ద్వాదశ జ్యోతిర్లింగాలు, జ్యోతిర్లింగ ఉపలింగాలు గురించి తెలుసుకుందాం.
మహేశ్వరుని మహిములు వర్ణనాతీతము. మహాదేవుని మహాత్సంకల్ప భాగ్యమే సృష్టిస్థితి లయాత్మక ప్రపంచం. అటువంటి మహేశుని మహానందభరితమైన జ్యోతిస్వరూపమే జ్యోతిర్లింగములుగా ఆవిర్భవించెను. అదే ఏకరూపతికి నిదర్శనం. బ్రహ్మాండమున, శివలింగములను లెక్కించడం ఎవరి తరం? నిజం చెప్పాలంటే ఈ బ్రహ్మాండమే ఒక మహాలింగమని అందలి చరాచర ప్రాణులలో శివుడు, జ్యోతిర్లింగ స్వరూపునిగా, అంతర్యామిగా నుందువాడని భావము. ఈ పుణ్యభూమిలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అటకం నుండి కటకం వరకు అనాదిగా ఏకాత్మతను ప్రసాదించుచున్న పన్నెండు జ్యోతిర్లింగములు పరచుకొని ఉన్నాయి. అవే ద్వాదశ జ్యోతిర్లింగములుగా వ్యవహరింపబడుతున్నాయి.
అవి:
1. సౌరాష్ట్ర సోమనాథంచ - సోమనాథలింగం (గుజరాత్)
2. శ్రీశైలే మల్లిఖార్జునమ్ - మల్లిఖార్జునలింగం (ఆంధ్రప్రదేశ్)
3. ఉజ్జయిన్యాం మహాకాల - మహాకాలేశ్వరుడు (మధ్యప్రదేశ్)
4. ఓంకారే పరమేశ్వరం - ఓంకారేశ్వరుడు (మధ్యప్రదేశ్)
5. కేదారం హిమవత్పృష్ఠే - కేదారేశ్వరుడు (ఉత్తరాంచల్)
6. ఢాకిన్యాం భీమశంకరం - భీమశంకరుడు (మహారాష్ట్ర)
7. వారణస్యాంచ విశ్వేశం - విశ్వేశ్వరుడు (ఉత్తరప్రదేశ్)
8. త్ర్యంబకం గౌతమతటే - త్రయంబకేశ్వరుడు (మహారాష్ట్ర)
9. వైద్యనాథం చితాభూమౌ - వైద్యనాథుడు (బీహారు)
10. నాగేశం దారుకావనే - నాగేశ్వరలింగం (గుజరాత్)
11. సేతుబంధేచ రామేశం - రామనాథ లింగం (తమిళనాడు)
12. ఘుశ్మేశంచ శివాలయే - ఘుశ్మేశ్వర లింగం (మహారాష్ట్ర)
ఈ విధంగా వివిధ రాష్ట్రాలలో ఆవిర్భవించిన పండ్రెండు జ్యోతిర్లింగాలలో సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతం తీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రపు ఒడ్డున సోమనాధ లింగం), నది ఒడ్డున మూడు (గోదావరి ఒడ్డున త్రయంబకేశ్వర లింగం, రేవానది (నర్మాదానది) తీరంలో ఓంకారేశ్వరుడు, గంగానదీ తీరాన విశ్వేశ్వరుడు) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయ పర్వత శిఖరాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వత శిఖరాలలో భీమశంకరుడు, మేరుపర్వత శిఖరాలలో వైద్యనాథలింగం) మైదానంలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, వేలురు గ్రామంలో ఘుశ్మేశ్వరలింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) గాను పండ్రెండు క్షేత్రాలలో తేజోస్వరూపుడైన పరమశివుడు జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి చెందాడు.
ద్వాదశ జ్యోతిర్లింగానికి చెందిన ఉపలింగములు కూడ ప్రసిద్ధి చెందినవి. సోమనాథుని ఉపలింగము అంతకేశుడని, మహానది - సముద్రము కలసిన చోట విలసిల్లెను. మల్లికార్జునుని ఉపలింగము రుద్రేశ్వరుడనబడే భృగుకక్ష అనే స్థలంలో నెలకొనియున్నదనియు మహాకాలుని ఉపలింగము నర్మదా నదీతీరంలో దుగ్దేశుడనే పేరుతో విరాజిల్లుచున్నది, ఓంకారేశ్వరుని ఉపలింగం కర్థమేశుడనబడుచు బిందు సరస్సు చెంత ప్రసిద్ధమైనది. కేదారేశ్వరుని ఉపలింగము యమునా తీరమున భూతేశుడను పేరుతో ప్రఖ్యాతమైయున్నది. భీమశంకరుని ఉపలింగము సహ్యపర్వతము పై భీమేశ్వరుడని చెప్పబడుచున్నది. విశ్వేశ్వరుని ఉపలింగము ఆత్రేశ్వరుడని మందాకినీ నదితీరంలోను, త్రయంబకేశ్వరుని ఉపలింగము మహాబలేశ్వరుడు గోకర్ణమనే ప్రాంతంలోనూ, వైద్యనాథుని ఉపలింగము నందేశ్వరుడనే పేరుతోను, నాగేశ్వరుని ఉపలింగము యమునా తీరమున భూతేసుడను పేరుతో మల్లికా సరస్వతి సంగమమున విరాజిల్లుతున్నది. రామేశ్వరుని ఉపలింగము గుప్తేశ్వరుడని గుప్తకాశీలోను, ఘుశ్వేశ్వరుని ఉపలింగము వ్యాఘ్రేశ్వరుడని ప్రసిద్ధి కెక్కినవి. ద్వాదశ జ్యోతిర్లింగములకు ఎంతటి మహత్తు గలదో అంతటి మహత్తు ఈ ఉపలింగాలకు కూడా కలదని శివమహాపురాణం తెలియజేస్తోంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించినా, స్పృశించినా వేరు వేరు మహిమలు తెలియజేస్తున్నట్లు శివపురాణాంతర్గత కోటి రుద్రసంహిత యందు, శివవిజ్ఞాన సర్వస్వములోను ప్రథమాధ్యాయంలో తెలియవస్తోంది. సోమనాధుని మొదలు ఘుశ్మేశ్వరుని వరకు గల ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానికి ఒకొక్క మహిమ కలదు. అయితే ఈ పండ్రెండు జ్యోతిర్లింగములు దర్శించలేని వారు కనీసం ఒక్క లింగమునైన దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుంది
No comments:
Post a Comment