Thursday, August 27, 2020

దశ మహా విద్యలు - ఛిన్న మస్తా

దశ మహా విద్యలు - ఛిన్న మస్తా


*|| ఛిన్నమస్తాధ్యానమ్ ॥*

 |ప్రత్యాలీఢపదాం సదైవ దధతీం ఛిన్నం శిరః కర్త్రికాం
దిగ్వస్త్రాం స్వకబన్ధశోణితసుధాధారాం పిబన్తీం ముదా ।
నాగాబద్ధశిరోమణిం త్రినయనాం హృద్యుత్పలాలఙ్కృతాం
రత్యాసక్తమనోభవోపరి దృఢాం వన్దే జపాసన్నిభామ్ ॥


భావం : ఖండిత శిరస్సు, ఆ శిరస్సునొక చేతితో ధరిస్తూ, మొండెం నుండి వెలువడిన రక్త ధారలు....అందొక ధార ఖండిత మస్తకంలో పడుతూ, మరి రెండు ధారలు, ప్రక్క నున్న "వర్ణిని, ఢాకిని" అనే యోగినుల నోళ్ళలో పడుతూ, దిగంబరంగా ఉంటూ, ఒక చేత కత్తెరను ధరించిన....మాంసాలంకృత రూపాన్ని ధ్యానిస్తున్నాను.

ఈ రూపాన్ని తలచుకుంటేనే, ఒళ్ళు జలదరిస్తుంది. చిత్ర పటాన్ని చూచినా, గగుర్పాటు కలుగుతుంది.

ఈమెకు, ప్రచండ చండి, వజ్రవైరోచని అనే పేర్లు కూడా ఉన్నాయి. 

"కావ్యకంఠ వాశిష్ఠీ గణపతి ముని" , తన ఛిన్న మస్తా సాధనలో, వారి కపాలముపైన గల బ్రహ్మ రంధ్రము చిట్లగా, ఒకానొక అనితర సాధ్యమైన కాంతిపుంజము, వారి తలపై నిరంతరము కన్పడేది. ఇది సాధనా సిద్ధి.


      వజ్రయాన బౌద్ధంలో ఛిన్నమస్తాదేవిని   'ఛిన్నముండ' అని పిలుస్తారు.


    చండాసురుడు, ముండాసురుడు అని రాక్షసులు ఉండేవారని వారిని అమ్మవారు సంహరించింది గనుక ఆమెకు 'చండముండాసుర నిషూదిని' అని పేరు వచ్చిందని దేవీ పురాణాలు చెబుతాయి. కాళికా దేవి మెడలో ఉండే పుర్రెల దండకు 'ముండమాల' అని పేరు. ఆమెకు 'ముండమాలా విభూషిణి' అని పేరుంది. కనుక 'ముండ' అనే పదం తిట్టు కాదు. దాని అర్ధం 'తెగిన తల' అని మాత్రమే. 'మస్తిక', 'మస్త' అంటే ఏమిటో 'ముండ' అంటే కూడా అదే అర్ధం.


    బౌద్ధతంత్రాలలో కూడా ఈమెను వజ్రవారాహి అనీ వజ్రయోగిని అనీ వజ్రతార అనీ పిలుస్తారు. 'చిన్నముండ వజ్రవారాహి సాధన' అనేది బౌద్ధ - వజ్రయాన తంత్రాలలోని ఒక గ్రంధం. దీనిలో ఈ దేవత సాధనలు వివరంగా ఇవ్వబడ్డాయి. హిందూ తంత్రాలలో అయితే ఈమెను క్రోధకాళి అనీ ఉన్మత్తకాళి అనీ పిలుస్తారు. దశ మహావిద్యా దేవతలలో కాళి, తార, చిన్నమస్తిక ఒక గ్రూపుకు చెందిన దేవతలు.ఎందుకంటే వీరి ఆకారాలు భయానకంగా ఉండటమే గాక, మామూలు మనుషులకు అర్ధంకాని రహస్య తాంత్రిక భావనలతో ముడిపడి ఉంటాయి. ఆయా మార్గాలలో సాధన చేసేవారికే వీరి ఆకారాల వెనుక ఉన్న రహస్యాలు అర్ధమౌతాయి గాని ఊరకే గుడికెళ్ళి భయం భయంగా 'దేవుడా నా తప్పులు క్షమించు.నన్ను కాపాడు' అంటూ దణ్ణాలు పెట్టుకునే మామూలు నేలబారు భక్తులకు ఈ రహస్యాలు అందవు. ఎందుకంటే ఇవి సాధనా రహస్యాలు గాబట్టి వీటిని అనుభవ పూర్వకంగా గ్రహించాలి గాబట్టి. అర్హత ఉన్న సాధకులకు ఈ రహస్యాలు చెప్పబడతాయి గాని, ఊరకే కుతూహలపరులకు ఎన్నటికీ ఇవి తెలియబడవు, అందవు. అది అంతే.
     

     సృష్టికి ముందు నాద ప్రకాశాలుంటాయి. ప్రకాశము, ఆకాశానికి పరిమితమైతే...ఆమె "భువనేశ్వరి".  అదే కాల రూపం చెందితే "కాళి". ఆ ప్రకాశమే సృష్టిలో అంతర్భూతమై, దానిని వెలువరించినపుడు "త్రిపుర సుందరి" అని పిలిచాం. వ్యక్తీకరించబడని అవ్యక్త నాద శక్తిని "త్రిపుర భైరవి" అని పిలిచాము. ఆ నాదమే చూచినపుడు "తార" అని పిలిచాం. ఇక సృష్టి నిమిత్తం ప్రకాశ, నాద, కాంతులు ఒక దానిపై ఒకటి పనిచేస్తూ....ఉండే దశను, తాంత్రికులు "ఛిన్నమస్తా" అని పిలిచారు.
   

    ఈమెకు కాళికి సంబంధం ఏమిటి? కాళి చర్యలు భయంకరమైనవి. కనుక ఆమె "చండి". కాళి కంటే భయంకరమైనది ఛిన్నమస్తా. ఈమె ప్రచండ చండి. విద్యుత్ శక్తి కాళి అయితే, శాసించేది ప్రచండ చండి.
 

    కుండలినీ యోగ సాధనలో , మానవ దేహమందు మూలాధారము వద్ద నున్న కుండలినీ శక్తి ఊర్థ్వ గమిత్వము చెందుతూ, బ్రహ్మ-విష్ణు-రుద్ర యను గ్రంథి త్రయమును భేదనము చేసి, సహస్రారము నందున్న శివుణ్ణి చేరవలెను. ఆజ్ఞా చక్రము వరకే, సాధకునికి ఇంద్రియ సంబంధము. ఇక అక్కడ నుండి ప్రయాణము "ఇంద్రియాతీతము". ఛిన్న మస్తా యొక్క శక్తి, సుషుమ్నా నాడి ద్వారా ప్రవహించును. సుషుమ్నకు ఇరువైపులా ఉన్న ఇడా-పింగళ నాడుల ద్వారా, ప్రసరించు శక్తులు "వర్ణిని-డాకినులు".


    ఈమె వీర సాధకులకే వశమవుతుంది.

Bhattacharya

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS