Monday, July 31, 2023

మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం...........!!

మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం...........!!

మనిషి ఆకారాన్ని బట్టి, మాట్లాడే తీరును బట్టి, ప్రవర్తించే తీరుని బట్టి ఏ గ్రహం ఆ సమయంలో అతనిపైన పనిచేస్తోందో తెలుసుకోవచ్చు. అలాగే జాతకంలోని బలీయమైన గ్రహాన్ని కూడా వెంటనే తెలుసుకోవచ్చు. తరువాత జాతకాన్ని పరిశీలిస్తే ఇది నిజం కావటం జరుగుతుంది. దీని ద్వారా కొన్ని ఆశ్చర్య పరిచే విషయాలు తెలుస్తాయి.

గ్రహాల ప్రభావాలు స్థూలం గా ఇక్కడ ఇస్తున్నాను. ఇవన్నీ జ్యోతిష గ్రందాలనుంచి సేకరించబడినవి, మరియు నా అనుభవంలో అనేకసార్లు నిజాలుగా రుజువు అయినవి.

 సూర్యుడు - అధికారం చెలాయించటం, ఉన్నతులమని భావించటం మాత్రమె కాక అలాగే ప్రవర్తించటం, నాయకత్వ లక్షణాలు, పదిమందిలో తేలికగా గుర్తింపు ఉంటే వారు సూర్యుని ప్రభావం లో వారు.

>పూర్ణ చంద్రుడు- మృదు స్వభావం, జాలిపడే తత్త్వం, సహాయ పడే తత్వం, మానవ సంబంధాలు.

>క్షీణ చంద్రుడు-ఏదీ తేల్చుకోలేని ఊగిసలాట ధోరణి, బలహీన మనస్తత్వం, పిచ్చి ధోరణి, విపరీత ఆలోచనలు.

>బుధుడు-తెలివి తేటలు, బహుముఖ ప్రజ్న,హాస్య చతురత, కలుపుగోలు తనం.

>కుజుడు-ధైర్యం, దురుసుతనం, కయ్యానికి కాలుదువ్వటం,సాహసం, మొండి పట్టుదల.

>గురువు- ధార్మిక మనస్తత్వం, మంచితనం, సహాయపడే గుణం, అడ్డదారులు తొక్కని మనస్తత్వం, ముక్కుసూటితనం.

>శుక్రుడు-అందం, విలాసాలు, జల్సాలు, కళా కౌశలం , ఖరీదైన జీవితం .

>శని- కాయకష్టం చెయ్యటం, సోమరితనం, అశుభ్రం గా ఉండటం, పిరికితనం, చొరవ లేకపోవటం.

>రాహు- మోసం, ఇతరుల సొమ్ము ఆశించటం, కుట్రలు, దౌర్జన్యాలు, సంప్రదాయాన్ని ప్రశ్నించటం, ఎదురు తిరగటం, వృధాగా తిప్పట, కాళ్ళరిగేలా తిరిగే ఉద్యోగాలు, అతి వాగుడు, గమ్యం లేని జీవితాలు గడపటం .

>కేతు-చాప కింద నీరులాంటి మనస్తత్వం, పిరికి ఆధ్యాత్మికత, మెట్ట వేదాంతము, ప్రమాదకర కుట్రలు చెయ్యటం, లేక ముచ్చు లాంటి ప్రవర్తన.

ఇక రెండు మూడు గ్రహాల కలయికలో ఆయా గుణాల సమ్మిలిత ప్రభావం మనిషి మీద ఉంటుంది. ఆయా గ్రహాల దశలు జరిగేటప్పుడు పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా కనిపించటం, ఆలోచనలు అలాంటివే కలగటం, ప్రవర్తనలు కూడా అలాగే ఉండటం చూడవచ్చు.

కొందరు మనుషులను చూస్తె వారిలో కొన్ని గ్రహాల మూర్తీభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇంకొందరి ప్రవర్తన చూస్తె వారికి ఏ దశ జరుగుతున్నదో అంచనా వెయ్యవచ్చు. అంతే కాదు కొన్నికొన్ని శరీరభాగాల తీరును బట్టి కొన్ని గ్రహాల ప్రభావం చాలావరకూ అంచనా వెయ్యవచ్చు.

ఉదాహరణకు...... ఎత్తుపళ్ళు ఉన్నవారికి రాహువు రెండవభావంలో ఉండటం చాలా జాతకాల్లో చూచాను.అంతేకాక పిల్లికళ్లు ఉన్నవారిమీద రాహు/కేతువుల ప్రభావం ఉండటం వారి మాటలలో చేతలలో గమనించవచ్చు. అలాగే ఒక కాలు కుంటివారికి ఎక్కువగా శనిగ్రహప్రభావం ఉండటం గమనించాను.అలాగే బట్టతల ఉన్నవారి మీద శని రాహుగ్రహాల ప్రభావం అమితంగా ఉండటం చూడవచ్చు. 

పొట్టిగా బొద్దుగా ఉన్నవారిమీద బుధ గ్రహప్రభావం ఉంటుంది.అవకాశ వాదులు అతిగా వాగే వారిమీద బుధ రాహుగ్రహాల ప్రభావం ఉంటుంది. అలాగే మొండిపిల్లలు,క్రమశిక్షణ లేని పిల్లల మీద రాహు,కుజుల ప్రభావం ఉంటుంది.ఇవన్నీ గ్రంధాలలో సూటిగా చెప్ప బడకపోయినా,అన్యాపదేశంగా చెప్పబడ్డాయి.నా పరిశీలనలో ఇవన్నీ నిజాలు కావటం గమనించాను.

తెల్లగా అందంగా ఉన్నవారు ఎక్కువగా వృషభ,తులాలగ్నాలలో పుట్టటం గమనించవచ్చు.అలాగే కురూపుల మీద కేతు ప్రభావం ఉండటం చూడవచ్చు. వయసుకంటే ఎక్కువ ముసలివారిగా కనిపించేవారి మీద శని ప్రభావం, సాంప్రదాయ మతవాదులు,వేషభాషలలో ఆచారపరుల మీద గురుప్రభావం జాతకంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.దురుసుగా ప్రవర్తించేవారు,రౌడీలు ఇటువంటి జాతకాలలో కుజ/రాహువుల పాత్ర కనిపిస్తుంది.నాటక,సినీ రంగాల వారిమీద శుక్ర/రాహు ప్రభావం ఉంటుంది.

ఆయా వ్యక్తుల మీద ఆయాగ్రహాల ప్రభావం,జాతకంలో ప్రముఖ గ్రహ పరంగానూ(అది లగ్నం అధిపతిగా కావచ్చు,లేదా ఆత్మ కారకునిగా కావచ్చు, లేదా బలీయమైన గ్రహంగా కావచ్చు) లేదా అప్పుడు నడుస్తున్న దశ/అంతర్దశల పరంగానూ ఉంటుంది.

ఈ విధంగా పరిశీలన జరిపెకొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ, మనిషిని చూట్టంతోనే, అతని జాతకంలో ముఖ్యవిషయాలు మనసుకు స్పురించటం మొదలౌతుంది. అలాగే అతనికి అప్పుడు జరుగుతున్న దశ చూచాయగా తెలియటం జరుగుతుంది.ఇలా నాకు చాలా సార్లు జరిగింది.త్వరలో మీకు ఫలానా సంఘటన జరుగుతుంది అని మనసుకు తోచటం,అవి చెప్పటం,అవే సంఘటనలు జరగటం కూడా చాలాసార్లు జరిగింది.

అయితే జాగ్రత్తగా ఉండమని మనం చెప్పినప్పటికీ వారు వాటిని తప్పించుకోలేక పోవటం ఎక్కువసార్లు జరిగింది. దీనికి కారణం నూటికి తొంభై పాళ్ళు ఆయా వ్యక్తుల నిర్లక్ష్యధోరణి మాత్రమె కారణం అవుతుంది. కర్మ బలీయంగా ఉన్నపుడు, మనల్ని పరిహారాలు చెయ్యనివ్వదు.అంతేకాక ఆ వ్యక్తి మీద రకరకాలుగా పనిచేసి ఆ కర్మను అనుభవించేటట్టు చేస్తుంది. ఏలాగంటే, నిర్లక్ష్యధోరణి,అహంకారం, లేదా వీడికేమి తెలుసులే అనే తిరస్కార ధోరణి,జరిగేది జరుగక మానదు అనే నిరాశాపూరిత ధోరణి,పరిహారాలు మొదలు పెట్టి మధ్యలో వదిలెయ్యటం ఇలా రకరకాలుగా మనిషి మీద పనిచేసి మొత్తానికి రేమేడీలు చెయ్యలేకపోవటం,ఆ కర్మను అనుభవించటం చేయిస్తుంది.అంతేకాక మాట తీరు, ప్రవర్తనను బట్టి వారి జాతకంలో ఉన్న దోషాలు మనస్సుకు స్పురించటం కూడా జరుగుతుంది.

ఇదెలా జరుగుతుంది? అంటే నాకు తెలిసి ఒక కారణం కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన డాక్టరుకు రోగిని చూడటంతోనే ఒక ఊహ వస్తుంది. ఇతనికి రక్తహీనత ఉంది, లేదా బీపీ ఉండవచ్చు,లేదా గుండెజబ్బు ఉండవచ్చు ఇత్యాదిగా ప్రాధమికంగా ఎలాగైతే ఒక అవగాహన కలిగి తరువాత ప్రశ్నల ద్వారా పరీక్షల ద్వారా ఆ ఊహను నిజమా కాదా నిర్థారించుకుంటారో, అలాగే జ్యోతిర్విజ్ఞానంలో కూడా జరుగుతుంది.

ఏళ్ళతరబడి మనకు ఈ విధమైన విశ్లేషణ అలవాటు అయినప్పుడు, మన అన్తఃచ్చేతనలో మనకు తెలీకుండానే కొన్నిరకాల ఆలోచనా విధానాలు (thought patterns)తయారై ఉంటాయి. అవి అలవాటు మీద, కొన్నికొన్ని పరిస్థితులలో వాటంతట అవే ఉత్తెజితాలై మనకు కొంత సమాచారాన్ని అందిస్తాయి.దాన్నే మనం స్ఫురణ అని అనుకుంటాము.అంటే సమాచారం మనకు తెలీకుండానే ఒక రూపాన్ని సంతరించుకొని మనకు స్పురించటం జరుగుతుంది. ఆయా ఆలోచనల మధ్యన సంక్లిష్ట సమీకరణాలు మనకు తెలీని అన్తఃచ్చేతనలో జరిగి ఫలితం మాత్రం పైకి ఉబికి ఉపరితలానికి వస్తుంది. ఇదెలా ఉంటుందంటే కంప్యూటరు క్లిష్టమైన లెక్కలను లోపల్లోపల చేసి ఫలితాన్ని మాత్రం తెరమీద చూపినట్లు ఉంటుంది.

కొంతమందిని చూచి మీది ఫలానాలగ్నం లేదా ఫలానా నక్షత్రం అవునా అని అడిగితే వారు ఆశ్చర్యపోయి నిజమే మీకెలా తెలుసు అని అనటం నాకు చాలా సార్లు జరిగింది. కొన్ని సార్లు ఫెయిల్ కూడా అయ్యాను.కాని చాలాసార్లు సరిగ్గా జరిగినపుడు తప్పకుండా వీటికి ఏవో లింకులు ఉన్నాయి, ఇది మనకు అర్థం కాక పోయినా ఒక గొప్ప శాస్త్రమే అని అనిపించక మానదు.

దీనివల్ల ఇంకొక లాభం కూడా ఉంది. ఈ విధమైన పరిశీలన అలవాటైతే, మనిషికి బోరు అనేది ఉండదు. దానికి తోడూ లోతైన పరిశీలనాశక్తి అలవాటు అవుతుంది.మనుషుల మధ్యన ఉండికూడా, మౌనంగా ఉంటూ, ఏ పుస్తకాలు, టీవీలు,సెల్ ఫోన్లు లేకుండానే బోరు అనేది లేకుండా ఉండటం అలవాటు అవుతుంది.

ఇంకొంచెం అనుభవం మీద, అతి దగ్గిరలో జరుగబోయే విషయాలు స్పురించటం చాలాసార్లు జరిగింది. ఫలానా వ్యక్తి మీద ఫలానా గ్రహం ప్రభావం ఉంది అని తెలిసినపుడు, త్వరలో ఆ గ్రహానికి గోచారరీత్యా పట్టబోతున్న అవస్త మనకు తెలుసు గనుక ఈవ్యక్తికి కూడా అదే అవస్త పడుతుంది అని అనిపించటం అలాగే జరగటం చాలాసార్లు జరిగింది.

ఉదాహరణకు....... గురుగ్రహ ప్రభావంలో ఉన్న వ్యక్తికి గురువు నీచలో ఉన్నపుడు, నీచజీవితం గడపటం,మంచికి పొతే చెడు ఎదురు కావటం, అనుకున్న పనులు జరుగకపోవటం ఊహించి చెప్పాను.ప్రస్తుతం అవే జరుగుతూ ఆ వ్యక్తిని నన్నూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీన్నే కొంచెం పొడిగించి,గ్రహంయొక్క, అతిచార, స్తంభన, వక్ర,అస్తన్గత,గ్రహయుద్ధ, ఉచ్చ,నీచ స్థితులను గమనిస్తూ పోతే ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఈ గ్రహస్థితులకు వ్యక్తుల జీవితంలో జరిగే సంఘటనలకు ఖచ్చితమైన సంబంధం కనిపించింది.

ఇదే రీజనింగును ఇంకొంచం పొడిగించి, కొన్నికొన్నిసార్లు ఫలానా రోజు నీకు ఈ సంఘటనా జరుగవచ్చు అని చెప్పటం అదే జరగటం కూడా జరిగింది. కొన్ని సార్లు ఫెయిల్ అవటం కూడా అయింది. కాని ఫెయిల్ అయినపుడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే కొన్ని కొత్త విషయాలు అర్థం అయ్యాయి. ఆ గ్రహానికి గల ఒక కారకత్వానికి సంబంధించిన సంఘటన జరుగవచ్చు అని మనం అనుకుంటే ఇంకో కారకత్వానికి సంబంధించిన సంఘటన జరిగింది. కాని ఆ గ్రహ కారకత్వాన్ని దాటి ఇంకో గ్రహ కారకత్వానికి సంబంధించిన సంఘటన మాత్రం జరుగలేదు. అంటే చాలావరకూ విశ్లేషణ సరిగ్గా ఉన్నప్పటికీ సూక్ష్మ స్థాయిలలో ఇంకా పరిపూర్ణత రాలేదు అని అర్థం అయింది. 

ఉదాహరణకు.... ఒక వ్యక్తి కుజ గ్రహ పరిధిలో ఉన్నపుడు, గోచారరీత్యా శనిగ్రహ ప్రభావం కుజుని మీద పడుతుంది అనుకున్న రోజున లేదా ఆ పీరియడ్ లో ప్రమాదం జరుగవచ్చు అని చెప్పాం అనుకుందాం.ఆ సమయంలో ప్రమాదం జరుగకుండా,ఎవరితోనో గొడవ జరగటం,తద్వారా దెబ్బలు తగలటం,రక్త దర్శనం కలగటం జరుగుతుంది.ప్రమాదంలో కూడా రక్తదర్శనం జరుగవచ్చు, లేదా గొడవలో కూడా జరుగవచ్చు, లేదా పొరపాటున ఏ వేలో కోసుకొని కూడా జరుగవచ్చు.వీటిలోని సూక్ష్మభేదాలు పట్టుకోవటం,అంచనా వెయ్యటం కష్టం.రక్తం కళ్ళచూడటం జరుగుతుంది అనిచెబితే అది సరిగానే జరుగుతుంది.


No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS