పెళ్ళి జరగడం ఆలస్యం అవుతున్న వారి మనోవేదనను తొలగించి వారిని " కళ్యాణ ప్రాప్తిరస్తు " అని దీవించి అనుగ్రహించే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న క్షేత్రం తిరుపతికి అత్యంత సమీపంలోని శ్రీనివాసమంగాపురం . ఇక్కడే స్వామి వారు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నారు . ఆయన్ను దర్శించే భక్తుల జీవితాలలో కల్యాణానికి సంబంధిచిన అడ్డంకులను పారద్రోలి సంతోషాన్ని చిగురింపజేస్తారు .
పెళ్ళికాని వారితో శ్రీనివాస మంగాపురం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ వేలాది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. వీరిలో పెళ్లి కావాలని కోరుకుని కంకణాలు కట్టే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని... గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలు కట్టుకుంటే ఆరు మాసాల్లోపు పెళ్లిళ్లు జరుగుతాయని భక్తుల విశ్వాసం.
నిన్నమొన్నటి వరకు చిత్తూరు, తిరుపతి జిల్లాలోని ప్రజలే కల్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఎక్కవుగా వచ్చేవారు. అయితే ఈ నమ్మకం ఆ నోట...ఈ నోట పడి ఇటీవల కాలంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. స్వామి విశిష్టత ఈ మధ్యకాలంలో అందరికీ తెలియడంతో... ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు.
భక్తుల నమ్మకానికి తగ్గట్టుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నవెంటనే పెళ్లికాని అమ్మాయిలకు.. అబ్బాయిలకు వెంటనే పెళ్లిళ్లు జరగడంతో స్వామి వారికి ఇటీవల కాలంలో ఇంకా బాగా పాపులారిటీ వచ్చింది. ఈ కారణంగా ఇటీవల కాలంలో ఈ గుడికి ఎన్నడూ లేనంత రద్దీ పెరిగింది. తిరుపతికి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది.
వివిధ దోషాల కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతోన్న అమ్మాయిలు, అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు ప్రతీ రోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు ఎగబడుతున్నారు. వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత పెళ్లైన అబ్బాయిలు, అమ్మాయిలు... జంటలుగా స్వామి వారి పున:దర్శనం కోసం వస్తున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకి 30 నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఇక స్థలప్రాశస్త్యం వివరాల్లోకి వెళితే... పద్మావతి అమ్మవారిని వివాహమాడిన వెంకటేశ్వరుడు తిరుమల గిరులకు ఈమార్గం గుండా వెళ్తుంటే... నూతన వధూవరులు గిరుల పర్యటన చేయకూడదని అగస్త్యమహాముని సూచించారని... దాంతో శ్రీవారు శ్రీనివాస మంగాపురంలోనే ఆరు నెలలు పాటు ఉండిపోయారన్నది పురాణప్రాశస్త్యం.
ఓం నమో వేంకటేశాయ