Tuesday, May 23, 2023

శ్రీ మహంకాళి ఆలయం, ఉజ్జయిని

 శ్రీ మహంకాళి ఆలయం, ఉజ్జయిని



ఆలయం దర్శనం సమయం: ఉదయం 4:00 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది అయిన శ్రీ మహాకాళీలింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో తొమ్మిదవది అయిన శ్రీ మహాకాళీ శక్తిపీఠం అమరియున్న పవిత్రస్థలం. సతీదేవి మోచేయి పడిన ప్రదేశముగా ప్రసిద్ధిగాంచినది. మార్కండేయ పురాణం నందు దేవి ఉత్పత్తి గురించి ప్రస్తావించబడింది. 


శ్రీ మహాకాళీ రాక్షసులను వధించడానికి పదితలలతో, పదికాళ్ళతో నల్లనిరూపుతో అవతరించింది. ఉజ్జయిని క్షేత్రం నందు ఇటువంటి రూపం ఎక్కడ దర్శించలేము. పురాణం నందు నల్లగా నున్న శ్రీ మహాకాళిని, హంసలకన్నా తెల్లనిదిగా భావించి పూజించే ఉజ్జయిని నివాసులు అంటే అమ్మకు ప్రీతిపాత్రులు. ఉజ్జయిని నగరవాసులు శ్రీ మహాకాళీని హరసిద్ధిమాతగా కొలుస్తారు. 


ఉజ్జయిని రైల్వేస్టేషన్‌కు సుమారు 2 కి.మీ. దూరంలో శ్రీ మహాకాళేశ్వరాలయం వుంది. దీనికి వెనుక భాగమున, సుమారు 500 మీటర్లు దూరమున కొంత ఎత్తయిన ప్రదేశము నందు అమ్మవారి ఆలయం కలదు. ఆలయమునకు తూర్పు ముఖముగా, దక్షిణ ముఖముగా రెండు ముఖద్వారములున్నాయి. గర్భాలయము నందు హరసిద్ధిమాత ముఖం మాత్రమే దర్శనమిస్తుంది. 


మాత ముఖమంతా సింధూరం పూస్తారు. అమ్మ యొక్క శాంతి రూపము, చల్లని చూపులు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని పుష్కలంగా అనుగ్రహించగలదు. ఆలయ ప్రాంగణములో గౌరి, అన్నపూర్ణ మొదలగు శక్తి రూపములు దర్శనమవుతాయి. పరాశక్తి మాతకు ఈశాన్యంగా గణపతి మందిరం కలదు. గణపతి శరీరమంతా సింధూరం పూస్తారు. ఆలయ దక్షిణ ముఖద్వారము వద్ద పూజా సామాగ్రిలు విక్రయించబడును. 


పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. 


కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని.


పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయ్యారు.


 ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు. దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. 


అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి.కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు.


ఎలా చేరుకోవాలి 

ఉజ్జయినికి అన్ని ప్రాంతాలనుండి బస్సు మరియు రైలు సౌకర్యం ఉంది ఇక్కడకు విమాన ప్రయాణం చేయువారు ఇండోర్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి బస్సు లేదా కారులో ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.


🌹🌹🌹🙏🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS