భాస్కరరాయులు
లలితాసహస్రానికి అనేకమంది వ్యాఖ్యలు వ్రాశారు. వాటన్నింటిలోకి మొట్టమొదటిది, మూలమైనది భాస్కరరాయులవారు వ్రాసిన “సౌభాగ్య భాస్కరము”. తరువాత వచ్చిన వ్యాఖ్యలన్నింటికీ ఇదే మాతృక అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. వీరు క్రీస్తుశకం 17, 18 శతాబ్దాల మధ్య జీవించారు.
కర్ణాటక రాష్ట్రంలోని బీజపూరు నందు బీజపూరు నవాబుకు విశ్వామిత్ర గోత్రీకుడైన గంభీరరాయ దీక్షితులు మంత్రిగా ఉండేవాడు. గంభీరరాయలు మహాపండితుడు.
సోమయాజి, బహు గ్రంథకర్త, రాజనీతిజ్ఞుడు. మహాభారతాన్ని పార్శీభాషలోకి అనువదించి "భారతి" అని బిరుదు పొందాడు. ఈయన భార్య కోనమాంబ. రాచకార్యము మీద ఈయన హైదరాబాదు నగరానికి వచ్చినప్పుడు అక్కడ ఈ పుణ్యదంపతులకు భాస్కరరాయలు జన్మించాడు.
బాలభాస్కరుడు దినదిన ప్రవర్ధమానుడై నారాయణపేట దగ్గరగల 'లోకాపల్లి' అనే గ్రామంలో సాక్షాత్తూ సరస్వతీస్వరూపమైన నృశింహయాజి దగ్గర సమస్త విద్యలు అభ్యసించి, ఆ తరువాత సూరత్ నగరవాసి అయిన “ప్రకాశానంద నాథ” అనే దీక్షానామంగల శివదత్తశుక్ల దగ్గర ఉపదేశం పొందాడు. గురువు యొక్క అనుగ్రహంతో పరదేవతా సాక్షాత్కారం పొందిన భాస్కరాచార్యుడు దేశాటన చెయ్యటం ప్రారంభించాడు.
ఆ రోజుల్లో మహారాష్ట్ర దేశానికి సేనాధిపతి అయిన 'చంద్రసేన జాదవు' భాస్కరాచార్యుని శిష్యుడైనాడు. చంద్రసేనుడికి సంతానం లేదు. అందుచేత అతడు భార్యతో సహా గురువుగారైన భాస్కరాచార్యుని దగ్గరకు వెళ్ళి, సంతానాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. కరుణామయుడైన భాస్కరాచార్యుడు చంద్రసేనుడికి పుత్రసంతానం కలుగుతుంది అని దీవించాడు. కాలక్రమంలో చంద్రసేనుడి భార్య గర్భవతి అయింది.
ఆ రోజులలో నారాయణదేవుడు అనేవాడు భాస్కరునికి శిష్యుడుగా ఉండేవాడు. అతడు పండితుడు, సద్గుణసంపన్నుడు. అన్నిటికీ మించి గురువుగారి మీద అచంచలమైన భక్తిప్రపత్తులు కలవాడు. నారాయణదేవుని యొక్క దీక్షకు మెచ్చి భాస్కరాచార్యుడు అతడికి వాగ్దేవీ మంత్రాన్ని ఉపదేశించాడు. గురుకటాక్షవీక్షణాల వల్ల మంత్రసిద్ధి జరిగి నారాయణదేవుడికి వాక్సిద్ధి లభించింది. ఈ రకంగా వాక్సిద్ధిని పొందిన నారాయణదేవుడు కూడా దేశాటన చేస్తూ మహారాష్ట్ర ప్రాంతంలో చంద్రసేనుడున్న నగరానికి వచ్చాడు.
అతడి గొప్పతనాన్ని విన్నటువంటివాడై చంద్రసేనుడు అతని వద్దకు వెళ్ళి, తన భార్య గర్భవతి అని చెప్పి, తనకు ఏ సంతానం కలుగుతుంది ? అని అడిగాడు. దానికి నారాయణదేవుడు స్త్రీ సంతానము కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే చంద్రసేనుడు “అయ్యో ! అదెలా జరుగుతుంది ? మా గురువుగారు భాస్కరాచార్యుల వారు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు కదా!" అన్నాడు.
ఆ మాటలు వినగానే నారాయణదేవుడు ఎక్కడో పొరపాటు జరిగిపోయిందని గ్రహించి "ఓ మూర్ఖుడా ? భాస్కరాచార్యుల వారే నాకు కూడా గురువుగారు. వారి దయవల్లనే నాకు వాక్సిద్ధి లభించింది. అటువంటి నాతో వేరేరకంగా చెప్పించావు. కాబట్టి నీకు ఆడామగా కాని శిశువు జన్మిస్తుంది." అని శాపం పెట్టాడు.
