దశ మహావిద్యలు - త్రిపుర భైరవి
దశ మహావిద్యలలో 5వ విద్యయే "త్రిపుర భైరవి". త్రిపుర సుందరి కదిలే దశ అయితే, త్రిపుర భైరవి నిలువ ఉన్న స్థితి. ఒకే శక్తి, సుందర - భయంకర రూపాలలో ఉంటుంది. ఒకే నాణానికి రెండు వైపులా అన్న మాట. ఈ రెండూ మరల శ్రీ విద్యకు చెందినవే.
ఈమె శబ్ద బ్రహ్మ స్వరూపిణి. లేదా నాద స్వరూపిణి. ఈమె అగ్ని దేవత శక్తి కూడా. అగ్ని దేవతను ఉద్దేశించిన మంత్రం "జాతవేదసే"....ఈ మంత్రాన్ని తాంత్రికులు దుర్గాదేవికి కూడా వర్తింపజేస్తారు.
త్రిపుర భైరవి, తీవ్రమైన అభిలాషకు జ్వాల వంటిది. ఆమె సోమరియైన సాధకుని ఉత్తేజ పరచి, అతని లోని లోపములు, దౌర్బల్యములను దహించి వేసి, బ్రహ్మానంద రసాస్వాదనమునకు అర్హునిగా చేయును. సాధకుడు, ఈ దేవత అనుగ్రహముతో, సహస్రారము-ఆజ్ఞల మధ్య గల సోమ చక్రము నుండి, సోమ రసమును ఆస్వాదించు సామర్థ్యమును పొంది, అతని నాడీ మండలమంతయూ అమృత స్రావముతో తడిసి అనిర్వచనీయమైన, బ్రహ్మానందానుభూతికి లోనగును.
ఈమె, తంత్ర శాస్త్రాలలో రకరకాల రూపాలలో వర్ణించబడింది. హెచ్చు రూపాలు....ఇలా ఉన్నాయి. 4 చేతులతో, పద్మాసనస్తయైన ఆ దివ్య మూర్తి, ఒక చేతితో పుస్తకము, ఒక చేతితో అక్షమాల, ఒక చేయి చిన్ముద్ర, మరో చేయి వరద ముద్రతో ఉంటుంది.
మరో రూపంలో ఈమె.... కత్తి, కటోరి, అభయ-వరద ముద్రలతో ఉన్న ఈమూర్తి శతృ భయంకరంగా ఉంటుంది. అభయ, వరద ముద్రలతో ఉన్నది కావున...ఈమె అభయం ఇస్తుంది, వరదానం కూడా చేస్తుంది. కొన్ని సార్లు ఈమె శివునిపై కూర్చున్నట్లు కూడా కన్పిస్తుంది. ఈమెను మనము పోల్చినచో, రాజ రాజేశ్వరి రూపాన్ని పోలి ఉంటుంది.
కుండలినీ తంత్రంలో "యోగిని" అంటే విద్యార్థిని. "భైరవి" అంటే ఆ తంత్రంలో విజయం పొందినదిగా భావించబడుతోంది. ఎవరైతే భైరవి స్థితిని అందుకుంటారో, మరణ భయం నుండి అతీతులుగా ఉంటారు.
త్రిపుర భైరవి, పరా వాక్కునకు చెందిన అమ్మ. "పరా" అనగా మహోత్తమ వాక్కు. The Ultimate. అవ్యక్తం అని అర్థం. అనగా, వాక్కు మూల స్వరూపం.
ఈ త్రిపుర భైరవి , మహా విద్యకు....చాందోగ్యోపనిషత్తులోని, శాండిల్య విద్యకు అభేదాన్ని ఘటించాడు, కావ్య కంఠ వాశిష్ఠీ గణపతి ముని. దేవతలను-స్వాహాకారంతోనూ, పితృదేవతలను-స్వధాకారంతోనూ తృప్తి పరుస్తారు. స్వాహా, స్వధలకు, భైరవికి....అభేదమని, గణపతి ముని వారి సూత్రాలు.
Bhattacharya
No comments:
Post a Comment