ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు.
శివ పార్వతులిరువురికి కలిపి ‘శివులు’ అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి – అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ – మంగళకరమైన – రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .
మాస శివరాత్త్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, “ఓం నమఃశివాయ” అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.
*మనోభీష్టాలు నెరవేర్చే మాస శివరాత్రి*
పరమ శివుడికి ‘మాసశివరాత్రి’ అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించడం వలన, కోరిక కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి … పూజా మందిరాన్ని అలంకరించి … సదా శివుడికి పూజాభిషేకాలు నిర్వహించాలి. స్వామికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
ఉపవాస దీక్షను స్వీకరించి ‘ప్రదోష కాలం’లో అంటే సాయం సమయంలో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అభిషేకం అనంతరం స్వామివారిని బిల్వదళాలతో అర్చించాలి. ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి పూజలు జరిపించడం మరీ మంచిది. ప్రదోష కాలంలో కైలాసంలో శివుడు తాండవమాడుతూ ఉంటాడట.
ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆశీనురాలై వుంటుంది. లక్ష్మీదేవి పాటపాడుతూ వుండగా, పరమశివుడి తాండవానికి అనుగుణంగా శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. దేవేంద్రుడు వేణువు వాయిస్తూ వుండగా, సరస్వతీదేవి వీణను మీటుతూ వుంటుంది. మనోహరమైన ఈ దృశ్యాన్ని సమస్త దేవతలు సంతోషంతో తిలకిస్తూ వుంటారు.
ఈ సమయంలో ఆదిదేవుడి నామాన్ని స్మరించినా … ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ … మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందువలన మాసశివరాత్రి రోజున ఉపవాస జాగరణలనే నియమాలను పాటిస్తూ, *ప్రదోష* కాలంలో సదాశివుడిని ఆరాధించాలి. అనుక్షణం ఆయన నామాన్ని స్మరిస్తూ తరించాలి.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
No comments:
Post a Comment