Sunday, July 30, 2023

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ...



దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ...



ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం…


బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు…           ‘బ్రహ్మ జ్ఞానం’ కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. 


అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు.

ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది. 


ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని.


గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు.


అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.


*స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. *


ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు.


మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించే మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. 


అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త.


ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు.


శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!


శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం.


దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోతాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.


మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి.                 ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. 


దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు.


విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.


మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.


ఆ రూపాలు వరుసగా....


శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.


ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.


పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. 


సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.


చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి, సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద, విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షమునకి అదిష్టానం అయి ఉంటాడు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS