శంకరస్తోత్రాలు : అర్ధనారీశ్వరస్తోత్రమ్
చామ్పేయగౌరార్ధశరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ ।
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 1 ॥
సంపెంగపువ్వువలే ఎర్రనైన అర్ధశరీరము కలదీ - కొప్పు ధరించినది అగు పార్వతికి, కర్పూరము వలే తెల్లనైన అర్ధశరీరము కలవాడు - జటాజూటము ధరించిన వాడు అగు శివునకు నమస్కారము.
కస్తూరికాకుఙ్కుమచర్చితాయై
చితారజఃపుఞ్జవిచర్చితాయ ।
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 2 ॥
కస్తూరీ - కుంకుమలను శరీరముపై పూసుకున్నది - మన్మథుని బ్రతికించునది అగు పార్వతికి, చితిలో భస్మను పూసుకున్నవాడు - మన్మథుని సంహరించినవాడు అగు శివునకు నమస్కారము.
ఝణత్క్వణత్కఙ్కణనూపురాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ ।
హేమాఙ్గదాయై భుజగాఙ్గదాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 3 ॥
ఝణ ఝణమని మ్రోగు కంకణములు - అందెలు, బంగారు భుజకీర్తులు ధరించిన పార్వతికి, పాములను పాదములందు కడియములుగానూ - చేతులందు కేయూరములుగానూ ధరించిన శివునకు నమస్కారము.
విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపఙ్కేరుహలోచనాయ ।
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 4 ॥
విశాలమైన నల్లకలువలవంటి కన్నులు కలది - రెండు కన్నులున్నదగు పార్వతికి, వికసించిన ఎర్రతామరల వంటి కన్నులు కలవాడు - మూడు కన్నులు కలవాడు అగు శివునకు నమస్కారము.
మన్దారమాలాకలితాలకాయై
కపాలమాలాఙ్కితకన్ధరాయ ।
దివ్యామ్బరాయై చ దిగమ్బరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 5 ॥
మందారమాలను కురులలో అలంకరించుకున్నది - దివ్య వస్త్రములను ధరించినది అగు పార్వతికి, మెడలో కపాలమాలను అలంకరించుకున్నవాడు - దిగంబరుడగు శివునకు నమస్కారము.
అమ్భోధరశ్యామలకున్తలాయై
తడిత్ప్రభాతామ్రజటాధరాయ ।
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 6 ॥
మబ్బువంటి నల్లని కేశములు కలది - తనకంటే గొప్పవారు లేనిది అగు పార్వతికి, మెరుస్తున్న రాగిరంగు జటాజూటము కలవాడు - అందరికంటే గొప్పవాడు అగు శివునకు నమస్కారము.
ప్రపఞ్చసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాణ్డవాయ ।
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ ॥ 7 ॥
ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యము చేయు జగన్మాతయగు పార్వతికి, సమస్తమును సంహరించు ప్రచండ తాండవము చేయు జగత్పితయగు శివునకు నమస్కారము.
ప్రదీప్తరత్నోజ్జ్వలకుణ్డలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ ।
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 8 ॥
ప్రకాశించు రత్నకుండలములు ధరించినది - శివునితో కలసినది అగు పార్వతికి, శోభిల్లు మహాసర్పములను అలంకరించుకున్నవాడు - పార్వతితో కలసినవాడు అగు శివునకు నమస్కారము.
ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా
స మాన్యో భువి దీర్ఘజీవీ ।
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ॥ 9 ॥
కోరికలు తీర్చు ఈఎనిమిదిశ్లోకముల స్తోత్రమును భక్తితో పఠించువాడు, ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును. అనంతకాలము సౌభాగ్యమును పొందును. అతనికి ఎల్లప్పుడూ అన్నీ సిద్ధించును.
॥ ఇతి శ్రీశఙ్కరభగవత్పాదాచార్య కృతం అర్ధనారీశ్వరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
No comments:
Post a Comment