 16, 2022

అమ్మవారి నవరాత్రి పూజా విధి , పూజకు ఉపయోగించాల్సిన సామాగ్రి

 అమ్మవారి నవరాత్రి పూజా విధి , పూజకు ఉపయోగించాల్సిన సామాగ్రి



శరన్నవరాత్రుల పూజా విధానం , తప్పక తెలుసుకోవాల్సినవి

శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభించే ముందురోజునాటికే పూజాసామగ్రి , పూజాద్రవ్యాలు , హోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి. 


పూజామందిరంలో 9 అంగుళాలు ఎత్తుగల పీఠాన్ని ఏర్పరచుకొని , పీఠముపై ఎర్రని వస్త్రము పరిచి , బియ్యము పోసి , దానిపై సువర్ణ , రజిత , లేదా తామ్రా కలశమును ఉంచి , కలశమునకు దారములు చుట్టి , కలశములో పరిశుద్ద నదీజలములను నింపి ,

అందు లవంగములు , యాలకులు , జాజికాయ , పచ్చకర్పూరము మొదలగు సువర్ణద్రవ్యాలు వేసి , నవరత్నాలు , పంచలోహాలను వేసి , పసుపు , కుంకుమ , రక్తచందన , చందనాదులను వేసి , మామిడి , మారేడు , మోదుగ , మర్రి , జమ్మి చిగుళ్ళను ఉంచి , పరిమళ పుష్పాదులను వేసి , దానిపై పీచు తీయని , ముచ్చిక కలిగిన టెంకాయనుంచి , దానిపై ఎర్రని చీర , రవిక వేసి , కలశమును చందన , కుంకుమ , పుష్పాదులతో అలంకరించాలి.


యధా శాస్త్రీయముగా విఘ్నేశ్వరపూజ చేసి , రక్షాబంధన పూజ చేసి , రక్షాబంధనాన్ని ధరించి , కలశస్థాపన పైన చెప్పిన విధంగా చేసి , ప్రాణప్రతిష్ట కరన్యాసములు చేసి , షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా , సహస్ర నామములతో , త్రిశతీ నామములతో ,


అష్ణోత్తర శతనామములతో , దేవీఖడ్గమాలా నామములతో , పసుపు , కుంకుమ , హరిద్రాక్షతలు , కుంకుమాక్షతలు , రక్తచందనాక్షతలు , శ్రీచందనాక్షతలు , బిల్వదళములు , తులసీదళములు , పరిమళ పుష్పాదులతో అర్చన చేసి , నవకాయ పిండివంటలతో రకరకాలైన ఫలములను , చలివిడి , వడపప్పు , పానకము , తేనె , పంచదార , పెరుగు , నివేదన చేసి , మంగళహారతిచ్చి అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించాలి. తల్లీ ! ఈ నవరాత్రులు నా ఈ శరీరాన్ని మనసును నీ అధీనం చేస్తున్నాను.


నాచే ఈ నవరాత్ర ప్రతదీక్ష దిగ్విజయంగా నిర్వహింపచేసుకొని , నన్ను ఆశీర్వదించు తల్లీ ! అని ప్రార్థించాలి. హస్తా నక్షత్రముతో కూడుకొన్న పాడ్యమినాడు మాత్రమే కలశస్థాపన చేయాలి. ఈ విధంగా నవరాత్ర వ్రతము ఆరంభించిన దగ్గరనుండి బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి , స్నాన సంధ్యాదులు ముగించుకొని , త్రికాలార్చనగానీ , షట్కాలార్చనలతోగానీ అమ్మవారిని తృప్తి పరుసూ , ఉదయం నుండీ , సాయంత్రం వరకూ ఉపవాసము ఉండి , సాయంకాల అర్చన ముగించుకొని , అమ్మవారికి మహానివేదన చేసి , నక్షత్రములను దర్శించి భోజనము చేయాలి.



ఉల్లి , వెల్లుల్లి విసర్జించాలి. సాంసారిక సుఖానికి దూరంగా ఉండాలి. మరొనంగా ఉండాలి. పరిశుద్ధంగా , పవిత్రంగా ఉండాలి. భూమిపైనే శయనించాలి. ప్రతినిత్యము అమ్మవారిని నవదుర్గా రూపములో అలంకరించి  ఆరాధించాలి. అమ్మవారియొక్క విగ్రహాన్ని స్థాపన చేసుకోదలచిన వారు అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి , అష్టభుజాలతో , అష్టవిధ ఆయుధాలను ధరించి , సౌమ్యమూర్తియై , అభయప్రదానం సౌమ్యస్వరూపిణిగా గానీ , చతుర్భుజాలతో పద్మాసనం వేసుకొని , సింహాసనం మీద కూర్చొని , చతుర్భుజాలలో అభయ , వరద , పాశ , అంకుశములను ధరించి , సౌమ్యమూర్తిగా కిరీటములో చంద్రవంకను ధరించినటువంటి విగ్రహాన్నిగానీ స్థాపించుకొని ఆరాధించాలి. 


ప్రతినిత్యము అమ్మకు ప్రియమైన చండీసప్తశతీ , దేవీభాగవత , సౌందర్యలహరి పారాయణలను చేసుకుంటూ వుండాలి. సువాసినీపూజ , కుమారీపూజ , శ్రీచక్ర నవావరణార్చనాది అర్చనలతో అమ్మవారిని తృప్తిపరుస్తూ ఉండాలి.


గీత , వాద్య , నృత్యాదులతో అమ్మవారికి ఆనందాన్ని కలుగచేయాలి. నామసంకీర్తనలతో ఆ తల్లిని ఆనందింప చేయాలి. వందలు , వేల దీపాలు వెలిగించి ఆ తల్లికి సంతోషాన్ని కలుగచేయాలి. అమ్మవారికి ప్రియమైన శ్రీవిద్య , చండీ , దశమహావిద్యాది హోమాదులతో అమ్మను తృప్తిపరచాలి.


అమ్మకు ప్రియమైన బాలాషడక్షరీ , లలితాపంచదశాక్షరీ , రాజరాజేశ్వరీ మహాషోడశాక్షరీ , మహామంత్రాదులను యధాశక్తి జపించాలి. ఎర్రని వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఎర్రచందనము , చందనము , పసుపు , కుంకుమ ధరించాలి.


అమ్మకు ప్రియమైన ముత్యాల , పగడాల , రుద్రాక్ష మాలికలను ధరించాలి. అమ్మభావన కలిగి , అమ్మను ఆరాధిసూండాలి. పరుషమైన మాటలు , అమంగళకరమైన వాక్యాలు పలుకకూడదు. పండితులు , బ్రాహ్మణులు , భక్తులు విచ్చేసినయెడల శక్యానుసారము పూజించి , సత్కరించాలి. ఈవిధంగా శక్త్యానుసారము నవరాత్రి వ్రతాన్ని ఆచరించాలి

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS