🌹హనుమజ్జయంతి🌹
హనుమ జ్జయంతి సందర్భముగా ఆంజనేయ జననం. మరియు రామాయణాంతర్గత ఆంజనేయ వైభవం తెలుసుకుందాం.
🌹ఆంజనేయజననం బాల్యం 🌹
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను.
కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు.
అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాల్లో కెల్లా శ్రేష్టమయినది.
శంబసాధనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు.
దేవ ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాధనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు.
మునులకోరికపై శంబసాధనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు.
సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి.
అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను.
అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. వైశాఖ మాసం, బహుళపక్షం, దశమి స్థిరవారం, పూర్వాభాఁద నక్షఁతంలో జన్మించెను.
కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను.
పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.
🌹🌹వజ్ర ఘాతం 🌹🌹🌹
ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెళ్ళింది అతని తల్లి.
ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరుచేసరికి ఎదురుగా ఎర్రని సూర్య బింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు.
రివ్వుమని వాయు మనో వేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చల్లబరుస్తుంది.
సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడయిన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తరవీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు.
ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడ్ఫి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు.
అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు.
ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు.
ఇంద్రుడు వెంతనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు.
వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు.
ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుడాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు.
ఆ వజ్రాయుధఘాతానికి ఆంజనేయుడి ఎడమ చంపకు బాగా నొప్పికలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పై పడిపోతాడు.
వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసమ్హరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువులేక దేహాలు స్థంబించిపోయాయి.
దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మ దేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు.
ఆమె బాల హనుమంతులు ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్క సారి నిమురగానే అతని శరీరం పై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది.
బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు.
లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పని చేయడం జరిగింది.
అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు.
ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డదికావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు.
సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు.
వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు.
యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడూ, ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు.
బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు.
శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామ రూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంటపెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.
🌹హనుమ విద్యాభ్యాసం🌹
హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు.
సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.
నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు.
వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.
హనుమంతుడు మహా శక్తిమంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాలవల్ల కొంటెపిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు.
మునుల నారచీరలు చింపివేయడం, అగ్ని హోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు.
అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసివస్తుందని అంటారు.
అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది.
గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు.
🌹సుందరకాండ హనుమ🌹
అశోక వనములో సీతను చూచిన హనుమంతుడు
హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయి విస్తారమైన విశ్వాసంతో చేసిన వారికి శుభం కలుగుతుంది. సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వాడుతారు.
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు.
చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు.
నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు.
అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు.
శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు.
రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.
లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు
ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది.
రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు.
వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.
చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు.
రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు.
ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
🌹 సీతారాములే దైవం🌹
శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది.
అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు.
అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు.
తరువాత హనుమంతుడు ఆ దండను పిచ్చి దండలా తుంచి వేసెను. సభలోని వారందరూ ఆశ్చర్యపోయిరి. లక్ష్మణునికి కోపము వచ్చింది.
ఆంజనేయా! నీవు ఏమి చేయుచుంటివి అని ప్రశ్నించెను. హనుమంతుడు మాత్రం "శ్రీరాముడు లేని ఈ దండ నాకు అనవసరం" అని పల్కెను. అప్పుడు లక్ష్మణుడు మరింత కోపోద్రిక్తుడై "శ్రీరాముడు నీలో ఉన్నాడా?" అని ప్రశ్నించెను.
శ్రీరాముడు మాత్రం అంతా ప్రశాంతంగా గమనించుచుండెను. అప్పుడు హనుమంతుడు తన హృదయమును చీల్చెను.
అప్పుడు హనుమంతుని హృదయం నుండి కాంతిమంతంగా సీతారాములు అగు పడిరి. అందరూ ఆశ్చర్యానందాలతో పరవశించిపోయిరి.
ఇలా హనుమ మహిమ గూర్చి చెప్పాలంటే పరాశర సంహితలో అనేక కధలు ఉన్నాయి.
ఆంజనేయ పూజితశ్చేత్ సర్వదేవతా పూజితః . ఒక్క హనుమను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టే.
కనుక హనుమజ్జయంతి పర్వదినమున అందరూ తప్పక హనుమను ఆరాధించి పానకము వడపప్పు అప్పాలు, వడమాలలు ఇతర ప్రసాదములను నివేదన చేసి హనుమ అనుఁగహమునకు పాఁతులు కాగలరు.
No comments:
Post a Comment