ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.
నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!
ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్
అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం
అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.
"తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే"
అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.
👉పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.
తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు.
No comments:
Post a Comment