Wednesday, April 10, 2024

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు


ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది
ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి ఉంటే అది గణేశుని విశేష అనుగ్రహం కలుగజేస్తుంది🙏

🙏సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.🙏

🙏క్షేత్రచరిత్ర,స్థలపురాణం🙏

🙏సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.🙏

🙏ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!🙏

🙏కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

🙏నిత్యం పెరిగే స్వామి🙏

🙏వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.🙏

🙏కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.🙏

🙏బ్రహ్మహత్యా పాతక నివారణార్థం:🙏

🙏స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.🙏

🙏దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు🙏

🙏మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.🙏

🙏సర్పదోష పరిహారార్థం🙏

🙏వరదరాజస్వామి ఆలయ నిర్మాణంస్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

🙏పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550🙏

🙏సేవాఫలితం: స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.
గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500🙏

🙏సేవాఫలితం🙏

🙏‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.🙏

🙏గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.🙏

🙏సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58🙏

🙏సేవాఫలితం🙏

🙏‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.🙏

🙏మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300🙏

🙏సేవాఫలితం: దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.🙏

🙏సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151🙏

🙏సేవాఫలితం🙏

🙏గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.🙏

🙏పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000🙏

🙏వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.🙏

🙏అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116🙏

🙏సేవాఫలితం: చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.🙏

🙏అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116🙏

🙏సేవాఫలితం: పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.🙏

వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51🙏

🙏సేవాఫలితం🙏

🙏వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.🙏

🙏వసతి & రవాణా సౌకర్యాలు🙏

🙏కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.

🙏తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.🙏

🙏ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లు పఠిస్తే చాలా మంచిది🙏ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి ఉంటే అది గణేశుని విశేష అనుగ్రహం కలుగజేస్తుంది🙏

🙏ఎంతటి కష్టాలైనా తొలగించే మహామహిమాన్వితమైన సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతిరోజూ కనీసం 4 సార్లు అయినా, 6 నెలలు పాటు భక్తి శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది🙏

🙏మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం🙏

🙏ఈ సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి🙏

🙏సంకట నాశన గణేశ స్తోత్రము - సంపూర్ణ అర్ధము🙏

🙏నారద ఉవాచ🙏

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే 1 

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ 2 

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ 3 

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ 4 

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః 5 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ 6 

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః 7 

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః 8 

🙏ఇతి సంకట నాశన గణేశ సంపూర్ణం🙏

🙏దేవతలందరికంటే  ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా  నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను🙏

ప్రధమ నామం : వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు)

ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు)

తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు)

చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు)

పంచమ నామం: లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు)

షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు)

సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు)

అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు)

నవమ నామం: ఫాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు)

దశమ నామం: వినాయక (విఘ్నములకు నాయకుడు)

ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి)

ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు)

🙏ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును🙏

🙏ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు🙏

🙏ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును🙏

🙏ఓం గం గణపతయే నమః

Tuesday, April 9, 2024

గృహ నిర్మాణం చేయవలసిన స్ధలం యొక్క ఎత్తు పల్లాలు ఫలితాలు ............!!

గృహ నిర్మాణం చేయవలసిన స్ధలం యొక్క ఎత్తు పల్లాలు ఫలితాలు ............!!


వాస్తులో ఎత్తు పల్లాలు(ఉచ్చ నీచలు) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక కాలంలో ఎత్తు పల్లాలకు అధిక ప్రాదాన్యతను ఇస్తూ చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఉచ్చ నీచల విషయంలో వివిధ గ్రంధాలలోని శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. 

“వాస్తు విద్య” అను వాస్తు శాస్త్ర గ్రంధంలో తూర్పు ఎత్తుగా ఉంటే పుత్రహాని, ఆగ్నేయం ఎత్తుగా ఉంటే ధన లాభం, దక్షిణం ఎత్తుగా ఉన్న మంచి ఆరోగ్యం, నైరుతి ఎత్తుగా ఉన్నచో స్త్రీ సౌఖ్యం, పడమర ఎత్తుగా ఉన్నచో ధన హాని, ఉత్తరం ఎత్తుగా ఉన్నచో రోగం, ఈశాన్యం ఎత్తుగా ఉన్న మహా రోగం కలుగును.స్ధలం యొక్క తూర్పుదిశ పల్లంగా ఉన్న అభివృద్ధినిస్తుంది. ఉత్తర దిశ పల్లంగా ఉన్న ఐశ్వర్యం, పడమర దిశ పల్లంగా ఉన్న ధనక్షయం, దక్షిణం పల్లంగా ఉన్న మరణం కలుగుతాయి. 

“అపరాజిత పృచ్ఛ” అను వాస్తు శాస్త్ర గ్రంధంలో స్ధలం యొక్క తూర్పుదిశ పల్లంగా ఉంటే ఆయుర్ధాయం, సంపద, బలం పెంపొందిస్తుంది. ఆగ్నేయదిశ పల్లంగా ఉన్న స్ధలం అగ్ని భయం, శత్రువుల వలన ఇబ్బందులు, పాప కృత్యాలను చేపిస్తుంది. దక్షిణ భాగం పల్లంగా ఉన్న స్ధలం రోగం, ధన హాని, పురుషులకు ఇబ్బందులు, దేవాలయం నిర్మించిన అభివృద్ధి ఉండదు. నైరుతి దిశ పల్లంగా ఉన్న స్ధలంలో ధనహాని, పురుషులకు దీర్ఘకాల వ్యాధులు, గృహ యజమానికి మృత్యుబాధలు ఉంటాయి. పశ్చిమ దిశ పల్లంగా ఉన్న ధన ధాన్యాదులను నశింపజేస్తాయి. వాయువ్య దిశ పల్లంగా ఉన్న స్ధలంలో శత్రుబాధలు, స్త్రీ సంతతి తక్కువ, ఎప్పుడు కలతలు, అజీర్ణ వ్యాధి, భయాలు కలుగుతాయి. ఉత్తరం పల్లంగా ఉన్న స్ధలంలో గౌరవం, పుత్ర పౌత్రాభివృద్ధి, ధన ధాన్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఈశాన్యం పల్లంగా ఉన్న స్ధలం సౌఖ్యం, సౌభాగ్యం, ధన ధాన్యాలను, ధర్మాన్ని వృద్ధి చేస్తుంది. 

“జ్యోతిర్నిబంధం” అను గ్రంధంలో తూర్పు, పడమర దిశలు పొడవుగా ఉండి ఉత్తర, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలం “ నాగపృష్ట స్ధలం” అని పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన భార్య, పుత్ర నష్టం కలిగించి శత్రు వృద్ధిని కలిగిస్తుంది. 

తూర్పు ఆగ్నేయ, ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి పశ్చిమదిశ పల్లంగా ఉన్న స్ధలాన్ని “దైత్య పృష్టమని” పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన ధన నాశనం, పుత్ర నాశనం, పశు సంపద లేకపోవటం జరుగుతుంది. 

మధ్యభాగం ఎత్తుగా నుండి నాలుగు దిశలు పల్లంగా ఉన్న స్ధలం “ కూర్మ పృష్ట స్ధలమని” పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన సుఖం, ధనం, ధాన్యం, ఐశ్వర్యం సంప్రాప్తిస్తాయి. 

దక్షిణ, పశ్చిమ, నైరుతి వాయువ్య దిశలు ఎత్తుగా ఉండి మిగిలిన దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని “గజ పృష్టం” అని పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన ఐశ్వర్యప్రాప్తి, ఆయువృద్ధిని కలిగిస్తాయి. 

“వాస్తు విద్య” అను గ్రంధంలో ఉచ్చ నీచల గురించి తూర్పు ఆగ్నేయ దిశల మధ్యభాగం పల్లంగా ఉన్న స్ధలం “పితామహవాస్తు” అంటారు. ఇది అశుభాలనిస్తుంది. 

దక్షిణ ఆగ్నేయ దిశల మధ్యభాగం ఎత్తుగా ఉండి వాయువ్య ఉత్తరాల మధ్య దిశల మధ్యభాగం పల్లంగా ఉన్న స్ధలాన్ని “సుపధ వాస్తు” అంటారు. ఇది సర్వకర్మలకు యోగ్యమైనది. 

ఉత్తర, ఈశాన్య దిశలు పల్లంగా ఉండి నైరుతి దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “దీర్ఘాయుర్వాస్తూ” అంటారు. ఇది వంశాభివృద్ధిని కలిగిస్తుంది. 

ఈశాన్య, తూర్పు దిశలు పల్లంగా ఉండి నైరుతి, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “పుణ్యక వాస్తు” అంటారు. ఇది శుభకరమైనది. 

తూర్పు, ఆగ్నేయ దిశలు పల్లంగా ఉండి వాయువ్య పశ్చిమ దిశలు ఎత్తుగా ఉన్న “ఆపద వాస్తు” అంటారు. ఇది కలహాలను కలిగిస్తుంది. 

దక్షిణ, ఆగ్నేయ దిశలు పల్లంగా ఉండి వాయువ్య, ఉత్తర దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “రోగ కృద్వాస్తు” అంటారు. ఇందు గృహ నిర్మాణం చేసిన రోగాలను కలిగిస్తుంది. 

నైరుతి, దక్షిణ దిశలు పల్లంగా ఉండి ఉత్తర ఈశాన్యాలు ఎత్తుగా ఉన్న “ఆర్గళ వాస్తు” అంటారు. పాప కృత్యాలను చేయిస్తుంది. 

ఈశాన్య, తూర్పు దిశలు ఎత్తుగా ఉండి పశ్చిమ నైరుతి దిశలు పల్లంగా ఉన్న “శ్మశానవాస్తు” అంటారు. ఇది వంశ నాశనాన్ని కలిగిస్తుంది. 

ఆగ్నేయం పల్లంగా ఉండి నైరుతి, ఈశాన్య, వాయువ్య దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “శ్యేనక వాస్తు” అంటారు. ఇది నాశనాన్ని, మరణాన్ని కలిగిస్తుంది. 

ఈశాన్య ఆగ్నేయ పశ్చిమ భాగాలు ఎత్తుగా ఉండి నైరుతి దిశ పల్లంగా ఉన్న “శ్వముఖ వాస్తు” అంటారు. ఇది ఎల్లప్పుడు దారిద్ర్యాన్ని కలిగిస్తుంది. 

నైరుతి, ఆగ్నేయ, ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి వాయువ్య, తూర్పు దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని “బ్రహ్మఘ్న వాస్తు” అంటారు. ఇది సర్వదా నింద్యమైనది. 

ఆగ్నేయ దిశ ఎత్తుగా ఉండి నైరుతి ఈశాన్య వాయువ్య దిశలు పల్లంగా ఉన్న “స్ధావర వాస్తు” అంటారు. ఇది వంశ నాశనం కలిగిస్తుంది. 

నైరుతి భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయ, వాయువ్య, ఈశాన్య దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని “స్ధండిల వాస్తు” అంటారు. ఇది సర్వ నాశనం కలిగిస్తుంది. 

ఈశాన్య భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయ నైరుతి వాయువ్య భాగాలు పల్లంగా ఉన్న స్ధలం “శాండుల వాస్తు” అంటారు. ఇది అశుభాలను కలిగిస్తుంది.

Monday, April 8, 2024

దేవతల ద్వాదశ నామ స్తోత్రాలు

దేవతల ద్వాదశ నామ స్తోత్రాలు* !!


!! *శ్రీ నారసింహ  ద్వాదశ నామ స్తోత్రం* !!

ప్రథమం వజ్రదంష్ట్రంశ్చ ద్వితీయం నరకేసరి
తృతీయం జ్వాలామాలాంశ్చ చతుర్ధం యోగిపుంగవం
పంచమం ధ్యానమగ్నంచ షష్ఠం దైత్యవిమర్దనం
సప్తమం వేదవేద్యంచ అగ్నిజిహ్వం తధాష్టమం
నవమం మంత్రరాజంచ దశమం భయభంజనం
ఏకాదశం ప్రహ్లాదవరదంచ ద్వాదశం తిమిరాపహం ||

*సర్వం శ్రీ లక్ష్మీనారసింహచరణారవిందార్పణమస్తు*

*శ్రీ గణపతి ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం ఏకదంతంచ  ద్వితీయం షణ్ముఖాగ్రజం
తృతీయం అనింద్యారూఢంచ చతుర్ధం మోదకప్రియం
పంచమం ఆద్యపూజ్యంచ షష్ఠం విఘ్ననివారకం
సప్తమం వేదవేద్యం చ అష్టమం స్ఫూర్తిదాయకం
నవమం కవిరాజం చ దశమం నాట్యకౌశలం  
ఏకాదశం గణనాథం చ ద్వాదశం శూర్పకర్ణకం  ||

*సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు*

*శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం ఆంజనేయంచ ద్వితీయం లంకనాశనం 
తృతీయం  రామభక్తంచ చతుర్ధం యోగిపుంగవం 
పంచమం కార్యదీక్షంచ షష్ఠం వాక్యవిశారదం
సప్తమం ధ్యానమగ్నంచ అష్టమం బుద్ధికౌశలం
నవమం సురవంద్యంచ దశమం భానుతేజసం
ఏకాదశం  మిత్రశిష్యంచ ద్వాదశం భక్తకామదం  || 

*సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం షణ్ముఖంచ  ద్వితీయం గజాననానుజం
ద్వితీయం వల్లీవల్లభంచ చతుర్ధం క్రౌంచభేదకం
పంచమం దేవసేనానీంశ్ఛ షష్ఠం తారకభంజనం
సప్తమం ద్వైమాతురంచ అష్టమం జ్ఞానబోధకం
నవమం భక్తవరదంచ దశమం మోక్షదాయకం
ఏకాదశం శక్తిహస్తంచ ద్వాదశం అగ్నితేజసం ||

*సర్వం శ్రీ శరవణభవ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం  భారతీనామ  ద్వితీయం జ్ఞానరూపిణీం
తృతీయం వేదపూజ్యంచ చతుర్ధం హంసవాహినీం
పంచమం సారస్వతప్రియంచ షష్ఠం వీణాపుస్తకధారిణీం
సప్తమం బ్రహ్మవల్లభంచ అష్టమం మంత్రరూపిణీం
నవమం నిగమాగమప్రవీణాంశ్ఛ దశమం శివానుజాం
ఏకాదశం శ్వేతాంబరధరంచ ద్వాదశం వినయాభిలాషిణీం  ||  

*సర్వం శ్రీ మహాసరస్వతి చరణారవిందార్పణమస్తు*

*శ్రీ మహాలక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం*
 
ప్రథమం మహాలక్ష్మీ నామ ద్వితీయం హరివల్లభం
తృతీయం తమోపహారిణీంశ్చ చతుర్ధం చంద్రసహోదరీం
పంచమం దారిద్ర్యనాశినీం నామ షష్ఠం భార్గవకన్యకాం   
సప్తమం బిల్వసుప్రీతాంశ్చ అష్టమం మదనమాతరం
నవమం వేదవేద్యంశ్చ దశమం శశిశేఖరానుజాం 
ఏకాదశం కమలమధ్యాంశ్చ  ద్వాదశం మంగళప్రదాం  ||    

*సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు*

*శ్రీ కృష్ణ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం వాసుదేవం నామ ద్వితీయం బలరామానుజం
తృతీయం అకౄరవరదంచ  చతుర్ధం మురళీగానలోలనం
పంచమం సుదామమిత్రంచ షష్ఠం గోవర్ధనోద్ధరం 
సప్తమం హాస్యచతురంశ్చ అష్టమం కంసమర్దనం
నవమం పీతాంబరధరంచ దశమం తులసీప్రియం  
ఏకాదశం చందనచర్చితంచ ద్వాదశం యోగీశ్వరేశ్వరం ||   

*సర్వం శ్రీ కృష్ణ చరణారవిందార్పణమస్తు* 

*శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం రాఘవం నామ ద్వితీయం దశరథాత్మజం 
తృతీయం సామీరిసేవ్యంచ చతుర్ధం లక్ష్మణాగ్రజం 
పంచమం సుగ్రీవమిత్రంచ షష్ఠం రావణమర్దనం
సప్తమం కాలరుద్రంచ అష్టమం పురుషోత్తమం
నవమం సత్యధర్మరతంచ దశమం మైథిలీప్రియం
ఏకాదశం అహల్యాశాపమోచనంశ్చ ద్వాదశం కరుణార్ణవం || 

*సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు*

*శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం మహేశ్వరం నామ ద్వితీయం శూలపాణినం
తృతీయం చంద్రచూడంశ్చ చతుర్ధం వృషభధ్వజం
పంచమం నాదమధ్యంచ షష్ఠం నారదవందితం
సప్తమం కాలకాలంచ అష్టమం భస్మలేపనం
నవమం మాధవమిత్రంచ దశమం భక్తవత్సలం 
ఏకాదశం అభిషేకాసక్తంచ ద్వాదశం జటాజూటినం  || 

 *సర్వం శ్రీ సదాశివ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం వేంకటేశ్వరం నామ ద్వితీయం సప్తగిరీశం
తృతీయం పద్మావతీప్రియంచ చతుర్ధం ఆనందనిలయం
పంచమం స్కందసన్నుతంచ షష్ఠం త్రయీనుతం
సప్తమం యశోదానందనంచ అష్టమం మౌక్తికమండపస్థితం 
నవమం  సాలగ్రామధరంచ దశమం శేషశాయినం  
ఏకాదశం అష్టదళపాదపద్మారాధనంచ ద్వాదశం వకుళాత్మజం ||

*సర్వం శ్రీ వేంకటేశ్వర చరణారవిందార్పణమస్తు*

*శ్రీ హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం హయగ్రీవం నామ ద్వితీయం జ్ఞానపంజరం
తృతీయం ప్రణవోద్గీధం చతుర్ధం భక్తకామదం
పంచమం సౌమనస్కశ్చ షష్ఠం హయగ్రీవభంజనం
సప్తమం లలితాఉపాసకశ్చ  అష్టమం శుద్ధస్ఫటికం 
నవమం కంబుకంఠంచ దశమం అక్షమాలాధరం
ఏకాదశం జాడ్యనాశనంశ్చ ద్వాదశం వాగీశ్వరేశ్వరం  ||

*సర్వం శ్రీ హయగ్రీవ చరణారవిందార్పణమస్తు*

 *శ్రీ వరాహ స్వామి  ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం వరాహదేవ నామ ద్వితీయం భూవల్లభం 
తృతీయం మహారౌద్రంచ  చతుర్ధం శాంతమానసం 
పంచమం ఆదివ్యాధినాశనంశ్చ  షష్ఠం హిరణ్యాక్షభంజనం  
సప్తమం గదాధరంశ్చ  అష్టమం క్రోడరూపిణం      
నవమం గ్రహపీడానివారణంశ్చ దశమం యజ్ఞస్వరూపిణం
ఏకాదశం విప్రవంద్యంశ్చ  ద్వాదశం విశ్వమంగళం ||  

*సర్వం శ్రీవరాహదేవ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం దుర్గా నామ ద్వితీయం తాపసోజ్జ్వలాం
తృతీయం హిమశైలసుతాంశ్చ చతుర్ధం బ్రహ్మచారిణీం
పంచమం స్కందమాతాచ షష్ఠం భీతిభంజనీం
సప్తమం శూలాయుధధరాంశ్చ అష్టమం వేదమాతృకాం 
నవమం అరుణనేత్రాంశ్చ దశమం వనచారిణీం
ఏకాదశం కార్యసాఫల్యశక్తింశ్చ ద్వాదశం కామకోటిదాం ||

 *సర్వం శ్రీ దుర్గాదేవి చరణారవిందార్పణమస్తు* 

*శ్రీ రాజరాజేశ్వరి ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం రాజరాజేశ్వరీ నామ ద్వితీయం శశిశేఖరప్రియాం
తృతీయాం మన్మదోద్ధారిణీంశ్చ చతుర్ధం అర్ధాంగశరీరిణీం
పంచమం రజతాచలవాసినీంశ్చ  షష్ఠం హరిసోదరీం
సప్తమం  వనచారిణీంశ్చ అష్టమం ఆర్తిభంజనీం
నవమం పంచకోశాంతరస్థితాంశ్చ దశమం మనోన్మనీం
ఏకాదశం మహాప్రళయసాక్షిణీంశ్చ ద్వాదశం షోడశకళాం  ||

*సర్వం శ్రీ రాజరాజేశ్వరీ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం దక్షిణామూర్తి నామ ద్వితీయం వీరాసనస్థితం 
తృతీయం వటవృక్షనివాసంచ చతుర్ధం సనకసనందనాదిసన్నుతం 
పంచమం నిగమాగమనుతంచ షష్ఠం బ్రహ్మజ్ఞానప్రదం
సప్తమం అక్షమాలాధరంశ్చ అష్టమం చిన్ముద్రముద్రం
నవమం భవరోగభేషజంశ్చ దశమం కైవల్యప్రదం
ఏకాదశం భాషాసూత్రప్రదంశ్చ  ద్వాదశం మేధార్ణవం ||

*సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు*  

*శ్రీ సూర్య ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం  సూర్యనారాయణం నామ ద్వితీయం రోగనాశనం 
తృతీయం అహస్కరంచ చతుర్ధం జ్ఞానవర్ధనం
పంచమం పర్జన్యమిత్రంచ షష్ఠం కశ్యపనందనం
సప్తమం సర్వశుభదంచ అష్టమం శతృభంజనం  
నవమం  కిరణకారణంచ దశమం విశ్వతేజసం
ఏకాదశం వేదవాహనంచ ద్వాదశం రామసేవితం || 

*సర్వం శ్రీ సూర్యనారాయణ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ ఆయ్యప్ప ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం శాస్తారం నామ ద్వితీయం శబరిగిరీశం 
తృతీయం ఘృతాభిషేకప్రియంశ్చ ఛతుర్ధం భక్తమానసం 
పంచమం వ్యాఘ్రారూఢంచ షష్ఠం గిరిజాత్మజం  
సప్తమం ధర్మనిష్టంచ ఆష్టమం ధనుర్బాణధరం   
నవమం శబరిగిరివాసంశ్చ దశమం శరణుఘోషప్రియం   
ఏకాదశం యోగముద్రంచ ద్వాదశం హరిహరాత్మకం.

Wednesday, April 3, 2024

నవ గోప్యాలు...

నవ గోప్యాలు.



1 ఆయువు,

2 విత్తము,

3 ఇంటిగుట్టు,

4 మంత్రం,

5 ఔషధం,

6 సంగమం,

7 దానం,

8 మానము,

9 అవమానం

  అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచా ల్సినవి.

  భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.

*1 ఆయువు* :- రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.

*2 ధనం* ( విత్తం) :- ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.

  అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.

*3 ఇంటి గుట్టు:*- ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.

సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.

*4 మంత్రం:-*  ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.

*5 ఔషధం:*- ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.

*6 సంగమం:*- సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.

*7 దానం*:- దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.

*8 శీలం ( మానం )*:- మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.

*9 అవమానం* :- తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. 

ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి..

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Tuesday, April 2, 2024

సూర్యునిరూపాలు.

సూర్యునిరూపాలు.


1. ఇంద్రుడు : 
స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు. 

2. ధాత : 
ప్రజాపతియై భూతములను సృష్టించాడు. 

3. పర్జన్యుడు:
తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.

4 త్వష్ట :
ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి. 

5. పూష : 
ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు. 

6. అర్యముడు :
దేవతారూపంలో వుంటాడు.

7. భగుడు :
ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు. 

8. వివస్వంతుడు :
ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు. 

9.విష్ణువు : 
శత్రువులను నాశనం చేస్తాడు. 

10.అంశుమంతుడు :
గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు. 

11. వరుణుడు :
జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు. 

12. మిత్రుడు :
లోకాాలలో మేలుచేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు. 

🙏🏻🪻🙏🏻🪻🙏🏻

Monday, April 1, 2024

దీపారాధన ఉండగా పూజగది తలుపులు వేయొచ్చా

దీపారాధన ఉండగా పూజగది తలుపులు వేయొచ్చా




🌺ఈ అనుమానం అనేకమందికి ఉంది. నివృత్తి చేసుకోండి 
ప్రాచీనకాలం నుంచి కూడా ప్రతి ఇంట్లోను పూజా మందిరాలు ఉంటూ వస్తున్నాయి. అప్పట్లో వంట గదికి పక్కనే ఈ పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుంటూ వుండేవారు. ఇక ఇటీవల కాలంలో పూజా మందిరానికి బదులుగా అందరూ పూజకి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు.🌺

🌺ఈ విధంగా చేయడం వలన ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది. దైవం పట్ల వెంటనే ఏకాగ్రత కలుగుతుంది.అయితే ఉదయం వేళలోను ... సాయంత్రం వేళలోను పూజ పూర్తి చేసిన తరువాత, వెంటనే పూజ గది తలుపులు వేయవచ్చా? ... వేయకూడదా? అనే సందేహం కొంతమందిలో తలెత్తుతుంటుంది.🌺

🌺మరికొందరు దీపారాధన వుండగా తలుపులు వేయకూడదని అప్పటి వరకూ ఆ తలుపులను తెరిచే వుంచుతుంటారు.ఇంకొందరు దీపారాధనను కొండెక్కించేసి తలుపులు వేసేస్తుంటారు. ఈ విధంగా ఉద్దేశ పూర్వకంగా దీపారాధనను కొండెక్కించకూడదని శాస్త్రం చెబుతోంది.🌺

🌺అలాగే దీపారాధన ఉన్నంత వరకూ తలుపులు తెరచి ఉంచవలసిన పనిలేదని. భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తరువాత పూజ గది తలుపులను వేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాన్ని పాటించడం వలన ఎలాంటి దోషం కలగదని శాస్త్రం స్పష్టం చేస్తోంది...

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS