Tuesday, January 23, 2024

అయోధ్య బాల రాముని ఆభరణాల ప్రత్యేకత

అయోధ్య బాల రాముని ఆభరణాల ప్రత్యేకత 


   అయోధ్య: బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు. ఏనుగు, గుర్రం, ఒంటె, బండి వంటివాటిని పెట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఈ వివరాలను వెల్లడించింది.

 *కిరీటం :* బాల రాముడు ధరించిన బంగారు కిరీటంలో సూర్య దేవుని బొమ్మ ఉంది. ఈ కిరీటంలో వజ్రాలు, పచ్చ రాళ్లు, మరకత, మాణిక్యాలను పొదిగారు. దీనిని ఉత్తర భారత దేశ సంప్రదాయంలో తయారు చేశారు. కిరీటం కుడివైపున ముత్యాల దండలను వేలాడదీశారు.

 *కౌస్తుభమణి :*  బాల రాముని హృదయ భాగంలో ఉంచిన కౌస్తుభ మణిని కెంపులు, వజ్రాలతో అలంకరించారు. విష్ణుమూర్తి అవతారాలన్నిటిలోనూ ఇది కనిపిస్తుంది.

 *విజయమాల :* బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఇది చాలా పొడవైనది. కెంపులు పొదిగిన ఈ హారం విజయానికి చిహ్నంగా నిలుస్తుంది. వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం దీనిలో ఉన్నాయి.

*కంఠాభరణం :* అర్ధ చంద్రాకారంలో ఉన్న మరొక హారంలో అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లు ఉన్నాయి. మధ్య భాగంలో సూర్య దేవుని బొమ్మ ఉంది. ఈ హారాన్ని కంఠాభరణం అంటారు. నడుముకు అమర్చిన ఆభరణంలో వజ్రాలు, మరకత, మాణిక్యాలు, కెంపులను పొదిగారు. వజ్రాలు, పచ్చరాళ్లు, ముత్యాలను పొదిగిన పాదిక అనే హారాన్ని నాభి వద్ద అలంకరించారు. అదేవిధంగా భుజకీర్తులు, మండ గొలుసులు, ఉంగరాలను కూడా బాల రామునికి ధరింపజేశారు. బాల రాముని కాళ్లకు కడియాలు, కాలి వేళ్లకు చుట్లు పెట్టారు. వీటన్నిటిలోనూ వజ్రాలు, కెంపులను పొదిగారు. ముత్యాలు, పచ్చ రాళ్లు పొదిగిన బంగారు విల్లు, ఓ బాణం కూడా బాల రాముని చేతుల్లో ఉన్నాయి. వజ్రాలు, కెంపులతో వెండి-ఎరుపు రంగుల్లో నుదుటిపై తిలకాన్ని పెట్టారు. వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, రామచరితమానస్‌ వంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసి ఈ ఆభరణాలను తయారు చేయించినట్లు ట్రస్ట్‌ వెల్లడించింది.

పసుపు రంగు పంచె, ఎరుపు రంగు అంగ వస్ర్తాలను బెనారస్‌ వస్ర్తాలతో తయారు చేయించారు. వీటిపైన శంఖం, పద్మం, చక్రం, నెమలి బొమ్మలు ఉన్నాయి. ఆకర్షణీయమైన జరీ అంచులు ఉన్నాయి.

🚩 *జై శ్రీరామ్* 🙏🏻

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS