Thursday, July 13, 2023

సాలగ్రామం అంటే ఏమిటి ? సాలగ్రామం ఎన్ని రకాలు ?

సాలగ్రామం అంటే ఏమిటి ?  సాలగ్రామం ఎన్ని రకాలు ?


సాలగ్రామం అనేది ఒక రకమైన రాయి. అయితే , ఇది ఓ పురుగువల్ల  అంటే ఓ జలచరం వల్ల తయారౌతుంది అంటే అతిశయోక్తి కాదు. సాలాగ్రామాలు చాలా చాలా అరుదైనవి. ఇవి నర్మదానదిలో దొరుకుతాయి. అలాగే ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీనదిలో దొరుకుతాయి. ఈ గండకీనది తీరంలో *”ముక్తినాథం”*  పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి. మరెక్కడా ఇవి లభ్యం కావు.
సంస్కృతంలో  *”శిలగా మారిన శలభమే సాలగ్రామం”* అంటూ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎంత ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే , ఎంత చిన్నది అయితే అంత గొప్పది. కాలం గడిచిన తర్వాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి.
ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది. రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి లక్షణాలు ఉంటాయి. గట్టిపడకముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది.
సాలగ్రామం విశిష్ట శిలారూపం. ఇవి వేల , లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్ళలో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తర్వాత సాలగ్రామంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇది జరాసిక్ టెతీన్ కాలానికి చెందినది.
సాలగ్రామం సంపాదించి , దేవుడి మందిరంలో ఉంచుకుంటే ఎంతో మంచిది. దీన్ని నియమనిష్టలతో పూజించాలి. ఏ మంత్రాలూ రానివారు మనసునే అర్పించుకుంటూ ప్రార్ధించాలి. సాలగ్రామం ఒకవేళ పగిలిపోయినా , దాని విలువ తగ్గదు. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని సేవించడం శ్రేష్టం.

*‘సాలగ్రామం’ ఎన్ని రకాలు ?*
 

*' సాలగ్రామం '* సాక్షత్ విష్ణుస్వరూపం. దీనిని అభిషేకించిన పుణ్యజలాన్ని ప్రోక్షించుకుంటే సర్వపాపాలు నశిస్తాయి. సర్వరోగాలు నశించి , సకల సంపదలు లభిస్తాయి. సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి  కలుగుతుందని ఋషివాక్కు. విష్ణుభగవానుడు *‘సాలగ్రామం’* అనే రాయి రూపాన్ని ధరించడం వెనుక అనేక కథలున్నాయి. అందులో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని పెళ్ళాడుతుంది. ఆమె మహాపతివ్రత.  కానీ , జలంధరుడు తన రాక్షస ప్రవృత్తితో అందరిని పీడిస్తుంటాడు. అతను ఎంతవరకు వెళ్ళాడంటే , ఒకానొకప్పుడు శివుని రూపంలో వెళ్ళి పార్వతీదేవిని మోసగించబోయాడు. అందుకు కోపగించిన పార్వతీ దేవి విష్ణువును సమీపించి బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది. బృంద పాతివ్రత్య భంగం సకల లోకాలకు అవసరంకూడా. ఎందుకంటే ఆమెకి ఆ భంగం కలిగితేనే జలంధరుని అంతం జరుగుతుంది. సకల లోకాల క్షేమం కోరి విష్ణుభగవానుడు జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు. అనంతరం తన నిజరూపాన్ని ప్రకటిస్తాడు. జరిగిన మోసానికి నివ్వెరపోయిన బృంద విష్ణుమూర్తిని శిలగా మారతావని శపిస్తుంది. అలా శ్రీవిష్ణుభగవానుడు సాలగ్రామ రూపాన్ని ధరించాల్సి వచ్చిందని కథ.

సాలగ్రామ శిలలు గండకీనదిలో లభిస్తుంటాయి. ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిదని అంటారు. సాలగ్రామంపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.

ఒక చక్రం  ఉంటే సుదర్శనమని ,

రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ అని ,

మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడనీ , 

నాలుగు చక్రాలు ఉంటే జనార్ధుడు అనీ, 

ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడనీ ,

ఆరు చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడనీ ,
 
ఏడు చక్రాలు ఉంటే సంకర్షణుడు అనీ , 

ఎనిమిది చక్రాలు ఉంటే పురుషోత్తముడు అనీ ,

తొమ్మిది చక్రలు ఉంటే నవవ్యూహమని ,

పది చక్రాలు ఉంటే దశావతారమనీ ,

పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు అని ,

పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అనీ ,

పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి అని పిలుస్తుంటారు.

సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ , పంచామృతంతోగానీ శుద్ధి చేసి , రుద్రాక్షధారణ చేసేటప్పుడు చేసే నియమాలతో సాలగ్రామాన్ని పూజించాలి. ఇంట్లో  పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి. కుటుంబసభ్యులు తప్ప , మిగతావాళ్ళకి సాలగ్రామాన్ని చూపించకూడదు. సాలగ్రామాన్ని స్త్రీలు తాకరాదన్న నియమం ఉంది. సాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానం చేసినా , దానం చేసినా కాశీక్షేత్రంలో చెసిన స్నాన , దానాల కంటే నూరురెట్లు ఫలితం కలుగుతుందనేది ఋషివాక్కు. సాలగ్రామ శిలకు షోడశోపచార పూజ చెస్తే అన్ని కల్పాంతాల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. సాలగ్రామ పూజ చేస్తే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుంది. మంత్రాలేమి తెలియక పోయినప్పటికీ భక్తి విశ్వాసాలతో సాలగ్రామం పూజను చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సర్వపాపహరం చేసేది , సర్వకష్టాలనుంచి రక్షించేది సాలగ్రామం.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS