Monday, November 13, 2023

 కార్తీకమాసం ప్రారంభం



శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి , శుభ్రమైన దుస్తులు ధరించి , తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప , దీప , నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన , అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు , గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి , పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం. 


అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం.

న కార్తీక నమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః


కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు.

కార్తీక మాసంలో ఆర్చనలు , అభిషేకాలతోపాటు , స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం , ఉపవాసం , దీపారాధన , దీపదానం , సాలగ్రామ పూజ , వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో , దిగుడు బావులలో , పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ , కూప , తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ , యమున , గోదావరి , కృష్ణ , కావేరి , నర్మద , తపతి , సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి.


కార్తీకమాసంలో దశమి , ఏకాదశి , ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ , కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి , సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. 


అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున , మాసశివరాత్రినాడు , సోమవారం నాడు , కార్తీక పున్నమి నాడూ రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.


ఈ మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.


కార్తీక శుద్ధపాడ్యమి: తెల్లవారు జామునే లేచి స్నానం చేసి , అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి , 'నేను చేయ దలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.


విదియ: ఈ రోజు సోదరి ఇంటిల్లి ఆమె చేతి భోజనం చేసి , కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.


తదియ: అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.


చవితి:  కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి.


పంచమి: దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్ర హ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.


షష్టి: నేడు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. 


సప్తమి: ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది. 


అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.


నవమి: నేటి నుంచి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.


దశమి: ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి.


ఏకాదశి: ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. 


ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క. తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి , దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశింపచేస్తుంది.


త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి.


చతుర్దశి: పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేందుకు మంచిది.


కార్తీక పూర్ణిమ: మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.


కార్తీక బహుళ పాడ్యమి:  ఈ రోజు ఆకుకూర దానం చేస్తే శుభం.


విదియ: వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది. 


తదియ: పండితులకు , గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.


చవితి: పగలంతా ఉపవసించి , సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి , ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.


పంచమి: చీమలకు నూకలు చల్లడం , శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.


షష్ఠి: గ్రామదేవతలకు పూజ జరిపించడం మంచిది.


సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి.


అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి , కాల భైరవానికి (కుక్కకు) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.


నవమి:  వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.


దశమి: ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై , కోరికలు తీరతాయి.


ఏకాదశి: విష్ణ్వాలయంలో దీపారాధన , పురాణ శ్రవణం , పఠనం , జాగరణ విశేషఫల ప్రదం.


ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం.

త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి.


చతుర్దశి: ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన , అభిషేకం అపమృత్యుదోషాలను , గ్రహబాధలను తొలగిస్తాయి.


అమావాస్య: నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబారాలను దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి , స్వర్గసుఖాలు కలుగుతాయి.


ఈ మాసంలో చేసే స్నాన , దాన , జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి , ద్వాదశి , పూర్ణిమ , సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడయినా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి , గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తనవల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు , ఇతివృత్తాలు , ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం , సత్యనారాయణస్వామి వ్రతం , కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.


గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో వనసమారాధనలో ఉసిరిగ చెట్టు నీడన సాలగ్రామ రూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని కార్తీక పురాణం బోధిస్తోంది. వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారు. 


కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో , పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతో పాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు , దేవతార్చన సమయంలో , పితృతర్పణ సమయంలో , భ్రష్టులు , చండాలురు , సూతకం ఉన్న వాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయి.

కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణు భక్తులు , కాదు ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురిదీ వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే.


తామసం కలిగించే ఉల్లి , వెల్లుల్లి , మద్యం , మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వులనూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.


ఈ మాసంలో చేసే ఉపవాసం , జాగరణ , స్నానం , దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు , మల్లి , కమలం జాజి , అవిసె పువ్వు , గరిక , దర్భలతోను , శివుని బిల్వదళాలతోనూ , జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం , జపం , దేవతారాధన యధావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి , రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు , పళ్లు తీసుకోవచ్చు

Tuesday, November 7, 2023

హోమములు చేసుకుంటే ఏమిటి ఫలితం? ఏ హోమం చేసుకుంటే ఏ కోరిక సిద్ధిస్తుంది?

హోమములు చేసుకుంటే ఏమిటి ఫలితం? ఏ హోమం చేసుకుంటే ఏ కోరిక సిద్ధిస్తుంది?




🌿అగ్ని ముఖముగానే అందరి దేవతారాధనలు జరుగుచున్నవి . అగ్ని యందు మంత్ర పూర్వకముగా దేవీ దేవతలను ఆవాహన చేసి, ఆ దేవతలను సంతృప్తి పరచు విధానమే ఈ హోమములు. 

🌸ఈ క్రింద వివిధ కోరికలను అనుసరించి ఏ విధమైన హోమములు చేసుకోవాలో చెప్పటం జరిగినది. హోమం చేయడం వలన ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ హోమములు చేసుకుని మీ కోరికలు తీర్చుకుంటారు అని భావిస్తున్నాను.


గణపతి హోమం :

🌿విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు వినాయకుడు. మనుషులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని వినాయకుడిని పూజిస్తారు.

🌸జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం చెయ్యాలి. గణపతి హోమం చేయడం వలన విజయము,ఆరోగ్యము,సంపద కార్య సిద్ధి కలుగుతాయి.మన హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభిస్తారు.


రుద్ర హోమం

🌿రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, 

🌸దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారుఅని పురాణాలు చెబుతున్నాయి. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు.ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది.


చండీ హోమం

🌿మన హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తిస్వరూపిణి చండీ మాత. జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి,సిరిసంపదల కోసం చండి హోమం చేస్తారు. చండి హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి అంటారు.

🌸చండీ హోమం చేసేప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది.చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి,నవములలో చేయడం శ్రేష్టం. సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుంది.కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది.


గరుడ హోమం

🌿శ్రీమహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవ స్వరూపమే గరుడుడు. గరుడుడు అనంతమైన శక్తికి, జ్ఞానానికి స్వరూపం. గరుడార్, గరుడ భగవాన్ అని పిలిచుకొనే గరుడుడికి చేసే హోమమే ఈగరుడ హోమం. సరైన విధివిధానాలతో కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం ,అనేక విషయాల పట్ల, వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం, శత్రువుల మీద విజయం, ప్రమాదాల నుంచి రక్షించబడడం,

🌸అన్ని శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపకశక్తి వృద్ధి జరుగుతుంది. విద్య అభివృద్ధి కలుగుతుంది.


సుదర్శనహోమం

🌿మహావిష్ణువుకు అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం. ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్టశక్తులను సంహరిస్తుంది. జీవితంలో లేక కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి ,నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేస్తారు. 

🌸గృహ ప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం చేస్తారు. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేస్తారు.


మన్యుసూక్త హోమం

🌿మన వేదాలనుసరించి మన్యు అనగా ఆగ్రహం అని, లేదా మరొక అర్థం లో తీవ్రమైన భావావేశము అని అర్థం. మన్యు దేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మన్యుసూక్త పాశుపత హోమం. ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది. కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం ఈ హోమాన్ని చేయాలి.


లక్ష్మీ కుబేర పాశుపతహోమం

🌸సంపదకి దేవతలుగా లక్ష్మీ దేవిని, కుబేరున్ని మనం పూజిస్తాము.జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారికోసం చేసేదే ఈ లక్ష్మి కుబేర పాశుపత హోమం.మానవ జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని ,కుబేరుడిని ఈ హోమంలో పూజిస్తారు. ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం. ఎందుకనగా శుక్రవారాన్ని లక్ష్మీ వారం అంటాం కదా.


మృత్యుంజయ పాశుపత హోమం

🌿మానవుడు మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం.ఆ పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటారు. 

🌸ప్రాణ హాని ,తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేస్తారు. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ హోమం చేస్తారు.ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది.


నవదుర్గ పాశుపత హోమం

🌿ఇలలో భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజింప బడుతుంది....
స్వస్తీ.....🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Monday, November 6, 2023

దశ దానాలు అంటే ఏమిటి .?*

*దశ దానాలు అంటే ఏమిటి .?*


🍁🍁🍁🍁🍁
🌳దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ.. ‘ధర్మం’ అంటారు.

🌳ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునకు చేసిన దానఫలం., పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమజన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది.

 🌳 ‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు.
శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే *‘దశ దానాలు’* అంటారు. ఇవి మొత్తం పది దానాలు.

 *" గో భూ తిల హిరణ్య ఆజ్య  వాసౌ ధాన్య గుడానిచ*
 *రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః "*

👉   దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములు గా శాస్త్రం నిర్ణయించింది.

 వీటినే మంత్ర పూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..

*🐄 గో దానం*
 :::
గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో   శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

*🌏  భూ దానం*
 :::
 కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

*🕳️ తిల దానం*
 :::
 తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

*🥇 హిరణ్య (సువర్ణ) దానం* :::

హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

*🍯  ఆజ్య (నెయ్యి) దానం*

 :::
 ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు. 

*👔🥻  వస్త్రదానం*
 :::
 శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.

*🎋  ధాన్య దానం*
 :::
 జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.

*🧈 గుడ (బెల్లం) దానం*
 :::
 రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు  సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

 *🥈రజత (వెండి) దానం*
 :::
 అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని  అనుగ్రహిస్తారు.

 🫙 *లవణ(ఉప్పు)దానం* :::
 రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.

*👉  ఇవి దశ దానాలు.* ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలను భక్తి,శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గుర్తించి మరీ దానం చేయండి.
🌼🌼🌼🌹🌼🌼🌼

Sunday, November 5, 2023

దేవుడి ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయం తెలుసుకోండి*



 *దేవుడి ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయం తెలుసుకోండి* ...!!


కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తూ ఉంటే, మరో కొంతమంది జాతక ప్రకారం, రక రకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు,

అయితే మరికొంతమంది మాత్రం, భక్తితో దేవుడు ఉంగరాలను ధరిస్తూ ఉంటారు, ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవాలి, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

అయితే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడం లో, కొన్ని పద్ధతులను పాటించాలని, లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని, పండితులు చెబుతున్నారు. 

ఉంగరం లో ఉన్న దేవుడి ప్రథమ తల మన మణికట్టు వైపు, 
దేవుడి కాళ్లు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి.

ఎందుకంటే మన శరీరం చేతి వేళ్ళ గోర్లు, భూమిని చూస్తూ ఉంటాయి.
ఉంగరాలను కళ్ళను అడ్డుకునే టప్పుడు, చేతిని ముడిచి కళ్ళకు అద్దుకోవాలి.

ఇక మహిళలు అయితే, ఇబ్బంది రోజులలో దేవుడి ఉంగరాలు ధరించరాదు,

అలాగే భోజనం చేసేటప్పుడు, 
ఉంగరానికి ఎంగిలి అంట కూడదు, ఇక దూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమను తగలకూడదు,

ఇటువంటి జాగ్రత్తలను పాటిస్తే, దేవుడి ఉంగరాలను, దేవుడి ప్రతిమ గల ఉంగరాలను ధరించాలని, లేకపోతే మనకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం, ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు...

ఖడ్గమాలాస్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ?

ప్ర: ఖడ్గమాలాస్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ? మరి 'అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మంత్రస్య' అని ఎందుకన్నారు ? ఖడ్గమాలలోని ఆ పేర్లన్నీ ఎవరివి?


జ:  #ఖడ్గమాల #శ్రీవిద్య కు చెందినది. తొలుత #లలితాత్రిపురసుందరి నామం చెప్పబడి, అటు పై న్యాసాంగ దేవతలు, తిథినిత్యా దేవతలు, దివ్యౌఘ సిద్ధాఘ మానవౌఘ గురు మండల నామాలు; ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు, నవచక్రేశ్వరీ నామాలు, చివరగా దేవీ విశేషణాలు చెప్పబడ్డాయి.
ఒకే అక్షరం గల మంత్రాలు 'పిండ' మంత్రాలనీ, రెండక్షరాలు కలవి 'కర్తరి' అనీ, మూడు నుండి తొమ్మిది అక్షరాలు కలవి   'విధి బీజముల'నీ, 10 నుండి 20 అక్షరాల వరకు కలవి మంత్రములనీ, 21 నుండి ఎన్ని అక్షరాలున్నా మాలామంత్రములనీ వ్యవహరింపబడుతాయి. ఆ కారణం చేతనే ఇది మాలా మంత్రం!
15 అక్షరాల #పంచదశీ (శ్రీ)విద్యను ఆధారం చేసుకుని 15 విధాల మాలా మంత్రాలు ఏర్పడ్డాయి. అవి: #శుద్ధశక్తిమాల, నమోంత శక్తిమాల, స్వాహాంత శక్తిమాల. తర్పణాంత శక్తిమాల, జయాంత శక్తిమాల, శుద్ధ శివ సంబుద్ధ్యంతమాల, నమోంత శివమాల, స్వాహాంత శివమాల, తర్పణాంత శివమాల, జయాంత శివమాల, శుద్ధమిధున మాల, నమోంత మిధునమాల, స్వాహాంత మిధునమాల, తర్పణాంత మిధునమాల, జయాంత మిధునమాల.
ఇందులో ప్రసిద్ధంగా లభిస్తున్నది 'శుద్ధశక్తిమాల'. దీనిని 'ప్రకృతిమాల' అని కూడా అంటారు. ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు. పై చెప్పిన 15 విధాల మాలామంత్రాలకు 15 సిద్ధులున్నాయి. అందులో మొదటిది 'ఖడ్గసిద్ధి'. తరువాత చెప్పబడిన పదునాలుగు : పాదుకాయుగ్మ సిద్ధి, అంజన సిద్ధి, బిల సిద్ధి, వాక్సిద్ధి, దేహ సిద్ధి, లోహ సిద్ధి, అణిమాద్యష్ట సిద్ధి, వశీ కరణ సిద్ధి, ఆకర్షణ సిద్ధి, సమ్మోహన సిద్ధి, స్తంభన సిద్ధి, చతుర్వర్గ సిద్ధి, ఐహికాముష్మిక సిద్ధి, భోగ మోక్ష సిద్ధి.
ఒక్కొక్క సిద్ధి కోసం ఈ మాలా మంత్రాలను వివిధ (15) విధాల వినియోగిస్తారు. 'ఖడ్గాది' 15 సిద్ధుల నిచ్చే మాలా మంత్రము కనుక ఇది 'ఖడ్గమాల' అని లోకంలో ప్రసిద్ధి పొందింది.
' తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై।
 అష్టాదశ మహాద్వీప సమ్రాద్భక్తా ( సమ్రాడ్భోక్తా)       భవిష్యతి ll ' - అని ప్రస్తుత లభ్య గ్రంథాలలో ఉంది.
కానీ ఈ శుద్ధశక్తిమాలను 14వ దైన ఐహికాముష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విజ్ఞుల అభిప్రాయం. దానికి సంబంధించిన శ్లోకం :
  అలౌకికం లౌకికం చేత్యానంద ద్వితయం సదా|
 సులభం పరమేశాని త్వత్పాదౌ భజతాం నృణామ్| శుద్ధశక్తిమాలను నిష్కామంతో జపించితే సర్వ (15) సిద్ధులూ లభిస్తాయని శాస్త్ర వచనం. సర్వసిద్ధులలో మొదటిది 'ఖడ్గసిద్ధి' కనుక - దానిని మొదలుకొని మిగిలిన సిద్దులను ఇచ్చే శుద్ధశక్తి మాలామంత్రాన్ని 'ఖడ్గమాల'గా వ్యవహరిస్తున్నాం.🙏🙏

ఆహారంలో ఐదు విధాలైన దోషాలు

*ఆహారంలో ఐదు విధాలైన దోషాలు*


*మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి...*

1.  *అర్ధ దోషం*
2.  *నిమిత్త దోషం*         
3.  *స్ధాన దోషం*
4.  *గుణ దోషం*   
5.  *సంస్కార దోషం*.

*ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు* 

*అర్ధ దోషం*

*ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు*

*భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే  శిష్యుడు ఉంచిన డబ్బు మూట వుంది*. 

*హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది, ఆ మూటలో నుండి కొంత డబ్బును తీసుకుని తన సంచీలో దాచేశాడు.*

*తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు*  

*తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు*

*వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. తర్వాత శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు*. 

*శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు*.

*ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం* 

*నిమిత్త దోషం*

*మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి*

*వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు*.

*అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి అబ్బుతాయి*

*భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి, యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య పై ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు*

*అప్పుడు ద్రౌపది కి ఒక అనుమానం కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తు మాట్లాడే భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు ఊడ్చమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది*

*ఆమె మనసులో ఆలోచనలు గ్రహించిన భీష్ముడు*
*'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను*. 

*నా స్వీయ బుధ్ధిని ఆ *ఆహారం తుడిచి పెట్టింది. *శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు *పవిత్రుడినైనాను*

*నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు*

*చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చిన ఆహారం తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి* *'నిమిత్త దోషం'* *ఏర్పడుతోంది*

*స్ధాన దోషం*

*ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది*

*యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు*.

*దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చిన ఫలమో, పుష్పమో, తోయమో, జలమో, ఏదైనా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు*

*మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి*

*గుణ దోషం*

*మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది*

*సంస్కారదోషం*

*ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని పోని రోగాల్ని తెచ్చి పెడుతుంది*

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS