#నృసింహ_స్వరూపం..
భగవంతుడి దశావతారాల్లో నృసింహావతారం ఒకటి. సింహం తల, నరుడి శరీరభాగాలు కలిగిన
మహోగ్ర స్వరూపం ఇది.
నరసింహుడు’ అనే పేరు అందుకే వచ్చింది.
దుష్టుడైన హిరణ్యకశిపుని వధించి,
సజ్జనుడు భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుణ్ని అనుగ్రహించిన నృసింహుడి గురించి తెలియనివారు లేరు.
భాగవతంలోని ‘ప్రహ్లాద చరిత్ర’లో గల నృసింహుడి
ఉగ్ర విశ్వరూపం- లోకంలో శాంతి నెలకొల్పేదే!
అలాంటి స్వామి వైభవాన్ని కొనియాడని
స్తోత్ర సాహిత్యం లేదు.
శంకర భగవత్పాదులు ‘నృసింహ కరావలంబ స్తోత్రం’లో- ఆయన సకల దుఃఖనాశకుడని కీర్తించారు.
నృసింహుడు ఎంత ఉగ్రమూర్తియో,
అంతటి ప్రసన్నగుణ సంపన్నుడని ప్రహ్లాదుడి కథ చెబుతుంది.
దుష్టత్వాన్ని దునుమాడే తత్వం నృసింహుడిది. ఆయనను తలచుకుంటే చాలు,
మానసిక దౌర్బల్యాలన్నీ దూరమవుతాయి.
చెడు ఆలోచనలన్నీ సమూలంగా నాశనమవుతాయి. ధర్మనిరతి హృదయంలో వేళ్లూనుకొంటుంది.
లోపలి శత్రువుల పాలిట భయంకర స్వరూపం నృసింహుడిదే!
తలచిన వెంటనే, ఎవరిలోనైనా అపారంగా ఆత్మశక్తి పెరుగుతుందని మహర్షుల వాక్కు.
స్వామి అష్టకాన్ని పఠిస్తే అనవసర భయాలు దూరమవుతాయని ‘షోడశబాహు నృసింహాష్టకం’ వర్ణిస్తుంది.
మాధ్వపీఠ పరంపరలోని విజయేంద్ర తీర్థులు రాసిన
ఈ స్తోత్రం నృసింహుణ్ని వేనోళ్ల కొనియాడుతుంది. ఎనిమిది శ్లోకాల్లోనూ నృసింహశక్తి నిక్షిప్తమై ఉందని భక్తులు విశ్వసిస్తారు.
పరిమాణంలో చిన్నదైనా, గుణంలో ఎంతో పెద్దదీ స్తోత్రం! దీనిలోని నృసింహభావన నిరుపమానం.
నృసింహ రూపం పూర్ణ మహిమాన్వితం.
అది స్వచ్ఛమై అలరారుతుంది.
ప్రళయకాలంలోని భీకర గర్జనలతో నిండి ఉంటుంది. నిరంతరం జ్వలించే అగ్నులు అందులో కనిపిస్తాయి.
అవి దుష్టుల పాలిట మృత్యుభయంకరమై
నాల్కలు సాచి గోచరిస్తాయి.
బాలచంద్రుడి వంటి తెల్లదనంతో నృసింహుడి
కరాళ దంష్ట్రలు మెరుస్తుంటాయి.
వెలుగురేఖలు ముఖబింబంలో విస్తరించి ఉంటాయి. పదహారు చేతుల్లోనూ శంఖం, చక్రంతో పాటు
ధనుస్సు,
గొడ్డలి,
శూలం,
పాశం,
అంకుశం,
అస్త్రం,
వజ్ర ఖడ్గం,
నాగలి,
గద వంటి ఆయుధాలు కనిపిస్తుంటాయి.
ఇంతటి విశిష్టరూపం మరెక్కడా ఉండదు.
నృసింహస్వామి హృదయమంతటా చరాచర జగత్తు నిండి ఉంటుంది.
కళ్లు సూర్యచంద్రాగ్నుల్లా వెలుగులీనుతుంటాయి.
ఆ ముఖంలోని మెరుపులు దేవతలకు విజయాల్ని ప్రసాదిస్తున్నట్లు గోచరిస్తాయి.
ఆయన మెడలోని కేయూర హారం దివ్యకాంతితో విరాజిల్లుతుంటుంది.
కోటి సూర్యులు ఒకే చోట ప్రకాశిస్తున్నారా అన్నట్లు
ఆ రూపం భాసిస్తుంది.
త్రిభువనాల్నీ గెలిచే విధంగా ప్రేరణనిస్తుంది.
దుష్టాత్ములు ఆ మూర్తిని చూడలేరు.
ఆయన పేరే వారికి వణుకు పుట్టిస్తుంది.
ఉపాసించేవారికి సుకృతాలు ప్రవాహాలై దరిజేరుతాయి.
ఆ రూపం పుణ్యాల పంట. పాపాల పాలిట మంట.
ఇదీ- విజయేంద్రతీర్థుల అష్టకంలోని సారాంశం! భగవంతుడి అవతారాల్లోని పరమార్థాలు
పైకి కనిపించవు.
మనసును లగ్నం చేసి పరిశీలించినప్పుడే,
ఒక్కొక్క మూర్తిమత్వంలోని ఆంతర్యం అవగతమవుతుంది.
అందుకే స్తోత్రసాహిత్యాన్ని నిరంతరం మననం చేస్తుండాలి.
మంత్రశక్తికి అదే మూలం.
ఆ శబ్దాలకు గల శక్తి అణుశక్తి వంటిది.
దాన్ని విశ్వకల్యాణం,
కుటుంబ క్షేమం,
ప్రశాంతత కోసం
వినియోగించాలన్నదే స్తోత్రసాహిత్య లక్ష్యం!
ఇంతకీ మంత్రాలకు చింతకాయలు రాలతాయా?
అని అడిగే వారు,
మంత్రానికి జ్వరం తగ్గుతుందా?
అని కూడ అడుగవచ్చు.
ఇక్కడ జ్వరం భౌతికపరమైదే తప్ప,
ఆధ్యాత్మిక పరమైనది కాదు.
జ్వరం ఉష్టతత్త్వం.
నృసింహతత్త్వం ఉష్ణతత్త్వం.
‘ఉష్ణం ఉష్ణేణ శీతలం’ అని అన్నారు.
అంటే, నిప్పు నిప్పును చల్లబరుస్తుందని అర్థం.
ఈ మంత్రంలోని అసలు రహస్యం ఇదే.
అందుకే మన పెద్దలు జ్వరం వంటి రుగ్మతలు తగ్గడానికి నృసింహస్తోత్రాన్ని పఠించమని చెప్పేవారు.
ఆయన జ్వరం నుంచి కాపాడటమే కాదు, భూతప్రేతపిశాచ పీడల నుంచి రక్షించి,
శత్రుబాధలను కూడ తొలగిస్తాడు.
కళ్ళు, మెడ, తల,
కడుపులో ఏర్పడే రోగ విముక్తి కోసం,
నారసింహ మంత్రాన్ని జపించి,
విభూదిని ధరిస్తే తగిన ఫలితం ఉంటుందనేది
పెద్దల వాక్కు.
నారసింహాయ విద్మహే
వజ్రనఖాయ ధీమహి
తన్నః సింహః ప్రచోదయాత్
ఈ నృసింహ గాయత్రిని పఠించి, విభూదిని ధరిస్తే ఫలితం ఉంటుంది.
No comments:
Post a Comment