Thursday, August 27, 2020

దశ మహావిద్యలు - భువనేశ్వరి మహావిద్యా

దశ మహావిద్యలు - భువనేశ్వరి మహావిద్యా



   ఈమె దశ మహావిద్యలలో 4వ మహావిద్య అయిన "భువనేశ్వరి".

   కాళి కాలమునకు సంకేతమైతే, భువనేశ్వరి ఆకాశమునకు సంకేతము. ఈమెను ఆకాశ శక్తి అనవచ్చును. సమస్త భువనములకు అధిష్ఠాత్రి. 

   మనచుట్టూ ఆవరించి యున్నది "మహాకాశం". మనలో ఉన్నది "దహరాకాశం". ఈ ఆకాశ రూపంలో విస్తరించిన ఈ చిచ్ఛక్తి స్వరూపిణియే "భువనేశ్వరీ దేవి".

   నిర్గుణ పరబ్రహ్మం సృష్టికి సిద్ధపడినపుడు, ఎక్కడ, ఏ పరిస్థితి, ఎలా...అనే సందేహం కలుగుతుంది. ఆ స్వయంవ్యక్త ప్రకాశమే, ఒక హద్దును నిర్ణయించుకొని "ఆకాశమైనది". ఆకాశం నుండే కాంతి ప్రవాహం ఆరంభం అవుతుంది.

   సృష్టి ఆరంభ దశలలో, పరమాత్మ తనను తాను చూసుకున్నాడట. "తదైక్షత" అని ఉపనిషత్తు. (ఈక్షణ శక్తి).ఆ చూపే ఆకాశం. దానినుండి నామ,రూపాత్మక జగత్తు ఏర్పడింది. దృష్టిని బట్టి సృష్టి అన్న వాదం కలదు కదా! ఆ గ్రహణ శక్తి తెలుసుకోవాలన్న శక్తియే భువనేశ్వరి.


    కావున ఈమె పరమేశ్వరుని "ఈక్షణ శక్తి". ఈ ఈక్షణ శక్తి, ఇచ్ఛా శక్తి కంటే వేరు కాదు.

    ఈమె రెండు చేతులలో పాశాంకుశాలను ధరిస్తుంది. మిగిలిన రెండు చేతులతో వరద, అభయ ముద్రలను ధరిస్తుంది. ఈమెను "మాయా శక్తి" అని కూడా అంటారు. తాంత్రిక వాఙ్మయం ప్రకారం ఈమెయే, దేవతల తల్లి "అదితి". ఆమె రూపం ఇలా వర్ణించబడింది.


    ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ మహావిద్యను ఉపాసిస్తే ఆసాధకుడికి మూడోకన్ను (third eye activation) తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని, సమస్తసిద్ధుల్ని, సకల భోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.


    ఈమె ఉపాసన చాందోగ్యోపనిషత్తులో పేర్కొనబడిన "వరోవసి విద్య" ఆధారంగా చేయబడుతుంది. ఈమె బీజ మంత్రం "లజ్జా బీజం".


    కాళి, భువనేశ్వరి కాలానికి, ఆకాశానికి అధిష్ఠాన దేవతలై ఈ నామరూపాత్మక జగత్తుకు కారణభూతులవుతున్నారు. భువనేశ్వరి ఆకాశమైతే, కాళి , ప్రాణ శక్తి. కాళి చేసే పనులకు ఈమె రంగాన్ని సిద్ధం చేస్తుంది.
     

 ఉద్యదినద్యుతి మిందు కిరీటాం తుంగకుచాం నయనత్రయ యుక్తాం |
స్మేర ముఖీం వరదాంకుశపాశా భీతి కరాం ప్రభజే భువనేశీం||


ఈ విద్యకు "హ్రీం" బీజాక్షరం. లేదా "ఓం" ప్రణవంతో చేర్చిన బీజం గానీ జపించవచ్చు. మహా విద్యలన్నింటికీ గురువు ద్వారా విధిగా ఉపదేశం తీసుకోవాలి.


 పరమాకాశం నుండే వేద మంత్రాలు వచ్చాయని, వాటికి మూలం ఓంకారమని వేద మార్గంలో ఉండగా,  భువనేశ్వరి యొక్క నాద శరీరమే "హ్రీం" అని తాంత్రికులు ఈ "హ్రీంకారానికి" పట్టం కడతారు. ఇదే తాంత్రిక ప్రణవం. దీనినే "లజ్జా బీజం" అన్నారు. ఈ బీజం సిగ్గు, సంకోచం, స్వేచ్ఛారాహిత్యాన్ని సూచిస్తుంది కదా!


 "భువనేశ్వరీ పరమ శాంతా"...కనుక శాంతిని కోరేవాడు  ఈ విద్యను ఉపాశించాలి.

భట్టాచార్య

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS