కీర్తిముఖుడు..
తనను తానే తినేసుకున్న కీర్తిముఖుని దేవతలకంటే కూడా ఎందుకు గొప్పవాడు....
కీర్తి ముఖుని కథ ఒకటుంది. ప్రతి గుడినీ కీర్తిముఖుని రూపంతో అలంకరిస్తారు.
ఒకప్పుడు కొన్ని శక్తులు సంపాదించిన యోగి ఒకడుండేవాడు. అతను శివుని వద్దకు వచ్చి విసిగించే ప్రయత్నం చేస్తున్నాడు.
శివుడతన్ని పట్టించుకోలేదు, అయినా ఆ యోగి వదలడం లేదు. శివుడు ఒక రకమైన స్థితిలో ఉన్నాడు.
ఆయన మానవ రూపంలో ఒక రాక్షసుణ్ణి సృష్టించాడు. ఆ రాక్షసుడితో, శివుడు ఇలా చెప్పాడు, ‘‘ఇతగాణ్ణి తినేసెయ్’’
యోగి ఏం జరుగబోతున్నదీ తెలుసుకున్నాడు, శివుని పాదాలపై పడ్డాడు, ‘‘స్వామీ! ఈ ఒక్కసారికి వదిలేయండి.
మళ్లీ మిమ్మల్ని విసిగించను’’ అని ప్రాథేయపడ్డాడు. అప్పుడు రాక్షసునితో శివుడన్నాడు, ‘‘సరే వదిలెయ్’’. ఈ రాక్షసుణ్ణి సృష్టించిందే ఈ యోగిని తినడానికి.
రాక్షసుడు ఖాళీ కడుపుతో వచ్చాడు. అప్పుడు రాక్షసుడు ఇలా అన్నాడు, ‘‘ప్రభూ! ఇతన్ని తినడానికే నన్ను సృష్టించారు, ఇప్పుడు వదిలెయ్యమంటున్నారు.
ఇప్పుడు నేనేం చేయాలి?’’ శివుడింకా అదే మానసిక స్థితిలో ఉన్నాడు, ‘‘ఆ..! నిన్ను నువ్వే తినేసేయి’’ అన్నాడు.
కొంచెం సేపటి తర్వాత ఆయనకు నములుతున్న శబ్దాలు వినిపించడం మొదలైంది. ఆయన తిరిగి చూశాడు.
రాక్షసుడు తనను తాను తింటున్నాడు. పాదాలనుండి దాదాపు శరీరమంతా పూర్తయింది. చేతుల దాకా వచ్చాడు. చేతులను తినడానికి నోట్లో పెట్టుకున్నాడు.
శివుడు ఈ పరిస్థితిలో అతన్ని చూసి, ఇలా అన్నాడు, ‘‘ఓహ్. నీది కీర్తి మంతమైన ముఖం.
తనను తాను ఈ విధంగా భుజించగలిగినవాడి ముఖం నిజంగా ఎంతో కీర్తిమంతం. నీవు దేవతలను మించినవాడివి’’.
అందువల్ల ప్రతి దేవాలయంలోనూ కీర్తి ముఖం ఉంటుంది. శివుడు చెప్పినంత మాత్రంచేతనే అతను తన శరీరాన్ని తానే భుజించాడు.
మరో కారణం లేదు, అర్థం లేదు, తినేశాడంతే.
అందుకే దేవతలను మించినవాడయ్యాడు. అతను స్థాన, కాలాలను - సర్వాన్నీ అధిగమించాడు. దేవతలను మించి పోయాడంటే, దేవతలు కూడా వీటిలో కొన్ని వాస్తవాలకు అధీనులే, కానీ కీర్తిముఖుడు ఆ కోణాలన్నిటినీ దాటి ముందుకు వెళ్లిపోయాడన్నమాట.
అతను వీరందరికంటే మిన్నగా ఉన్నాడు. ఒక రాక్షసుడు యోగిని తినివేస్తే అది అంత మంచి విషయం కాదు. కాని ఎవరైనా తనను తాను తినివేయడమన్నది అత్యద్భుతమైన విషయం...స్వస్తి...🚩🌞🙏🌹🎻
No comments:
Post a Comment