Sunday, December 12, 2021

గుత్తికోండ బిలం... రహస్యాలకు నిలయం

🌹గుత్తికోండ బిలం... రహస్యాలకు నిలయం 🌹

🌷చరితాత్మకం..గుత్తికొండ బిలం 🌼

🏵️ఆషాఢ శుద్ద ఏకాదశికి ముస్తాబు .🏵️

                      ఎన్నో నిగూఢ రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకున్న గుత్తికొండ బిలం దర్శనీయ, రమణీయ, కమనీయ స్థలం. ఆనాటి త్రేతాయుగం కాలం నాటి నుంచి ఈనాటి కలియుగం వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచిన ఈ బిలంలో ఏటా శివరాత్రి పర్వదినం రోజు ప్రత్యేక పూజలు, తొలి ఏకాదశి పురష్కరించుకొని తిరునాళ్ల మహోత్సవం నిర్వహిస్తారు.

పిడుగురాళ్ల మండలం, గుత్తికొండ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన గుత్తికొండ బిలాలు అంతుచిక్కని రహస్యాలకు కేంద్ర బిందువులు. వీటిని ఎప్పుడు కనుగొన్నారో తెలియదు కానీ ఎన్నో శతాబ్దాల నుంచే ఇక్కడి బిలం లోపల వెలసి, చీకటి మల్లయ్యగా పిలవబడే లింగాకారానికి పూజలు జరుగుతున్నాయని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణ కాశీగా పిలవబడే ఈ బిలం నుంచి కాశీకి జలమార్గం ఉందంటారు. పూర్వం కాలయవ్వనుడనే రాక్షసుని సంహారం కోసం శ్రీకృష్ణుడు నాటకీయంగా అతను వెంబడిస్తుంటే ఈ బిలంలోకి ప్రవేశించగా బిలంలో తపమాచరిస్తున్న ముచికుంద మహర్షి అగ్రహజ్వాలలకు రాక్షసుడు భస్మమయ్యాడని పురాణగాథలు చెబుతున్నాయి. 1754 సంవత్సరంలో స్వయం ప్రకాశ అవధూతల స్వామి బిలంలో ఈ లింగాకారాన్ని ప్రతిష్ఠించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. తర్వాత ఎందరో భక్తులు ముచికుంద మహాముని శిష్యులుగా ఈ బిలంలోనే జీవితాంతం గడిపి కాలధర్మం చెందారు. వారి సమాధులు కూడా బిలం వద్ద ఉన్నాయి. 1925 ప్రాంతంలో జూలకల్లు గ్రామానికి చెందిన పేరమ్మ అనే మహిళ రుషుల సాక్షాత్కారం పొంది వారి సేవ చేసుకున్నట్లు తెలుస్తోంది. పేరమ్మ తన అత్తగారి వూరైన దాచేపల్లి నుంచి ప్రతిరోజు రాత్రి గుత్తికొండ బిలానికి చేరుకొని రుషులకు సేవచేసి రాజ రాజేశ్వరి ధ్యానం చేసుకునేదని, ఒకరోజు అత్తింటివారు వెంబడించి వచ్చి ఆమె మహిమ తెలుసుకుని ఆమెను వూరేగింపుగా దాచేపల్లి తీసుకు వెళ్లారని ఆమె బంధువులు చెబుతుంటారు. 1945లో ఆమె మరణించగా ఆమె స్మృతిచిహ్నంగా పుట్టింటి వారు బిలం వద్దే ఆమె సమాధి కట్టించి అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ఇప్పటికీ అన్నదానం చేస్తున్నారు.

బిలంలో 101 మార్గాలు 
గుత్తికొండ బిలంలోకి ప్రవేశిస్తే లోపలికి వెళ్లేకొద్ది ఎన్నో మార్గాలు కనిపిస్తుంటాయి. వీటిలో ఏడెనిమిది మాత్రమే స్థానికులు కనుగొన్నారు. మిగతా వాటిలో ఇప్పటికీ ఎవరూ ప్రవేశించలేదు. బిలమార్గాన్ని వెడల్పు చేసి మెట్లు నిర్మించి ఒక మార్గంలో విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. ఏ మార్గంలో నుంచి లోపలకు వెళ్లినా చివరకు స్వచ్ఛమైన నీటితో కూడిన కోనేరు కనిపిస్తుంది. ఈ నీటిలో రూపాయి బిళ్ల వేస్తే కనపడేంత స్వచ్ఛంగా నీరుంటుంది. ఈ నీటిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నీటి గుండా కాశీకి జలమార్గం ఉందని భక్తుల విశ్వాసం. ఏటా ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి నాడు బిలమహోత్సవం జరుగుతోంది. ఈ మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన గుత్తికొండ బిలం దేవాదాయ పరిధిలో గాని, పురావస్తు శాఖ ఆధీనంలో గానీ లేదు. గుత్తికొండ గ్రామానికి చెందిన ధర్మకర్తలు చీకటి మల్లయ్యనే నమ్ముకొని రుషుల సాక్షాత్కారం కోసం బిలం వద్దే సేవ చేసే భక్తులే ఈ బిలానికి కార్యనిర్వాహకులు.

మావోయిజానికి అంకురార్పణ.. 
రాష్ట్రంలో నక్సల్బరీ ఉద్యమానికి వూపిరిలూనింది గుత్తికొండ బిలంలోనే. చారు మజుందార్‌ నాయకత్వంలో ఇక్కడి బిలంలో 1968 ప్రాంతంలో పీపుల్స్‌వార్‌ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి. కొండపల్లి సీతారామయ్య వంటి అగ్రనాయకులు వీటికి హాజరయ్యారు. ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమానికి తుపాకీ పోరాటానికి ఇక్కడే చారిత్రిక నిర్ణయాలు తీసుకున్నారు. 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే బిలం వద్ద నక్సల్స్‌ తుపాకులు వదిలి అడవుల నుంచి జనారణ్యంలోకి ప్రవేశించారు. గత విప్లవ స్మృతులకు చిహ్నంగా 2004 అక్టోబరు 11న రామకృష్ణ ఆవిష్కరించిన అమరవీరుల స్మారక స్తూపం ఇక్కడ ఉంది.

బిలంలో భరతమాత 
జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఓ మహిళ భారతమాతకు గుత్తికొండ బిలం వద్ద దేవాలయం కట్టించింది. నకరికల్లు మండలం చాగళ్లు గ్రామానికి చెందిన గోవర్ధనమ్మ 20 ఏళ్ల క్రితం భారతమాత విగ్రహాన్ని ప్రతిష్టించి దేవాలయాన్ని నిర్మించింది. అప్పటి నుంచి ధూప దీప నైవేద్యాలతో భారతమాతకు పూజలు నిర్వహించడం ఇక్కడ విశేషం. బిలానికి వెళ్లేదారి మధ్యలో ఉన్న 120 ఏళ్ల నాటి రావిచెట్టుకు హిందూ, ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

🌹🌿🏵️🌹🌿🌺🌹🌿🌼🌹🌿🌼🌹🌿🌼

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS