Tuesday, January 5, 2021

కార్తెలు-వాటి వివరణ

 కార్తెలు-వాటి వివరణ  


మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేశారు.పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయంగొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు.సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు.కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు.ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.సంవత్సరానికి 27 కార్తెలు.తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని ‘కార్తెలు’, వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు. ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో ఎలా చెప్పుకున్నారో చూడండి:


కార్తెలు 27 

1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జ్యేష్ట 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రావణ 23.ధనిష్ట 24.శతభిషం 25.పుర్వాబాధ్ర 26.ఉత్తరాభాధ్ర 27.రేవతి

 కార్తెలపై సామెతలు

1.అశ్వని (ఏప్రిల్ – 14) '


అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం

అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.

అశ్వని కురిస్తే అడుగు తడవదు.

2'.'భరణి' (ఏప్రిల్ – 27)


భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.

భరణి ఎండకు బండలు పగులుతాయి.

భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు

భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.

3.కృత్తిక (మే – 11)


కృత్తిక పునర్వసులు సత్తువ పంట.

కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.

4.రోహిణి (మే – 25)


రోహిణి ఎండకు రోళ్ళు పగులును

రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.

రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.

5.మృగశిర (జూన్ – 8)


మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును

మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.

మృగశిరకు ముల్లోకాలు చల్లబడును.

మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.

మృగశిరలో బెట్టిన పైరు, మీస కట్టున కొడుకు మేలు.

మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.

మృగశిర కురిస్తే ముంగాలి పండును.

మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.

6.ఆరుద్ర (జూన్ – 22)


ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు

ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.

ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.

ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.

ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.

ఆరుద్రతో అదనుసరి.

ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.

ఆరుద్ర వాన ఆదాయాల బాన.

ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.

ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.

ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.

ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.

ఆరుద్ర వాన అరుదు వాన

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి

7.పునర్వసు (జులై – 6) :-


పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.

8.పుష్యమి (జులై – 20) :-


పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.

పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు

9.ఆశ్లేష (ఆగస్టు – 3) :-


ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది

ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.

ఆశ్లేష వాన అరికాలు తేమ

ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.

ఆశ్లేష ముసురు – ఆగి ఆగి తుంపర కురియును.

ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.

ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం

ఆశ్లేషలో ఊడ్చిన – అడిగినంతపంట.

ఆశ్లేష వర్షం – అందరికి లాభం.

ఆశ్లేష వాన అరికాలు తేమ

10.మఖ (ఆగస్టు – 17) :-


మఖ మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ

మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.

మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి.

మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.

మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు.

మఖా పంచకం సదా వంచకం.

మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం.

మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.

11.పుబ్బ (ఆగస్టు – 31) :-


పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.

పుబ్బలో చల్లేది, మబ్బుతో మొరపుట్టుకునేది.

పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు

పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు

పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు

పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు

12.ఉత్తర (సెప్టెంబరు – 13) :-


ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.

ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.

ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.

ఉత్తర పదును ఉలవకు అదును.

ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.

ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం

ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు

13.హస్త (సెప్టెంబరు – 27) :-


హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.

హస్తకు ఆధిపంట – చిత్తకు చివరిపంట.

హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.

హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.

హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.

హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.

హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.

హస్తలో చల్లితే హస్తం లోకి రావు.

హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.

హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి అన్నవట గొర్రెలు.

14. చిత్త (అక్టోబరు – 11) :-


చిత్త కురిస్తే చింతలు కాయును

చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.

చిత్తి ఎండకు బట్టతల పగులును.

చిత్తలో చల్లితే చిత్తుగా పండును.

ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.

చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.

చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.

చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.

చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.

చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.

చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.

15.స్వాతి (అక్టోబరు – 27) :-


స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.

స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.

స్వాతి కురిస్తే భీతి కలుగును.

స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.

స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.

స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.

స్వాతి వానకు సముద్రాలు నిండును.

స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకే.

స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.

స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.

16.విశాఖ (నవంబరు – 16) :-


విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.

విశాఖ కురిస్తే పంటకూ విషమే.

విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం

విశాఖ విసురుతుంది.

17.అనూరాధ (నవంబరు – 20) :-


అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధలో కురిస్తే (తడిస్తే) మనోరోగాలు పోతాయి.

18.జేష్ట్య (డిసెంబరు – 3) :-


జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును

19.మూల (డిసెంబరు – 16) :-


మూల కార్తెకు వరి మూలన జేరుతుంది

మూల ముంచుతుంది

మూల కురిస్తే ముంగారు పాడు

మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు

మూల మంటే నిర్మూల మంటాడు

మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.

మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది.

20.పూర్వాషాడ (డిసెంబరు – 29) 21.ఉత్తరాషాడ (జనవరి – 11) 22.శ్రావణం (జనవరి – 24) 23.ధనిష్ట ( ఫిబ్రవరి – 6 ) 24.శతభిషం ( ఫిబ్రవరి – 19) 25.పుర్వాబాధ్ర ( మార్చి - 4 ) 26. ఉత్తరాబాధ్ర ( మార్చి - 4 )


27.రేవతి ( మార్చి - 31 )


రేవతి వర్షం రసమయం – రమణీయం

రేవతి వర్షం అన్ని పంటలకు రాణింపే.

రేవతి వర్షం సర్వ సస్యములకు 

రాణింపే.

🙏🙏🙏🙏🙏

2 comments:

  1. Visaka karthey 10th ki raavaali..16ani type chesaaru...please check back

    ReplyDelete
    Replies
    1. Mee dhaggara original karthey LA list unte send me bro

      Delete

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS