మారిపోతున్నాయి. నిన్న ఉన్నట్లుగా నేడు, నేడు ఉన్నట్లు రేపూ ఉంటుందని చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలోని ఓ వూరు మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాని పేరే పేరూరు... ఓ అందమైన సాంస్కృతిక గ్రామం..!
చుట్టూ పచ్చని కొబ్బరితోటలూ వాటి మధ్య పారే పిల్ల కాలువలూ ఆ మధ్యలో కుదురుగా కట్టిన పాతకాలంనాటి పెంకుటిళ్లూ ఎర్ర కంకర రోడ్లూ కాస్త దూరంలోనే గోదావరి పాయలూ ఇంకాస్త ముందుకు వెళితే సాగర జలాలూ... ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కనువిందు చేస్తుంటుంది తూర్పుగోదావరి జిల్లాలోని పేరూరు. క్రీ.శ. 11వ శతాబ్దం నుంచీ తన స్వరూపాన్ని కాస్త కూడా మార్చుకోకుండా పూర్వం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. దీనికి కారణం ఆ వూరికి ఉన్న చరిత్రే అని చెబుతారు స్థానికులు.
చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అమ్మంగిదేవిని రాజమహేంద్రవర పాలకుడు రాజరాజనరేంద్రుడికి వివాహం చేసి, అత్తింటికి పంపే సమయంలో చీరసారెలతోబాటు 18 కుటుంబాలకు చెందిన వేదపండితులనూ పంపించాడట. అలా వచ్చినవాళ్లలో కొందరు ఆత్రేయపురం దగ్గర ఉన్న ర్యాలీ దగ్గర స్థిరపడితే, మరికొందరు అంబాజీపేట మండలానికి వెళ్లగా, ఇంకొందరు పేరూరుని ఆవాసంగా చేసుకున్నారట. తమిళనాడులోని పెరియా(పెద్ద)వూరు నుంచి వచ్చినవాళ్లు స్థిరపడినదే పేరూరు అనీ, అందుకే ఇక్కడి బ్రాహ్మల్ని పేరూరు ద్రావిడులు అంటారనీ చెబుతుంటారు.
మహామహులెందరో..!
నాటి పేరూరు- విశ్వేశ్వరుని, గున్నాపంతుల, పేరమ్మ, బుచ్చమ్మ, బండివారి... అని ఐదు అగ్రహారాలుగా ఉండేది. కాలక్రమంలో మిగిలినవి అమలాపురంలో కలిసిపోగా విశ్వేశ్వరుని, బండివారి అగ్రహారాలు మాత్రమే ప్రస్తుత పేరూరులో ఉన్నాయి. విశ్వేశ్వరుని అగ్రహారం మెరక, పల్లపు వీధులతో ప్రధాన గ్రామంలో ఉంది. ఇక్కడ 365 కుటుంబాలు నివసిస్తున్నాయి. వందలాదిమంది నిత్యాగ్నిహోత్రులు, నిత్యానుష్టానపరులు, వేదపండితులు, ఘనాపాఠీలు, శాస్త్రపండితులు... ఇక్కడ ఇప్పటికీ నివసిస్తున్నారు.
పంచ ప్రణాళిక!
ప్రకృతికి ఆటంకం కలగకుండా జీవించాలన్నదే ఆ వూరివారి ఆశయం. అందుకే నాటి అగ్రహారంలో మెరక, పల్లపు వీధులకు రెండు ప్రధాన రహదారుల్నీ; వాటిని విభజిస్తూ చిన్నపాటి అడ్డు దారుల్నీ నిర్మించారు. ఇళ్లన్నీ ఉత్తర-దక్షిణ దిక్కుల్లోనూ; రోడ్లు తూర్పు-పడమర దిక్కుల్లో నిర్మించడంతో గాలీవెలుతురూ చక్కగా ఉంటాయి. రోడ్డుకిరువైపులా ఐదేసి చొప్పున పంచకమనే పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఉంటాయి. ప్రస్తుతం ఆ వూళ్లొ ఇంటికి ఒకరు చొప్పున అమెరికాలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయినప్పటికీ వాళ్లెవరూ తమ ఇళ్లను మార్చి ఆధునికంగా కట్టించాలనుకోలేదు. వాటిని యథాతథంగా ఉంచేందుకే డబ్బును వెచ్చించడం వారి ప్రత్యేకత.
అలాగే భూగర్భజలాల పరిరక్షణ, తద్వారా ఉష్ణతాపం తగ్గుతుందన్న కారణంతోనే వూళ్లొ ఇంతకాలం తారు, సిమెంటు రోడ్లు వేసుకోలేదు(ఈమధ్యే కనీస సౌకర్యాల కల్పన పేరుతో ప్రభుత్వం గ్రామంలోని ప్రధాన రహదారుల్లో సిమెంటు రోడ్లు వేయడం ప్రారంభించింది). తాగడానికి పంచాయితీ నీటిని వాడుకున్నా ఇతర అవసరాలకు నేటికీ నాటి గిలక బావులనే వాడతారు. ప్రతిఇంటిలో ఈశాన్యం దిక్కున ఉన్న బావి దగ్గర ఇంకుడు గుంతను తవ్వారు. వాడిన నీరు మొక్కలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను కొట్టకూడదన్న నియమం పెట్టుకున్నారు.
గ్రామంలో దేవాలయాలకూ లోటు లేదు. వాటిల్లో నిత్యం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దత్త, పుష్పగిరి, శృంగేరి, కంచి, హరిహర, విరూపాక్ష పీఠాలకు చెందిన ఆయా తరాల పీఠాధిపతులూ ఈ గ్రామంలోని దేవాలయాలను సందర్శించారు. ఈ వూరి విశిష్టతను గుర్తించిన ఎన్టీ రామారావు కూడా అనేకసార్లు ఆ ఆలయాలను సందర్శించారు. ఆ విషయం డైరీలో రాసుకోవడంతో అది చదివిన బాలకృష్ణ కూడా ఆ గ్రామానికి రెండుసార్లు వెళ్లారట. ‘అందుకే కౌశిక గోదావరీ పాయ తీరాన ఉన్న మా వూరంటే మాకెంతో ఇష్టం.
ఈ వూళ్లొ జన్మించడం పూర్వజన్మసుకృతం. ఇక్కడ మరణిస్తే, తదుపరి కార్యక్రమాలకోసం కాశీ కెళ్లాల్సిన అవసరం కూడా లేద’ని స్థానికులైన పేరి విశ్వనాథశర్మ ఎంతో గర్వంగా చెబుతారు. సమాజంలో ఆధునిక పోకడలు ఎన్ని వచ్చినా వారసత్వంగా వస్తోన్న ఇళ్లని కాపాడుకుంటూ తరాలనాటి తమ సంస్కృతిని కొనసాగిస్తోన్న పేరూరు... చెప్పుకోదగ్గ వూరే కదూ!
An article in eenadu about peruru 😊😊
No comments:
Post a Comment