Tuesday, July 25, 2023

గ్రామ దేవతలను ఎప్పుడూ అలక్ష్యం చేయవద్దు

గ్రామ దేవతలను ఎప్పుడూ అలక్ష్యం చేయవద్దు 


ప్రతీ ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతీ గ్రామానికీ పెద్దగా, అందరినీ సరక్షించే తల్లిగా, భూతప్రేతాలను, గాలినీ ధూళినీ దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పవలే కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం మన సంస్కృతిలోనే ఉంది. అలా కాపాడే తల్లినే గ్రామ దేవత అని పిలుచుకుంటాము. ప్రతీ ఏడు అమ్మవారికి జాతర చేసి, నైవేద్యం సమర్పించి మన కృతజ్ఞత తెలుపుకుంటాము. ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతీ గ్రామం లోనూ వారికి తోచిన పేరుతో పిలుచుకుంటారు భక్తులు. సహస్రకోటి నామాలు కలిగిన ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది.

ఒక రాయిని అమ్మగా భావించి పసుపు, కుంకుమ, గాజులు, రవికెలు, పువ్వులు, ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజించినా, అందులో నుండే ప్రకటమై పలుకుతుంది, కోరికలు తీరుస్తుంది, వ్యాధులు నివారిస్తుంది ఆ తల్లి. పెద్ద పెద్ద స్తోత్రాలు, పూజా తంతులతో పనిలేదు, భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు, యద్భావం తద్భవతి అన్నట్లు మన భావాన్ననుసరించి కోరికలు నెరవేరుస్తుంది.

గ్రామ దేవతలను పూజించి, జాతరలు, తిరునాళ్ళు, అగ్ని గుండ ప్రవేశాలు చేయడానికి కొన్ని రోజులను కేటాయించారు మన పూర్వీకులు. ఆ రోజులు రావడానికి ముందే ఆ గ్రామంలో చాటింపు వేస్తుంటారు, ఆ జాతర రోజులలో ఎవరూ ఆ గ్రామా సరిహద్దులు దాటకూడదు అని నియమం ఉండేది. ఏదైనా అత్యవసరమైన పనుల మీద గ్రామ పొలిమేరు దాటవలసి వస్తే ముందుగా అమ్మను దర్శించి, వారు వెళ్తున్న పనిని అమ్మకు చెప్పుకుని, చీకటి పడడానికి ముందే తిరిగి గ్రామానికి వస్తామని చెప్పి మరీ వెళ్ళేవారు.

జాతర రోజులలో ఆ గ్రామం అంతా ఎంతో కోలాహలంగా ఉంటుంది. హరికధలు, తోలు బొమ్మలాటలు, కుస్తీలు, నృత్య ప్రదర్శనలు, పాటలు, అనేక తినుబండారాల అమ్మకాలు, అగ్ని గుండంలో నడవడాలు, మొక్కులు తీర్చుకోవడాలు ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ప్రతీ ఇంటి వారు తమ చేతితో స్వయంగా చేసిన నైవేద్యాలు అమ్మవారికి నివేదించేవారు. విరివిగా అన్నదానాలు జరిగేవి. ఆ గ్రామమంతా ఒకే కుటుంబంగా కలిసిమెలిసి జాతర చేసుకునేవారు.

మీరు జాతరలు చేసుకున్న రోజులు గుర్తున్నాయా, ఎలా జరుపుకునేవారు.

ప్రతీ ఏడు రైతులు తమ పంటలో కొంత భాగం అమ్మకు ఇచ్చేవారు. అనేక కారణాల వల్ల పోరుగూళ్ళలో జీవనాన్ని సాగించే వారు కూడా తమ గ్రామదేవతల జాతరకు తప్పకుండా వెళ్ళి వచ్చేవారు. విదేశాలలో స్థిరపడిన వారు సైతం జాతరకు వచ్చి వెళ్ళేవారు. కానీ క్రమక్రమంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కొందరికి తమ గ్రామం పేరు కూడా తెలీదు. తమ గ్రామదేవత పేరు కూడా తెలీదు. అనేక చోట్ల వివిధ కారణాల వల్ల గ్రామా దేవతలను పూజించడం మానేశారు. గ్రామ దేవతలా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు, పూజలు ఆగిపోయాయి. కారణాలు మీకు తెలిసినవే వాటిని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కొన్ని గ్రామాలలో తమ పిల్లలకు గ్రామదేవత పేరు కూడా జతచేర్చి నామకరణం చేసేవారు. వేరే ఊళ్లలో స్థిరపడేవారు తమ గ్రామ దేవత చిత్రపటం తమ ఇళ్ళలో పెట్టుకుని పుజించుకునేవారు. అలా తరతరాలుగా తమ గ్రామ దేవత ఉనికి తెలియబడేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇది గ్రామదేవతకు, ప్రకృతి మాతకు చేస్తున్న అపరాధం. భయంకరమైన అంటువ్యాధులను సైతం గ్రామ పొలిమేర దాటకుండా ఆపే అమ్మవారిని అలక్ష్యం చేయకూడదు. ప్రతీ ఇంట్లో తమ గ్రామ దేవత చిత్రపటం తప్పకుండా ఉండాలి. తరువాతి తరానికి గ్రామదేవత శక్తి, విలువ తెలియజేయాలి. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి. ప్రస్తుతం ప్రబలుతున్న అంటువ్యాధులు ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఇకనైనా మనం గ్రామదేవతలను అలక్ష్యం చేయక పుజించుకుందాం. ఆలోచించండి ... ఈ కరోనా మహమ్మారి త్వరగా అంతరించిపోవాలని అమ్మవారిని వేడుకుందాం.

మీ గ్రామదేవత పేరు, మీ గ్రామం పేరు మీకు గుర్తుందా. ఒక్కసారి భక్తితో మీ అమ్మవారి స్మరించుకోండి. మచ్చుకకు గ్రామ దేవతల పేర్లు కొన్ని స్మరించుకుందామా. భరింకలమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి 

గంగమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ, గండి మైసమ్మ, పెద్దమ్మతల్లి, పోచమ్మతల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, అంకమ్మ పేరంటాలు, అచ్చమ్మ - పాపయ్య, అచ్చమ్మ - వాసిరెడ్డి, అలివేలమ్మ, అద్దంకి నాంచారమ్మ, ఇరుమలమ్మ, కోటమహిషమ్మ, కొండమారెమ్మ (వానదేవత), కుంతిదేవి (గొంతేలమ్మ), గోగులమ్మ, గంటాలమ్మ, గంగానమ్మ, చంద్రమ్మ,తుంగ పల్లెమ్మ, తిరుపతమ్మ - గోపయ్య, తుమ్మలమ్మ, నాంచారమ్మ, నూకాలమ్మ, నీరమ్మ,పెద్దమ్మ, పోలేరమ్మ, పుట్లమ్మ, పెద్దింటమ్మ, పల్లాలమ్మ, బుచ్చమ్మ, బతకమ్మ, మద్దిరామమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, మాలచ్చమ్మ, ముత్యాలమ్మ, ముక్కొల్లు మహాకాళమ్మ, పెనమకూరు మంగమ్మ, ముప్పాళమ్మ, యల్లమ్మదేవత, రంగమ్మ పేరంటాలు, లంకమ్మ, వీరమ్మ పేరంటాలు, వాకాలమ్మ, వేలమ్మ, శ్రీలక్ష్మీ పేరంటాలమ్మ, సరోజనమ్మ, బాలసన్యాసమ్మ, చల్లలమ్మ, యాపారమ్మ, మామిళ్ళమ్మ, ఎల్లారమ్మ,ఏవుళ్ళమ్మ,ఇలా గ్రామ దేవతలుగా కొలుస్తూ ఉంటారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS