కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు.
ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది
. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.
ఈ ప్రదేశం ఆనాడు విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని అంటారు.
శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు ఈప్రదేశం వదలి కామనదుర్గ (నీళ్లమ్మనహళ్ళి) కాకాద్రి కొండకు ప్రయాణ మైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు.
ఈ కొండపై శ్రీ రామచంద్ర స్వామి వారి గుడి ఉన్నది
నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవారని ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా వుంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలి నడకన హాజరయ్యేవారని అంటారు.
ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టు గారు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేక పోయారని, అయితే భక్తులు ఎంతమంది లాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచి పోయిందని అన్నంభట్టు గారు అక్కడకు చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని పూర్వీకులు చెబుతారు.
నాగాభరణం…
వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని అందువల్ల నాగలమడకలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగాభరణంను అన్నంభట్టుకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు.
ఆ నాగాభరణంను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే నాగలమడక అని పేరు వచ్చిందంటారు.
అది కూడా స్వామి కలలో కన్పించి పెన్నానది పరివాహకం వద్దనే ప్రతిష్ఠించమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్ళు లభ్యం కావడంతో ఆ రాళ్ళనే ప్రతిష్ఠించినట్లు చెబుతారు.
ప్రారంభంలో కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతిబండపరచి మంటపాన్ని నిర్మించారని రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారంకు సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడం తో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతుడైనట్లు తెలిసింది.
కావున ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
నాగలమడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా మూడుచుట్లు చుట్టుకుని ఏడు శిరస్సు లు కల్గిన మూడు అడుగుల నాగప్పస్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతుంది.పుల్లివిస్తర్ల విశిష్టత…
ప్రతి ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తువుంటారు. అందులో విశిష్టమైనది పుల్లివిస్తర్లు (బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు) తలపై పెట్టుకుని పినాకిని నదిలో స్నానం చేయడం.
స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం పిదప విడిచిన పుల్లివిస్తర్లు ఏరుకుని వాటిని తలపై పెట్టుకుని నీరున్న చోట తలంటుస్నానాలు చేస్తే చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం. అప్పటి వరకు వున్న ఉపవాస దీక్షను విరమించడం భక్తులు అనవాయితీ.
ఈ జాతరలో రైతులకు ఈ ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో అతి పెద్ద ఎద్దుల పరుష ఇక్కడ జరుగుతుంది. ఇక్కడకు తుముకూరు జిల్లా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు చేరుకుని దాదాపు 10 రోజులపాటు ఎద్దుల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి.
అంత్య సుబ్రహ్మణ్యం పేరుతో వెలసిన ఈ స్వామి ఆలయానికి విశిష్ట ఖ్యాతి నెలకొనివుంది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది
No comments:
Post a Comment