కాలభైరవుడు అంటే శివుడు కి ఎందుకు ఇష్టం....!!
చదివితే గ్రామ సింహంను పూజిస్తారు.............!!
కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్కఅనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్కఅంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు.
సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు. వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది.
స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె,డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి.
కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు
''ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్'' అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలోఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు.
నేపాల్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగా ఉంటాడు.
నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవంభజే
ఆధునిక కాలంలో సద్గురు వెంకట్రామన్ వేలాది సంవత్సరాలుగా వెలుగుచూడని కాలభైరవ రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చాటిచెప్పారు.
తమ ఆశ్రమం నిర్వహించే మాసపత్రికలో కాలభైరవుని భగవత్ స్వరూపాన్ని గురించిన అంశాలపై అసంఖ్యాకమైన వ్యాసాలు రాశారు. అప్పట్నుంచి 'కాలభైరవ'లోని 'కాల' పదాన్ని నలుపుగా, 'కాలభైరవుని' నల్లటి భైరవునిగా లేదా భయంకరమైన రూపంగా పరిగణిస్తున్నారు.
నిజానికి సద్గురు వెంకట్రామన్ కాలభైరవుడు అంటే శక్తి భైరవునికి (శివునికి) ప్రతిరూపమని, ఈ దేవుడు కాలాన్ని, దాని శక్తిని నియంత్రించగల్గుతాడని చెప్పారు. కనుక కాలభైరవుడంటే కాలాన్ని అధీనంలో వుంచుకునే కాల చక్ర భైరవుడు అని అర్థం.ప్రజల బాగోగులు, యోగక్షేమాలు కనిపెట్టుకుని చూసే వాడు, తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యమని భావించేవాడు కాలభైరవుడు.
ఈయన ఆపడానికి వీల్లేని విధంగా నిరంతరం పురోగమిస్తుంటాడు.మామూలుగా మనందరం 'గడిచిన కాలం తిరిగిరాదు' అని అనేక సందర్భాల్లో అంటుంటాం. ఆ మాటకు తిరుగులేదు. క్షణంలో లక్షోవంతు కూడా వెనక్కి రాదంటే రాదు. అందుకే కాలం అమూల్యమైంది. కనుకనే తెలివైనవాళ్ళు కాలాన్ని వృథా చేయరు. ప్రతి క్షణాన్నీ ఉపయుక్తం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పూర్తి భక్తి శ్రద్ధలతో కాల భైరవ స్వరూపుని వేడుకున్నట్లయితే ఆ దివ్య శక్తి నిరంతరం కనిపెట్టుకుని వుండి కాపాడుతుంది. అనేకమంది చిన్న చిన్న సమస్యలను చూసి పెద్దగా బెంబేలుపడ్తూ కాలాన్నంతా వృథా చేసుకుంటూ వుంటారు. నిజానికి కాలభైరవుని గనుక భక్తితో ప్రార్థించినట్టయితే ఎలాంటి సమస్యలయినా ఇట్టే పరిష్కృత మైపోతాయి.
ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా కాలభైరవుని ఆరాధించడం అనే వ్యాపకం పెట్టుకుంటే ఇక జీవితంలో ఏ చింతా వుండదు. వీరికి కాలాన్ని వ్యర్థం చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే నైపుణ్యం అలవడ్తుంది. దాంతో అరక్షణం కూడా వృథా చేయకుండా సమయాన్ని మంచి పనులకోసం వినియోగిస్తారు. కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు.
కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేమాటుంటే కాలభైరవునికి జీడిపప్పుల మాల నివేదించి, దీపారాధన చేసి పూజించాలని, అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని' చెప్తారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి, వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ, అనురక్తితో సాకినట్లయితే, పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే. కాల భైరవాష్టమి. ఇది పరమ పవిత్రమైన రోజు. కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని వుంచుతారు. దాంతో అవి మరింత పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి. అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటిని ప్రత్యేకంగా కీర్తిస్తారు. కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక దర్శించుకుంటారు. భక్తిగా కొలుస్తారు. ఇక కాలభైరవాష్టకం విష్ణు సహస్ర, లలితా సహస్ర నామాల్లా ఎంతో విశేషమైంది. రాహువుకు అధిపతి. రాహు సంబంధమైన అరిష్టాలు ఉన్నవారు కాలభైరవ అష్టకాన్ని స్మరించుకున్నట్టయితే వాటినుండి వెంటనే విముక్తులౌతారు.
మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో, భైరవకోన ఎంతో ప్రముఖమైంది. కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది. న్యూఢిల్లి పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది.
తమిళనాడు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్ కొట్టయ్, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.
ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గ నాశకం
కర్మపాశమోచకం సుశర్మమదాయం విభుం
స్వర్ణవర్ణ నశేషపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజె.
No comments:
Post a Comment