Thursday, August 27, 2020

దశ మహా విద్యలు - త్రిపుర సుందరి

దశ మహా విద్యలు - త్రిపుర  సుందరి 

                                                                                                                  ఈ దేవత దశ మహావిద్యలలో 3వది. ఈమె శుద్ధ జ్ఞాన స్వరూపిణి. శివ-శక్త్యైక్య రూపిణి. కామమే, సృష్టికి మూల కారణం. పరబ్రహ్మకు, సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. అంటే తాను బహు విధాలుగా మారాలనే ఇచ్ఛ కలిగింది.

సోకామాయత బహుస్యాం ప్రజాయాయేతి  ---తైత్తిరీయ ఉపనిషత్తు

అపుడు పూర్ణ బిందు స్వరూపుడైన  పరబ్రహ్మ, తనను తాను రెండు భాగాలుగా విభజించుకున్నాడు. వారే శివ-శక్తులు. వారే ప్రకాశ - విమర్శాంశలు. సూర్యునికి ఎదురుగా, అద్దాన్ని ఉంచితే...అందులోనిది అతని ప్రతిబింబమే అయినా .....మాయయే. ఆ ఆది పరాశక్తియే మాయా స్వరూపిణి. ఆమెయే యావత్ చరాచర సృష్టికి మూల కారణం. ఆమెయే శ్రీ మహారాజ్ఞి. ఆమెయే పరా భట్టారిక. ఆమెయే జగన్మాత కామేశ్వరి. లావణ్య మూర్తి లలిత. సౌందర్య రాశి "త్రిపుర సుందరి".


    ఆమె "అ" కారాది "క్ష" కారాంతము...50 అక్షరాల రూపంలో ఉంటుంది. ఆమె వలనే సృష్టి-స్థితి-లయాలు. ఎప్పుడామె , సృష్టి వ్యాపారాల నుండి విముఖంగా ఉంటుందో, అపుడే ప్రళయం.


    త్రిపుర సుందరి అను పదమునకు ముందు "త్రిపుర" ఏమిటి? పురమనగా నగరము, స్థలము, క్రియ జరిగే చోటు అని అర్థం. పరబ్రహ్మలో మొదట కోరిక కలుగగా, స్పందన ఏర్పడి, నాదమేర్పడి బిందురూపాన్ని ధరించగా, ఆ బిందువు మరల మూడు బిందువులై త్రికోణమేర్పడినది. ఈ త్రికోణమే, సృష్టికి ఆధారం. అదే బ్రహ్మ యోని.


    త్రిపుర సుందరికి మూడైన వ్యక్తిత్వాలు కలవు. 1. బాలా 2. త్రిపుర సుందరి 3. త్రిపుర భైరవి. వీటిలో త్రిపుర సుందరిది సౌమ్య రూపం. ఐదవ మహా విద్య అయిన "త్రిపుర భైరవి" ది ఘోర రూపం. అయితే ఈ రెండు రూపములు ఒకే నాణెము యొక్క రెండు పార్శ్వములు. త్రిపుర సుందరికి, మంత్రిణి లేదా జ్ఞాన శక్తి "మాతంగి". త్రిపుర సుందరికి, సైన్యాధి కారిణి, దండ నాథ, వారాహీ లేదా బగళా ముఖీ.


    ఈమె రూపాన్ని సౌందర్యలహరిలో, ఆది శంకరులు ఇలా వర్ణించారు.


 క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥

భావము : తన సన్నని నడుముకు సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ, శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ, చేతులలో విల్లమ్ములు, పాశాంకుశములు ధరించునదీ, పరమశివుని పరహంతా స్వరూపము అయినట్టిదీ అగు అంబిక మాముందు కనపడుగాక.


    సాధకుని మనస్సు, ఆమె ఆధీనము లోనే ఉంచి, ఆమె సంకల్పమే...నెరవేరుగాక...అని భావించడమే సాధన.


    శాక్తేయులు విగ్రహాలకు బదులు యంత్రాలను పూజిస్తారు. అవి సరళ రేఖలతోనూ-వక్రరేఖలతో-బిందు కోణాలతోనూ ఉంటాయి. ఇలా పూజించడం ఉత్తమమని తాంత్రికుల మాట. మంత్రమే దేవత. దేవతా శరీరమే యంత్రం.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS