🕉 *ఆ అమ్మ క్రీగంటి చూపు మన మీద పడితే...!!!*🙏
*"మూకాత్మానపి మహాకవితా వదాన్యాన్"*
అని మూక శంకరులు అమ్మ వారి యొక్క కరుణను వర్ణిస్తారు. *అమ్మవారి చూపు పడితే చాలుట మూగవాడైనా గొప్పకవి ఐపోతాడట.*
*పెద్దలు ఒక మాట చెప్తారు మూక శంకరుల పంచశతి ఐతేనేమి శంకరుల సౌందర్యలహరి ఐతేనేమి, రెంటిలో ఏది చదివినా, అది శాబ్దికంగా అమ్మవారి స్వరూప సాక్షాత్కారమే అని.*
*శంకరుల సౌందర్యలహరికి మరింత వివరణా అన్నట్లుంటుంది మూకపంచశతి.*
*చూపులు రెండు రకాలు, ఒకటి మనం చూడడం రెండు అమ్మ మనని చూడడం.*
*మనం అమ్మవారిని ఏవిధంగా చూసి నమస్కరించాలో, ఆవిధంగా చూడగలిగితే వచ్చే ఫలితాలు కొన్నుంటాయి.*
*అసలు అమ్మని చూడడమే ఒక భాగ్యం. ఇక అమ్మే మనని చూస్తే ఏమని చెప్పగలం..*
ఈ రెంటినీ ఆది శంకరులూ మూక శంకరులూ చెప్పారు.. రెంటినీ నా అల్పబుద్ధితో విశ్లేషణ చేసుకుని భక్తి స్థిరీకరింపచేసుకునే ప్రయత్నం ఇది....
*"శరజ్జ్యోత్స్నా శుద్ధాం .."*
*అనే శ్లోకంలో అమ్మవారిని మనం ఎలా దర్శించాలో, దాని ఫలితమేమో చెప్పారు శంకరులు.*
అలాగే,
*"ధనుఃపౌష్పం మౌర్వీ…"*
అనే శ్లోకంలో,
*అమ్మ యొక్క చూపు ఒక్కసారి మనమీద ప్రసరిస్తే కలిగే ఫలితమేమో చెప్పారు..*
(మంత్ర శాస్త్ర మర్యాదననుసరించి బయటికి పౌరాణిక అన్వయమే చెప్పబడుతున్నది )
*"శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూట మకుటాం*
*వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరామ్!*
*సకృన్నత్వా సత్వా కథమివ సతాం సన్నిదధతే*
*మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః!!*
*శరత్కాల వెన్నెలలాగా స్వచ్ఛమైన శరీరంతో, తదియనాటి చంద్రరేఖతోకూడిన ముడివేయబడిన జడపై కిరీటము అలంకరించిఉండగా, అన్ని కోర్కెలు అనంత అభయమూ ఇచ్చే వరద అభయ ముద్రలు పట్టుకొని, మరొక చేతిలో స్ఫటికాలతో చేసిన అక్షమాల (జప సంకేతం) , మరొక చేతిలో పుస్తకము (విద్య సంకేతం) ధరించిన, నిన్ను దర్శించినవారికి, నమస్కరించినవారికి, ఆరాధించినవారికి, తేనెవలె తీయనైనవి, ద్రాక్షపాకములె మధురమైన రుచితో కూడి నటువంటి మధురమైన వాక్కులనే, ఫలితాలు కలుగుతాయి*
అని శంకరులు ప్రతిపాదించారు.
*అంటే సమస్త వాఙ్మయ సారాన్ని అందించే శారదా రూపంగా అమ్మవారిని ఈ శరత్కాలంలో దర్శించవలెనని ప్రమాణ వాక్కిచ్చారు.*
*లలితా సహస్రంలో*
*"ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా"*
అన్న నామం ఎల్లరకూ విదితమే.
*అంటే పాడ్యమి తిథినుండి పౌర్ణమి తిథివరకు శుక్ల పక్షంలో పూజలు పొందుదానా అని చెప్పారు* *వ్యాసులవారు*
అందునా ’ముఖ్య’ అని మరొక మాట వేసి ఈ ఆశ్వయుజ మాసాన్ని సూచించారు.
*ఈ కాలంలో ఆకాశంలో పెరిగే చంద్రుని కళలు అమ్మవారి సొగసులు గా దర్శించి,* *ఉపాసించేవారికి, అమ్మ కరుణ తప్పక ఉంటుంది.*
*రెండో విధంలోకొస్తే, అంటే అమ్మవారి చూపే మనమీద పడితే.....*
*"ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః*
*వసన్త స్సామన్తో మలయమరు దాయోధన రథః!*
*తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్*
*అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే!!"*
*హిమగిరి సుత ఐన, ఆ తల్లి కొనకంటి చూపు పడితే, పువ్వుల ధనస్సు, తుమ్మెదల బారు వింటినారి, ములుకులు లేని ఐదు బాణములు కలిగి, శరీరమే లేకుండా, దక్షిణం వైపు మలయ పర్వతపు పై నుండి, వచ్చే గంధపు చెట్లగాలి, ఎటుపోతుందో తెలియని రథంగా కలిగి, సంవత్సరానికి ఒకసారే కనపడే వసంతుణ్ణి, చెలికానిగా కలిగినటువంటి మన్మథుడు, లోకాలను జయిస్తున్నాడమ్మా, అని ప్రతిపాదించారు శంకరులు.
*అమ్మ చూపు పడింది అంటే, అమ్మ మనని కాచుకుంటున్నదని అర్థం.*
*లౌకికంగా చెప్పాలంటే ఎక్కడికో ఎక్కువ జనం ఉన్నచోటికి మనం కుటుంబ సమేతంగా వెళ్ళామనుక్కోండి, ఒక చోట కుర్చీలో కూర్చున్నా, నా పిల్లలు ఎక్కడున్నారా అని, అప్పుడప్పుడూ, ఓ కంట కనిపెడుతూనే ఉంటాము.
అలా అమ్మవారి క్రీగంటి చూపు మన మీద పడితే ఎంత రక్షణ హేతువంటే, జగత్తునే గెలిపించేసేంత శక్తిని ఇచ్చేటంతటిదట. అసలు దానికి ఆ కారుణ్యా చూపుకి అంతులేదు అంటారు.
ఒక ఇసుక రేణువు మీద పడితే, అది మహామేరు మందరాది పర్వత సమానమౌతుంది.
గడ్డిపోచ, ఒక తృణం మీద పడితే, అది వజ్రాయుధమంత శక్తిని పొందుతుంది.
అసలెక్కడైనా, అలా కుదురుతుందా, అతిశయం కాకపోతే...??!!
ఔను కుదురుతుంది!! ప్రత్యక్ష సాక్షులం మనమే.
ఆ మన్మథుడు మనని జయించలేదూ? ఆయనకి దాసోహమే కదా మనం. ఆయన కనపడ్డాడా అంటే లేదు. ఎవరికీ కనపడడు రతీదేవికి తప్ప. చూడండి ఆయన ఎంత శక్తిమంతుడో!
*శరీరం - మన్మథుడేమో అనంగుడు. అంటే శరీరం లేనివాడు*.
*పోనీ, ధనస్సు - ఆయన ధనస్సో శివచాపం, విష్ణుచాపం, గాండీవం లాగా గొప్పదా అంటే కాదు. పుష్పాల వరుసతో పేర్చినది. పుష్పాల వరుసతో అసలు ధనస్సు ఎలా చేస్తారు ఎలా పట్టుకుంటారు? పోనీ ఆయనకున్న శక్తితో అలా తయారు చేసుకున్నాడనుక్కుంటే. పువ్వులేమో ఒక్కపూట లేదా ఒక్కరోజుకన్నా నిలవవు.* *పొద్దున్నపూసిన పూలేమో సాయంత్రానికి వాడిపోతాయి, సాయంత్రం పూసిన పూలు పొద్దున్నకి వాడిపోతాయి. ఐనా సరే అలాగే విల్లు చేసుకున్నాడు* *అందామా మామూలుగా ధనస్సును పట్టుకున్నట్లు గట్టిగా పట్టుకుంటే నలిగిపోతాయి*.
*పోనీ, అల్లెత్రాడు -* *మౌర్వీమధుకరమయీ*..
ధనస్సుకి బాణం ఎక్కుపెట్టాలంటే అల్లెత్రాడు / వింటినారి ఉండాలి. అదేమన్నా గొప్పది టంకారం చేస్తే గుండెలవసిపోతాయి
శ్రీ రాముడిలాగా, త్రిపురాసుర సంహారంలో శివుడిలాగా, అనుక్కుందామా ఒకటే ఝంకారం రొద తప్ప అంతకన్నా శబ్దం లేదు. పోనీ తీగలాగడానికి తన్యత ఉందా అంటే అసలు పువ్వుల మీద వాలాల్సిన తుమ్మెదలు ముందు ధనస్సుగా పువ్వులుంటే వెనక తీగలా వరుసలో గండుతుమ్మెదలు నిలవడం సాధ్యమా? అవి నిలవవు వింటినారిసారించడానికి తన్యతా (tension) లేదు.
పోనీ బాణాలు - యుద్ధానికెళ్ళేవారు రథం నిండా బాణాలు తీసుకెళ్తారు అలా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నవి ఐదు ’పఞ్చ విశిఖాః...’ బాణాలు చాలా తీక్ష్ణమైనవి అనుకుందామా అవి ’విశిఖాః’ ములుకులు లేనివి పువ్వులు పువ్వులను ధనస్సుగా చేసుకుని వాటిమీదవాలే తుమ్మెదల బారుని అల్లెత్రాడుగా చేసుకుని మళ్లీ ఇంకో ఐదు పువ్వులను బాణాలుగా వాడతాడు శరీరం లేని మన్మథుడు.
పోనీ, రథం - గొప్ప రథం ఉంది, గొప్ప సారథి గుఱ్ఱాలు ఎలా చెప్తే అలా వింటాయి, ఆ రథం సవ్వడికే శత్రుమూకలు భయపడి పారిపోతాయి అనుక్కుంటే. రథం గంధపు చెట్లమీదనుంచి వీచే గాలి అట. దానిమీద కూర్చుంటే మనం చెప్పినచోటికి తీస్కెళ్ళదు. అది ఏ వైపు వెళితే రథం, ఆ వేపుకి వెళ్ళాలి. అంత గొప్పది ఆ రథం.
పోనీ స్నేహితుడు - స్నేహితుడు గొప్పవాడు, మంచి సాచివ్యం చేసి సూచనలిస్తాడు అనుక్కుంటే. ఆయన వసంతుడట. సంవత్సరానికి 60 రోజులు చుట్టపు చూపుగా వచ్చేవాడు.
ఇవీ మన్మథుని లక్షణాలు, ఆయనకున్న పరికరాలు, ఆయనకున్న తోడు.. అంత తేలికైన వన్నీ పెట్టుకుని లోకాలన్నింటినీ గెలిచేస్తున్నాడు. ఎలా? అంటే ....
శంకరులంటారు..,
అన్నింటినీ మించిన గొప్ప శక్తి - ఇవన్నీ సరే ఆ మన్మథుని దగ్గర ఒక గొప్ప శక్తి ఉందట. ఆ ఒక్కడూ అన్ని దుర్భలమైన పరికరములతో ఉన్నా అతని వద్ద అంతా ఇంతా అని అనుపమానమైన, హిమగిరిసుత ఐన అమ్మవారి యొక్క క్రీగంటి చూపు వలన చెప్పనలవిగాని కరుణను పొంది ఈ లోకాలనే జయించగలుగుతున్నాడు.
సరే మన్మథుడు లోకాన్ని జయిస్తే కలిగేదేమిటి అంటే కోరికలు పుట్టడం. ధార్మికమైన కోరికలద్వారా ధార్మికమైన అర్థాన్ని పొందడం. ధార్మికమైన అర్థం అంటే సంతానాన్ని పొందడం. ఆ కరుణని గుర్తు చేయడానికి హిమగిరి సుతే అని సూచించారు శంకరులు.
అమ్మా నువ్వూ మేనకా హిమవంతులకు ధార్మికమైన కోరిక వల్ల పుట్టినదానవు, అని సంబోధనతో సూచించారు ఈ శ్లోకంలో.
అసలు పుట్టవలసిన అవసరం లేకపోతే పోయె, మళ్లీ మన్మథుణ్ణి, అమ్మవారు జీవితుణ్ణి చేయడమెందుకు,
మనం పుట్టడం, మరణించడమెందుకు, అంటే
పూర్వ పుణ్య పాప సంచిత ఫలాలు అనుభవంలోకి రాకపోతే,
జీవుడు ఎన్నటికీ బ్రహ్మైక్య సిద్ధిని పొందలేడు.
కాబట్టి మన్మథుణ్ణి జీవితుణ్ణి చేసింది. అంతే కాదు. మన్మథుడు నశించడం వల్ల సకల లోకాలూ నిరుత్సాహాన్ని పొందాయి. ఉత్సాహం లేదు. దేని మీదా ధ్యాస లేదు నిర్లిప్తతను పొందాయి. కొందరు చైతన్యం నశించిందని తప్పుడుగా చెప్తున్నారు. అది తప్పు, చైతన్యం ఎప్పుడూ నశించదు. లోకంలో చైతన్యమున్నా ఉత్సాహం లేదు. చైతన్యమెప్పుడూ ఉండకుండా పోదు. చైతన్యమే ఆ శక్తి. శక్తిలేకుండా పోలేదు, కేవలం ఉత్సాహం, పొంగు తగ్గాయి, కోరికలు లేవు,
అందరూ విరాగులయ్యారు.
మరి ఆ తల్లే వర్ణాశ్రమ విధాయిని కదా. ఏ ధర్మం వారు ఆ ధర్మం నిర్వహించవలసిన కోరికను కూడా నిర్లిప్తతతో అనుత్సాహంతో వదిలేసే పరిస్థితొచ్చింది. దానివల్ల ధర్మానికే గ్లాని అందుకు తిరిగి మన్మథుణ్ణి జీవితుణ్ణి చేసింది. లోకంలో ఉత్సాహం నిండింది వర్ణాశ్రమధర్మాలు విలసిల్లాయి. మన్మథుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయనకి దాసోహం కావద్దనుక్కుంటే అలాంటివే ఐదు బాణాలతోపాటు, చెఱుకు విల్లు పట్టుకున్న అమ్మని శరణు వేడితే, ఆ అమ్మ క్రీగంటి చూపు మనమీదపడితే అంతులేని అమ్మదయ మనమీద వర్షిస్తే... ఫలితం చెప్పనలవి కాదు...
*(ఇక్కడ మంత్ర శాస్త్ర రీత్యా, శ్రీవిద్యా సంప్రదాయమందలి మన్మథ విద్యను దాచి, శంకరులు ఈ శ్లోకాన్ని అందించారు.)*
🙏🔔🙏🔔🙏🔔🙏🔔
No comments:
Post a Comment