చంద్రసేనుడు తను చేసిన పనికి విచారించసాగాడు. కొంతకాలానికి చంద్రసేనుని భార్య ప్రసవించింది. నారాయణదేవుడు చెప్పినట్లే నపుంసకుడు జన్మించినాడు. ఈ పరిణామానికి చంద్రసేనుడు విపరీతంగా దుఃఖించసాగాడు. కొంతకాలానికి భాస్కరరాయలవారు 'భలాకి' అనే నగరానికి వచ్చినట్లుగా తెలిసి, కుమారుణ్ణి వెంటపెట్టుకుని అక్కడకు వెళ్ళి గురువుగారి పాదాలనాశ్రయించి, నపుంసకుడైన తన కుమారుని పురుషుడుగా చెయ్యమని కోరాడు.
కరుణాంతరంగుడైన భాస్కరాచార్యుడు రామచంద్ర జాదవుడనే పేరు గల ఆ బాలుణ్ణి వెంటపెట్టుకుని కృష్ణాతీర మందలి "మలిమడుగు" అనే పుణ్యక్షేత్రానికి పోయి కృష్ణలో తృచార్ఘ్యదానానుష్ఠానము మొదలుపెట్టాడు.
మలిమడుగు నుంచి కృష్ణానది కొంచెం దూరంగా ఉన్నది. ప్రతిరోజూ ఆచార్యుడు నదీ తీరానికి కాలినడకన ఏగి అనుష్ఠానం పూర్తి చేసుకుని వస్తుండేవాడు. ఇలా చెయ్యటం వల్ల అతడి కాళ్ళు బొబ్బలెక్కి పుండ్లు పడిపోసాగాయి. అది చూసిన శిష్యులు "గురుదేవా! మన నివాసం నదీతీరానికి మారుద్దాం!" అన్నారు. ఆ మాటలు విన్న భాస్కరుడు "కృష్ణానదినే మన దగ్గరకు రప్పిద్దాం" అన్నాడు. దానికోసం మరునాటి నుండి సూర్యోపాసన ప్రారంభించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమై భాస్కరాచార్యుని కోరిక తెలుసుకుని, "బ్రహ్మ యొక్క సృష్టిని ఎదిరించటం కూడని పని. రామచంద్రుడికి పుంసత్వాన్ని నేను ప్రసాదిస్తాను. ఆ పని మానుకో" అన్నాడు. ఆ మాటలు విన్న భాస్కరాచార్యుడు కుపితుడై, “రామచంద్రుణ్ణి పురుషునిగా చెయ్యగల సామర్థ్యం నాకున్నది. నేనడిగినట్లుగా నువ్వు కృష్ణానదిని మళ్ళించు లేకపోతే సూర్యోపాసన ప్రయోజనం లేనిది అని ప్రచారం చేస్తాను” అన్నాడు.
ఆ మాటలు విన్న సూర్యభగవానుడు భాస్కరుని కోరిక మన్నించి, నదీ ప్రవాహాన్ని మలిమడుగుకు మళ్ళించాడు. ఆ సందర్భంలోనే భాస్కరాచార్యుడు “తృచభాస్కరము” అనే గ్రంథాన్ని రచించాడు. తరువాత భాస్కరుని ఉపాసనతో రామచంద్రుని నపుంసకత్వం కూడా పోయింది. దీనికి ఆనందించిన రామచంద్రుని తండ్రి చంద్రసేనుడు మలీమడుగు గ్రామాన్ని భాస్కరునకివ్వగా, భాస్కరాచార్యుడు ఆ గ్రామాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు.ఆ గ్రామంలో చింత చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుచేత చింతకాయలను ఎవరూ అమ్మరాదు. ఎవరికి కావలసినవి వారు కోసుకుని వాడుకోండి. ఒకవేళ ఎవరైనా వాటిని అమ్మాలని చూస్తే, వాటిల్లో పురుగులొస్తాయని ఆంక్ష పెట్టాడు భాస్కరుడు.
భాస్కరాచార్యుడు శంకరాచార్యుని పరంపరగా అద్వైతమతాన్నే
ప్రచారం చేశాడు. ఆ రోజులలో సత్యబోధస్వామి మధ్వమఠాధిపతిగా ఉండేవాడు. భాస్కరాచార్యుడు దేశాటన చేస్తూ సత్యబోధస్వామిని వాదనలో జయించాడు. ఈ సత్యబోధుని సోదరుని కుమార్తె పార్వతి. శాస్త్రప్రకారము ముద్రాంకితురాలు. మధ్వ సంప్రదాయంలో శంఖు చక్ర ముద్రలు వేయించుకున్న వారే సంప్రదాయులు. అటువంటి ఆమెకు ప్రాయశ్చిత్తం చేయించి స్మార్తవిధిని ఆమెను వివాహం చేసుకున్నాడు.
No comments:
Post a Comment