రాజ్యాధికార సిద్ది........!!
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనగానే శ్రీ విద్య
అని గోచరమవుతుంది.
విద్య అనగా ఉపాసన అని అర్థం.
శ్రీ అంటే ఆ పరాశక్తి పేరు.
కనుక శ్రీ విద్య అంటే ఆ పరాశక్తిని సహస్రనామాలతో చేయబడు ఉపాసనా అని అర్థం.
తల్లి యొక్క ఉపాసనలో వాడబడు యంత్రం శ్రీ చక్రం. శ్రీ చక్రమే తల్లి నివాసమగు శ్రీ పురం.
ప్రతి మంత్రానికి ఆరు అంగాలు ఉంటాయి.
1. హృదయము
2.కవచము
3. మాలా
4. పంజరము
5. అష్టోత్తర శతనామములు
6. సహస్ర నామములు.
ఈ లలితా సహస్రనామములలో శ్రీ విద్యకు సంబంధించిన అనేక రహస్యములు దాగి ఉన్నవి. లలితోపాఖ్యానములోకి వెళితే అందులో కూడా
ఓ రహస్యం ఉన్నది.
ఈ మంత్రం శాస్త్రములు, పురాణాలన్నీ రహస్యాలను కథా రూపంలోనూ, ఉపాఖ్యానములుగా మనకు అందిస్తుంటాయి.
ఇవి వింటేనే వానిలో దాగిన మంత్రం శక్తులు
మనలో ఆవిష్కరించబడును.
ఒకసారి మహిషాసుర సంహారం, మరోసారి శుంభ, నిశుంభుల వధ, మధుకైటభ సంహారం మొదలైన రాక్షస సంహార వృత్తాంతములు వింటుంటే
ఆయా దేవతల మంత్రం రహస్యాలు,
వాటిలోని యంత్ర రహస్యాలు మొదలైనవన్నీ,
అట్టి దేవతల ఉపాసన లేకుండానే....
ఆ మంత్రం శక్తి మనలో ప్రవేశించి, జాగృతమై మనలను అనుగ్రహిస్తుంది అని చెప్పబడుతుంది. అటువంటి లలితోపాఖ్యానము, ప్రధానంగా ఈ లలితా సహస్రనామ స్తోత్రం ద్వారా చెప్పబడింది. ఇదో విశేషం. ఆ దేవి యొక్క వైభవం అంతా హయగ్రీవ స్వామిచే అగస్త్యుల వారికి చెప్పబడింది. ఆ ఉపాసనలో వాడబడినవే ఈ సహస్రనామములు.
నాలుగు వేదాలు, వేదాంగములైన శిక్ష, వ్యాకరణం, చంధస్సు, నిరుక్తము, జ్యోతిష కల్పములన్నింటినీ బాగా తెలిసిన వారు, శైవ, వైష్ణవ, శాక్తేయ మొదలైన సిద్దాంతములసారం తెలిసిన మహాఋషిఅగస్త్యుడు. సకల వేద విద్యలను బ్రహ్మ దేవునకు ప్రసాదించిన హయగ్రీవుడు, కాంచీపురంలో తపస్సు చేస్తున్న అగస్త్యునకు సాక్షాత్కరించాడు.
ఈ సాక్షాత్కారంలో శ్రీపుర వర్ణన,
లలితా పరాభట్టారికా యొక్క గాధ,
తల్లికి సంబంధించిన మంత్రములు,
అవసరమైన న్యాసాదులు తెలియచేస్తూ
మహా యాగము, పూజా ఖండము, పురశ్చరణ ప్రక్రియలతో పాటు, ఉపాసకులకు అవసరమైన అంగములు, ఉపాంగములు తెలిపాడు.
కానీ అసలైన శ్రీ లలితా సహస్రనామము గురించి హయగ్రీవుడు అగస్త్యునకు చెప్పలేదు.
ఈ విషయాన్నే అగస్త్యుడు హయగ్రీవ స్వామితో చెబుతూ... "తల్లి సహస్రనామాలను గురించి నాకు చెప్పలేదు. చెప్పటం మరిచిపోయారా లేక నన్ను ఉపేక్షించారా... లేక వినటానికి నేను యోగ్యుడను కాదా"... అంటూ వినయ విధేయలతో అగస్త్యుడు అడిగాడు.
అందుకు హయగ్రీవ స్వామి తల్లిని ప్రార్ధించి...
ఈ నామాలన్నీ అతి రహస్యములైనవి,
ఎంతో భక్తి పూర్వకంగా అడిగావు కనుక,
తల్లి అనుమతి తీసుకొని చెబుతున్నాను,
సావధాన చిత్తంతో ఏకాగ్ర మనస్సుతో వినవలసినది. అంతేకాక వీటిని ఎవరికీ పడితే వారికి ఎట్టి పరిస్థితులలోను చెప్పవద్దు.
మొండి వారికి మూర్ఖులకు, దుష్టులకు, విశ్వాసము లేని వారికి చెప్పవద్దు.
అర్హత కలవారికి మాత్రమే వినిపించాలి.
అందుకే ఇవి రహస్య సహస్రనామాలు అయినవి అంటూ సెలవిచ్చారు హయగ్రీవుడు.
ఎంతో దివ్యమైన అర్థాలను, యోగ రహస్యాలను, కుండలిని యోగ రహస్యాలను గర్భీకరించుకున్నవి
శ్రీ లలిత సహస్ర నామాలు.
జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ప్రత్యేక గ్రహ సంచారములు ఉన్నప్పుడు, ఈ సహస్రనామ స్తోత్రంలో ఉన్న ప్రత్యేక శ్లోకాల ద్వారా ఎన్నో ఎన్నెన్నో విశేష స్థితులను అందరూ పొందుటకు అవకాశములున్నవి.
జాతక బలమున్నప్పుడు అలాంటి వాటిని పొందే యోగము, భాగ్యము, అదృష్టము ఉంటుంది.
కనుక ప్రతి వారు తమకు కూడా అట్టి యోగాలను పొందే జాతక బలము ఉందని మనస్సులో సంకల్పించుకొని ఆచరించటంలో తప్పు లేదు.
ఈ పరంపరలో శ్రీ లలితా సహస్రనామస్తోత్ర మందలి 134వ శ్లోకాన్ని ఓసారి గమనించండి.
రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |
రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా ॥
పై శ్లోకంలోని మొదటి పంక్తిలో మూడు నామాలు, రెండవ పంక్తిలో రెండు నామాలు ఉన్నాయి.
ఈ మొత్తం ఐదు నామాలను భక్తి విశ్వాసాలతో బీజాక్షర సహితంగా 21 సార్లు పఠించాలి.
పసుపు పచ్చ పూలతో మాత్రమే అర్చన చేయాలి. వేడి పాలలో బెల్లము, అటుకులు వేసిన నైవేద్యాన్ని నివేదిస్తూ నీరాజనమివ్వాలి.
వృత్తి, విద్య, వ్యాపార, ఉద్యోగ, గృహ, వాహన, అధికార పదవీ యోగాలలో విశిష్ట రాజ్యాధికారాన్ని పొందటానికి శ్రీ రాజరాజేశ్వరీ దేవిని ఆరాధించాలి.
శ్రీవిద్యా షోడశాక్షరీ మంత్రాధిదేవత రాజరాజేశ్వరి. మనువు, చంద్రుడు, కుబేరాది రాజులచేత పూజింపబడింది.
అందుచే వారంతా రాజులు కావటానికి కారణమయినది.
నిజ జీవితంలో భక్తునకు యోగ్యమైన రాజ్యం అనగా ఉద్యోగాన్ని అనుగ్రహించే రాజ్యదాయిని.
సర్వ లోకాలకు ఆధిపత్యం వహించే తల్లి కనుకే రాజ్యవల్లభా అని పిలువబడింది.
అందుకే ఈ దిగువ తెల్పిన నక్షత్రాలు, వారాలు వచ్చిన ప్రతిసారి శ్రీ రాజరాజేశ్వరిని ప్రార్థిస్తూ...
ఆ తల్లి అనుగ్రహ ప్రాప్తిని పొందటానికి ప్రయత్నించండి.
మంగళ, శుక్ర వారాలు మాత్రమే అనుకూలమైనవి.
ఆయా రోజులలో అశ్విని, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణం, శతభిషం, రేవతి నక్షత్రాలలో....
ఏదో ఒకటి ఈ మంగళ లేక శుక్రవారాలలో సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉండాలి.
ఆ విధంగా ఉన్నటువంటి రోజులే తల్లిని ఆరాధించటానికి అనువైన సమయాలుగా భావించాలి.
పై శ్లోకమందలి 5 నామాలకు ముందు..
ఓం ఐం హ్రీం శ్రీం అను బీజాక్షరాలను కలపండి.
ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజేశ్వర్యై నమః
ఓం ఐం హ్రీం శ్రీం రాజ్యదాయిన్యై నమః
ఓం ఐం హ్రీం శ్రీం రాజ్యవల్లభాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం రాజత్కృపాయై నమః
ఓం ఐం హ్రీం శ్రీం రాజపీఠనివేశితనిజాశ్రితాయై నమః
మీ మీ పూజా మందిరాలలో అవకాశమున్నంతవరకు శ్రీ రాజరాజేశ్వరి చిత్రపటమును ఉంచి దీపారాధన చేసి సంకల్పము గావించి గోత్ర నామములతో తల్లిని ఆరాధించేది. సంకల్ప సిద్దిని పొందండి.
No comments:
Post a Comment