మార్గశిర బహుళ అష్టమి
▫️
గురు దత్తాత్రేయునికి గృహస్తు రూపం కూడా ఉంది.
అటువంటి గృహస్తు రూప దత్తునకే “అనఘస్వామి” అని పేరు.
ఆ స్వామి అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.
ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము.
అఘము అంటే పాపము. ఈమె అనఘ.
అంటే ఏవిధమైన పాపము లేనిది, అంటనిది అని అర్థం.
మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి.
ఈ మూడు విధాలుగా జరిగే పాపాలను
అనఘాదేవి పోగొడుతుంది.
అందుకే అనఘాదేవి ఉపాసన సకల పాపాలను
హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి,
మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి.
అనఘస్వామిలో బ్రహ్మ,రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి.
అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము.
ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన
జీవనం గడుపుతూ భక్తులకు తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించే
అతి ప్రాచీన, ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు
(అణిమా,లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం ,ఈశిత్వం, వశిత్వం,
కామావసాయితా, మహిమా ) పుత్రులై అవతరించారు.
అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగం నందు ప్రీతిగలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది.
వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది.
కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే “మధుమతి ” అనే
పేరు కూడా కలదు. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి
ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను
వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము .
అనఘాదేవి యోగశక్తి తాలూకు ప్రకాశస్వరూపంగా
ఉపాసకులు భావిస్తారు. అనఘా ఉపాసన ద్వారా
సిద్ధిపదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు.
కవితాశక్తి, కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది.
అనఘాదేవి యోగేశ్వరి… జగన్మాత.
ఈమెకు మధుమతి అనే పేరు కూడా ఉంది.
అనఘను ధరించిన స్వామి అనఘుడు.
అతడే దత్తాత్రేయుడు.
అనఘాదేవిని స్మరిస్తూ చేసే వ్రతం అనఘాష్టమీ వ్రతంగా
అత్యంత ప్రసిద్ధి పొందింది.
▫️
No comments:
Post a Comment