సందేహం;- "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః" ఈ సూక్తి ఏ సందర్భములోనిది?
సమాధానం;- ఈ ప్రసిద్ధ సూక్తి శ్రీ భాగవత పురాణంలోని చిత్రకేతు ఉపాఖ్యానంలోనిది.
శూరసేన దేశానికి రాజైన చిత్రకేతుడికి ఎన్ని వివాహాలు చేసుకున్నా సంతానం కలగలేదు. అంగీరస మహాముని రాజు చేత పుత్రకామేష్టి యాగం చేయించి యజ్ఞ ప్రసాదం పట్టపురాణికి ఇచ్చాడు. ఆమెకు కడుపు పండి పుత్రుడు కలిగాడు. చిత్రకేతుడు ఆ పుత్రుడి మోహంలోపడి, సర్వం మరిచాడు. అయితే తల్లి అయిన పట్టపురాణిని మాత్రం మిక్కిలి ఆదరంతో చూచేవాడు. ఇతర ఆయన రాణులకు ఇది నచ్చక, వారు బాలునికి విషం పెట్టి చంపేశారు.
మరణించిన బాలుడి కోసం రాజు, రాణి విలపిస్తూండగా అంగీరసుడు నారదునితో వచ్చి రాజును ఓదారుస్తూ ఇట్లా అన్నాడు. "రాజా! ఋణానుబంధ రూపేణా పశు, పత్ని సుతాలయాః పశువులు, పత్నులు, కుమారులు, గృహాలు మొదలైనవి మానవులు చేసుకున్న ఋణాలనుబట్టి వస్తూ, పోతూ ఉంటాయి కదా! ఈ ప్రపంచం స్వప్నం లాంటిది. కల నిజమవుతుందా? కర్మవశాన జీవులు పుడుతూ, గిడుతూ ఉంటారు. ఎవరికి ఎవరు ఏమవుతారు? ఈ మోహ వికారాన్ని వదిలి, శ్రీహరిని ధ్యానించు" అని చెప్పాడు.
అపుడు నారదుడు "ఓ రాజా! నీకూ వీనికి బంధుత్వం ఏమిటో చూడు" అని బాలుడి దేహాన్ని జూచి "ఓ జీవా! నీ తల్లిదండ్రులు నీకై దుఃఖిస్తున్నారు. నీవు తిరిగి ఈ దేహంలో ప్రవేశించి, వీరికి సంతోషం కలిగించు" అన్నాడు.
ఆ బాలుడు ఇలా అన్నాడు "కర్మ బద్దుడినై అనేక జన్మలెత్తుతున్న నాకు వీరు ఏ జన్మలో తల్లిదండ్రులు? ఒక్కొక్క జన్మలో వేరు వేరు తల్లిదండ్రులు, బంధువులు నాకు ఏర్పడుతున్నారు. మరో జన్మ, మరో తల్లి, తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నారు, వస్తా" అనుకుంటూ వెళ్ళిపోయాడు.
అపుడు చిత్రకేతుడు మోహం విడిచి బాలుని దేహానికి యమునా నదిలో ఉత్తర క్రియలు చేసి, నారదునిచే నారాయణ మంత్రం ఉపదేశం పొంది కృతకృత్యుడయ్యాడు.
మహాశయా! నేను సంసృత మూలం భాగవతంలో చిత్రకేతు ఉపాఖ్యానం చదివాను. అందులో మీరు చెప్పిన ఈ శ్లోకం లేదు. ఇది బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్న దీక్షితకవి రచించిన12భాగముల సంకలనం "కాశీ మజిలీ కథలలో"ని, 8వ భాగములోని 145వ మజిలీలోని అగ్నిశిఖుడి కథ అనంతరం వచ్చే మాతంగుని కథలో కన్పించింది.. ఇవి సుమారు 10,12శ్లోకాలు ఉన్నాయి.
ReplyDeleteమహాశయా! ఇపుడే నాకు తెలియవచ్చినది ఏమంటే ఇవి జగద్గురువు శ్రీ ఆదిశంకరుల "వైరాగ్య డిండిమ" లోనిదనిన్నీ, ఇవే కాశీమజిలీ కథలలో మరల మనకు కన్పించునని. నేను నెట్టింట్లో శోధనచేయగా ఇది నిజమని తెలియుచున్నది.
ReplyDelete