Tuesday, February 18, 2020

మహా శివరాత్రి వ్రత మహాత్యం

మహా శివరాత్రి వ్రత మహాత్యం

మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి, ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే.

ఓసారి బ్రహ్మ, విష్ణువు, పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని, ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికీ, విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి, దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని, ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి.

జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్ధశి శివుడికి ఎంతో ప్రీతికరం.ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. ధర్మసాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వవర్ణాలవారు, అన్ని ఆశ్రమాలవారు, స్త్రీలు, పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు.

మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్ఠం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం, లోపల, బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలోమాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు.

భక్తి భావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు, శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం, ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి.

చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజచేయాలి. ఎర్రగన్నేరు, పద్మంలాంటి పుష్పాలతోఅర్చించాలి. భవుడు, శర్వుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్‌, భీముడు, ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది.

రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు, యవలు, కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే.

మూడో జాములో చేసే పూజలో యవలస్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను. శాకపాకాలను, అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి.

నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలను,శంఖ పుష్పాలకు, మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ, మినుములతో కలిపి వండిన అన్నాన్నీ కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకుఆ జాము పూజ పూర్తికాగానే ఉద్వాసన చెప్పటం, మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతుండాలి.

నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని, ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు, సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి చెప్పాడు. ఈ కథా సందర్భం వల్ల యుగయుగాలుగా శివరాత్రి వ్రతం ఆచరణలో ఉందన్న విషయం స్పష్టమవుతుంది.

శివరాత్రి నోము

శివరాత్రి నోము
.

పూర్వకాలములో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతడెంతటి విద్యాసంపంన్నుడో అంతటి దారిద్రము అతడిని వేదిస్తుండేది. యెంత ప్రయత్నించినా చేతికి చిల్లి గవ్వైనా లభించేదికాదు. ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా వుండేది. ఈ దుర్భర పరిస్తులతో మరొకర్ని యాతన పెట్టడం ఇష్టం లేక దేనికని వివాహం చేసుకోలేదు. నా అన్నవారెవరూ లేక సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతుండేవాడు. క్రమక్రమంగా అతడికి జీవితం మీద విరక్తి కలిగింది. ప్రాణాలు తీసుకోవడం శాస్త్రసమ్మతం కాదని నారు పోసినవాడు నీరు పొయ్యక పోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు. క్రమక్రమంగా ఓర్పు నశించింది. ఇంక ప్రాణ త్యాగం ఒక్కటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు. నీటిలో పడాలి, అగ్నికి ఆహుతికావాలి. కత్తి కటార్లతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు. నిద్రలో అతనికి పరమేశ్వరి సాక్షాత్కరించి ఓయీ! ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాదేడవు. సదాశివుడు కన్నా దయామయుడు లేడు ఆ శంకురుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది. మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్లి తన బాధలను తనకు వచ్చిన కళను చెప్పి శివ కరుణ కొరకు తానేమి చెయ్యాలి అని ప్రశ్నించాడు. విప్రోత్తమా పార్వతి పరమేశ్వరులు జననీ జనకులు కదా జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రభోదించింది. ధన్యుడవు శివునకు ప్రీతియైన రోజు శివరాత్రి ప్రతిమాసంలో ఆఖరి మూడవరోజు శివరాత్రౌతుంది. ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసముండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మహా శివరాత్రి వరకు గడుపు. ఆనాడు కలిగిన మేరకు ఎవరికైన ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందు నీ బాధలు తీరుతాయి. దారిద్యము తొలగిపోతుంది . ఆరోగ్య వంతుడవు అవుతావు అని చెప్పగా ఆ ప్రకారంగా భక్తి శ్రద్దలతో శివరాత్రి నోము నోచుకుని అతడు జీవితాంతం సుఖముగా వున్నాడు.
ఉద్యాపన: ప్రతి మాసశివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారము జాగారము చేయాలి. ఇలా సంవత్సరకాలం ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చెయ్యాలి. మహా శివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్ధం చెయ్యక శివాక్షరిని జపించాలి. శివునకు అర్చన చెయ్యాలి. ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం ఆర్ధిక సహాయము నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి.

Monday, February 17, 2020

స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారర్_ఆలయం

స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారర్_ఆలయం


=============================

ఈ ఆలయం యొక్క పేరు #తిలతర్పణపురి అనే గ్రామంలో వున్న స్వర్నవల్లి సమేత #ముక్తీశ్వారర్_ఆలయం.
ఈ ఆలయం కూతనూరు సరస్వతీ ఆలయానికి 3 కి. మీల దూరంలోను, తమిళనాడులోని తిరునల్లార్శనిభగవానుని ఆలయానికి 25కి.మీ ల దూరంలోను కలదు.
ఎవరైతే పిత్రుదోషాలతో బాధపడుతున్నారో వారు దర్శించి పితృదోషాలను పోగొట్టుకోవలసిన ఆలయం
ఈ ఆలయంలో సాక్షాత్తూ రాములవారు తన తండ్రి అయిన దశరథుడికి పితృకార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. అయితే ఆయన భారతదేశమంతా తిరిగి ఎన్నో చోట్ల పిండాలు పెట్టినప్పటికీ తండ్రికి ముక్తి లభించకపోవటంతో శివుని ప్రార్థించగా పరమశివుడు ఇక్కడ తనను కొలనులో స్నానం చేసి తన తండ్రికి పితృ తర్పణాలు మొదలుపెట్టమని చెప్పిన స్థలం. అందుకనే ఈ ఊరిని "తిలతర్పణపురి" అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం. అంటే ఎక్కడైతే తిలలు రాముడు వదిలాడో ఆ ఊరినే తిలతర్పణపురి అని పిలవటం జరుగుతుంది.
#తిలతర్పణపురి

ఇక్కడ రాములవారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాలరూపంలో మారటం జరిగింది. అందువలన ఈ ఊరిని తిలతర్పణపురి అని పిలవటం జరుగుతూంది.

#త్రివేణి_సంగమం
ఈ ఆలయం ముఖ్యంగా భారతదేశంలోనే 7 స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా చెప్పబడుతోంది.
#దోషాల_నుంచి _విముక్తి
అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూవుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరు.
#మరొక_ప్రత్యేకత
అంతేకాక ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే గణపతి. ఇక్కడ నరముఖంతో వున్న గణపతి వున్నారు.
#బాలగణపతి
ఇక్కడ గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో వుంటారు. ఇలాంటి ఆలయం చాలా అరుదుగా వుంటుంది.
#నరముఖ_గణపతి
ఈ ఆలయం ముఖ్యంగా నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతితో చాలా ప్రసిద్ధి చెందినది.

పంచారామ క్షేత్రాలు

పంచారామ  క్షేత్రాలు మొత్తం  5 . . .

రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
పూర్వం ముక్కంటి కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడ్డాయని, ఆ ఐదు క్షేత్రాలే పంచారామములైనాయని పురాణాలు చెబుతున్నాయి.
"శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః" - స్కాందపురాణం
తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలైనాయని స్కాంద పురాణం పేర్కొంటోంది.
అవే 1. దాక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
2. కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
3. క్షీరారామము (పాలకోల్లు, ప||గో|| జిల్లా) - రామలింగేశ్వరుడు
4. భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) - సోమేశ్వరుడు
5. అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు - ఈ ఆలయాల్లోని శివలింగాలను దేవతలు ప్రతిష్టించినవని స్థల పురాణాలు చెపుతున్నాయి.
ఇకపోతే.. శ్రీనాథుడు (15 శతాబ్దము) రచించిన భీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఇలా చెప్పియున్నాడు. పూర్వం సముద్ర మధనంలో లభించిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి దేవతలకు, రాక్షసులకు పంచిపెడుతుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు జపతపములను ఆచరించారు.
వీరి జపములకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వరములను ప్రసాదిస్తాడు. కొత్తగా సంపాదించిన వరాల శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేస్తారు. ఇలా రాక్షసులకు హింసలకు గురైన దేవతలు చేసేది లేక ముక్కంటి అయిన ఈశ్వరునినే శరణు వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు తన పాశుపతంతో రాక్షసులను వారి రాజ్యాన్ని బూడిద గావిస్తాడు.
అలా ఏర్పడిన రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధిచెందింది. ఈ దేవాసుర యుద్ధంలొ త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహాదేవుడు ఐదు ముక్కలుగా చేధించి ఐదు వేరు వేరు ప్రదేశములందు ప్రతిష్టించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. ఇలా లింగ ప్రతిష్ట చేసిన ఈ ఐదు ప్రదేశములే "పంచారమములు"గా ప్రసిద్దికెక్కాయని భీమేశ్వర పురాణం చెబుతోంది.
అయితే స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తోంది. హిరణ్యకశిపుని కుమారుడు నీముచి. ఈ నీముచికి తారకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు పరమేశ్వరుడి అనుగ్రహం సంకల్పించి ఘోర తపస్సు చేశాడు.
ఈ తపస్సుకు ప్రతిఫలంగా పరమేశ్వరుని ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులచే తనకు మరణం సంభవించకూడదనే వరం కూడా పొందాడు.
బాలుడు తననేం చేయగలడనే ధీమా, అహంతో తారకాసురుడు ముల్లోక దేవతలను నానా హింసలు పెట్టేవాడు. ఆ దానవుడి హింసకు భరించలేని దేవతలు ముక్కంటి ప్రార్థించడం, తారకాసురుడిని వధించడం కోసం పరాక్రమశాలి అయిన శివబాలుడు-కుమార స్వామి ఉదయించడం జరుగుతుంది.
పరమేశ్వర రక్షణతో బహు పరాక్రమశాలిగా అవతరించిన కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరిస్తాడు. ఆ సమయంలోనే తారకాసురుని గొంతులోని ఆత్మలింగం ముక్కలై.. ఐదు ప్రదేశాల్లో పడిందని అవే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయని స్కాంద పురాణం చెబుతోంది.
మొత్తానికి పంచారామ క్షేత్రాలను సందర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఈ పుణ్యక్షేత్రాల్లోని ప్రతి లింగానికి ఓ ప్రత్యేకత ఉందని, దానిని గుర్తించి లింగేశ్వర ఆరాధన చేసేవారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ..

. వివిధ జీవన సమస్యలకు, గ్రహదోషాలకు దేవతా మంత్ర పరిష్కారాలు

*🌹. వివిధ జీవన సమస్యలకు, గ్రహదోషాలకు దేవతా మంత్ర పరిష్కారాలు 🌹*

మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో మీ కోసం. 

*💥. వ్యాపార లాభాలకు మంత్రం*
1. దుర్గే శివే భయనాశిని మాయే నారాయణి సనాతని
జయే మే పత్య దేహేదేహిన్‌ రక్షరక్ష కృపాకరీ
2. ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః
మంత్రం:
శివశక్తి కామక్షితి రధ రవి శ్శీతకిరణం స్మరో హంస శక్రస్త
ధనుజ పరామార హరయః
అమీ హృల్లేకాభిఃతి స్వభావ రసానేషు ఘటితా
భజన్తే వర్ణాస్తే తవ జననీ నామావయవతాం

*💥. హనుమాన్‌ శత్రుంజయ మంత్రం:*
ఓం నమో భగవతే మహాబల పరాక్రమాయ మహా విపత్తి నివారణాయ
భక్తజన మనోభీష్ట కల్పనాకల్ప ధ్రుమాయ
దుష్టజన మనోరథ స్తంభనాయ
ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీం

*💥. ధనప్రద శ్రీ లక్ష్మీ కుబేర మంత్రం:*
కుబేరో ధన దః శ్రీ దః రాజరాజో ధనేశ్వరః
ధనలక్ష్మీ ప్రయతమో ధనాడ్యో ధనిక ప్రియః
ఓం శ్రీం క్లీం శ్రీం కార్యసిద్థి కుబేరాయ నమః
ఓం శ్రీం క్లీం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమః
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం యుక్తేశ్వరాయ నమః
ఓం యక్షాయవిద్మహే వైశ్రవణాయ ధీమహే
తన్నో కుబేర ప్రచోదయాత్‌

*💥. విద్యా విజయానికి మంత్రాలు.*
1. ఆనంద తీర్థ వరదే దానవారణ్య పావకే
జ్ఞానదాయనే సర్వేశే శ్రీనివాసేస్తు మే మనః
2. శ్రీవేంకటేశా శ్రీనివాసా సర్వశత్రు వినాశకా
త్వమేవ శరణం స్వామిన్‌ సర్వత్ర విజయం దిశా

*💥. సంతాన గోపాల మంత్రం:*
ఓం హ్రీం కృష్ణాయ హూం శ్రీం క్లీం గోవిందాయ ఫట్‌ స్వాహా
ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణా గోవిందా గోపీజన వల్లభా మమ పుత్ర దేహీ స్వాహా
దేవకీ సుత గోవిందా దేవదేవ జగత్పతే దేహిమే తనయే కృష్ణా తవమహం శరణం గతః

*💥. విద్యాప్రాప్తికి సరస్వతీ స్తోత్రం:*
సరస్వతీ మాం దృష్ట్యా వీణా పుస్తక ధారిణీం
హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరే మమ
ప్రథమం భారతీనామా, ద్వితీయంచ సరస్వతీ
తృతీయ శారదాదేవీ, చతుర్థం హంస వాహిని
పంచమం జగతీ ఖ్యాతా, షష్ట్యం వాణీశ్వరీ తథా
కౌమారీ సప్తమం ప్రోక్తా, అష్టమం బ్రహ్మచారిణి
నవమం బుద్ధి ధాత్రీచా, దశమం వరదాయని
ఏకాదశం క్షుద్ర ఘంటా, ద్వాదశం భువనేశ్వరీ
ద్వాదశైతాని నామాని త్రిసంధ్య యః పఠేన్నరః
సర్వసిద్ధి ఖరీతస్య ప్రసన్న పరమేశ్వరీ
సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతీ

*💥. విజయానికీ సకల దోష నివారణకూ తగిన మంత్రాలు, స్తోత్రాలు..*

*లక్ష్మీగణపతి:.*
సర్వవిజ్ఞ హరం దేవం సర్వవిజ్ఞ వివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం లక్ష్మీగణపతిం భజే

*క్షమాపణకు:.*
నారాసింహానంత గోవిందా భూతభావన కేశవా
దురుక్తం దుష్కృతం ధ్యాతం శమయాషు జనార్దనా

*💥. సర్వఫలప్రదభైరవ స్తోత్రం:.*
ఓం భైరవాయ అనిష్ట నివారణాయ స్వాహా
మమ సర్వేగ్రహ అనిష్ట నివారణాయ స్వాహా
జ్ఞనం దేహి ధనం దేహి మమ దారిద్య్రం నివారణాయ స్వాహా
సుతం దేహి యశం దేహి మమ గృహక్లేశం నివారణాయ స్వాహా
స్వాస్థ్యం దేహి బలం దేహి మమ శత్రు నివారణాయ స్వాహా
సిద్ధం దేహి జయం దేహి మమ సర్వ రుణాం నివారణాయ స్వాహా

*💥. దీర్ఘాయువుకూ, చిరంజీవత్వానికి:*
అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ్ఛ విభీషణః
కృపః పరశురామాచ్ఛ సప్తైతే చిరంజీవి నమః
సప్తైతాన్‌ సంస్మరే నిత్యం మార్కండేయ మదాష్టకం
జీవేద్వర్ష శతంశోపి సర్వవ్యాధి వివర్జితః

*💥. విద్యావిజయంకరీ మంత్రం:*
ఓం ఐం హ్రీం హ్రీం క్లీం క్లీం హౌం సః
నీల సరస్వతే నమః
(ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కనీసం 11సార్లు లేదా 108సార్లు జపిస్తే సత్వర విద్యాభివృద్ధి కలుగుతుంది)

*💥. సత్వర వివాహానికి - దాంపత్య దోష నివారణకు.*
1. కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్‌ యతీశ్వరీ
నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః
2. అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర
3. విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే
3 సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే
గమనిక: రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం కూడా మంచిది

*💥. మంగళచండికా స్తోత్రం:*
రక్షరక్ష జగన్మాతా దేవీ మంగళ చండికే
హారికే విపదం రక్షే హర్ష మంగళ కారికే
హర్ష మంగళ దక్షేచా హర్ష మంగళ దాయినే
శుభే మంగళ దక్షేచా శుభే మంగళ చండికే
మంగళే మంగళా ర్హేచా సర్వమంగళ మంగళే
సదా మంగళాదేవీ సర్వేశాం మంగళలయే

*💥. భార్యాభర్తల పరస్పర ఆకర్షణకు.*
ద్రాం ద్రవిణే బాణాయ నమః
ద్రీం సంక్షోభణ బాణాయ నమః
క్లీం ఆకర్షణ బాణాయ నమః
బ్లూం వశీకరణ బాణాయ నమః
సం సమ్మోహన బాణాయ నమః

*💥. పురుషత్వం,సంతాన ప్రాప్తికి.*
కథాకాళేమాతః కథయా కళితాలక కరశం
పిబేయం విద్యార్థీ తవచరణ నిర్లేజన జలం
ప్రకీర్తా మూకనామ పిచకలితాకారణ తయా
యథాదత్తే వాణీముఖ కమల తాంబూల రసతాం

*💥. శీఘ్ర వివాహానికి..*
కన్య నిత్యం స్నానానంతరం తులసి చెట్టుకు 12 ప్రదక్షిణాలు చేసి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4,11,27
శ్లోకాలలో ఏదో ఒకదాన్ని పఠించాలి. ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది.

🙏🕉ఓం  శ్రీ శ్రీ శ్రీ అష్టలింగేశ్వరస్వామియేనమః🙏
💐 🌹 💐 🌹 💐 🌹

అక్కమహాదేవి గురించి విన్నారా

🙏అక్కమహాదేవి గురించి విన్నారా🙏

అక్కమహాదేవి. ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గుహ గుర్తుకువస్తుంది. విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘకాలం తపస్సు చేసుకుందని చెబుతారు. కానీ అక్కమహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు. సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి. భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి. ఆ పరమేశ్వరుని తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తూ ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లు మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుతడి అనే చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామపర్యటనకు వెళ్లాడు. అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చొన్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరుని మీద లగ్నమైపోయింది. అలాగని రాజుగారి మాట కాదంటే తన కుటుంబానికి కష్టాలు తప్పవు. అందుకని మహాదేవి ఒక మూడు షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నదట. ఆ పరమేశ్వరుని తనకు తోచిన రీతిలో, తోచినంతసేపు ధ్యానించుకోవచ్చునన్నది ఆ షరతులలో ఒకటి.

అక్కమహాదేవి షరతులకు లోబడి రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ అనతికాలంలోనే ఆమె షరతులను అతిక్రమించాడు. దాంతో ఆమె కట్టుబట్టలతో రాజమందిరం నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు వంటి ప్రముఖులు ప్రజలందరినీ భక్తిబాటలో నడిపిస్తున్నారు. అలాంటి పండితులందరూ ప్రవచనాలు చేసేందుకు, తమ వాదనలు వినిపించేందుకు అక్కడ అనుభవ మండపం పేరుతో ఒక వేదిక ఉండేది. మహాదేవి ఆ అనుభవ మండపాన్ని చేరుకుని... శివుని మీద తనకి ఉన్న అభిప్రాయాలు, అనుభూతులను పంచుకున్నారు. మహాదేవి వాదనాపటిమను, పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు ‘అక్క’ అన్న బిరుదుని అందించారు. అలా మహాదేవి కాస్తా అక్కమహాదేవిగా మారింది.

అక్కమహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్లవలసిందిగా సూచించాడట. దాంతో ఆమె ఎన్నో కష్టానికి ఓర్చి శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధికి చేరుకుంది. ఆనాటి శ్రీశైలం అంటే మాటలా! దుర్గమమైన అడవులు, క్రూరమృగాలు, ఎడతెగని కొండలు, దారిదోపిడీగాళ్లతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది. అలాంటి ప్రాంతంలో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసిని సంచరించడం అంటే మాటలు కాదు. కానీ ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు. ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో, మనిషి కూర్చోవడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె తన తపస్సుని సాగించారు. కొన్నాళ్లకి శ్రీశైలంలోని కదళీవనంలో ఆ మల్లికార్జునిలో అంకితమైపోయారు.

అక్కమహాదేవి మహాభక్తురాలే కాదు... గొప్ప రచయిత్రి కూడా. కన్నడలో ఆమె 400లకు పైగా వచనాలు రాసినట్లు గుర్తించారు. ప్రతి వచనంలోనూ ‘చెన్న మల్లికార్జునా!’ అనే మకుటం కనిపించడం వల్లే అవి అక్కమహాదేవి రాసిన వచనాలుగా భావిస్తున్నారు. ఆమె వచనాలలో శివుని పట్ల ఆరాధన, ఈ ప్రకృతి పట్ల నమ్మకం, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తాయి. వీటిలో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే గూఢార్థాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. కన్నడలో ఈమెని తొలి రచయిత్రిగా భావించేవారూ లేకపోలేదు. అక్కమహాదేవి రాసిన వచనాలను తెలుగులోకి కూడా అనువదించారు. దొరికితే తప్పకుండా చదవండి. అందులో అరుదైన  ఆణిముత్యాలు ఎన్నో కనిపిస్తాయి. మచ్చుకి ఒక వచనం ఇదిగో....
మట్టిపెల్లలవలె కరిగికరిగి, ఇసుకదిబ్బలవలె జరిగి జరిగి
కలలో కలవరపడి నేను వెరగొందిగి
అవములో నిప్పువలె చుట్టిచుట్టి కందితిని
ఆపదలో ఆప్తులనెవరిని కాన
వెదకి కానని తనువును, కలసిన కూడని సుఖమును
నాకు కరుణించుమో చెన్నమల్లికార్జునా!

🙏శ్రీ మాత్రే నమః🙏

ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.



 ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.   
               

మనకు తెలియని శ్రీశైల దివ్యక్షేత్ర మహిమలు:
ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది.
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో.
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.

కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.

ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది.

* అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
* అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
* రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.
* ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.
* సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
* కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ?

అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.

ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు

ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. 

ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే.✍

                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

శివరాత్రి జాగరణ విశిష్టత

💐💐శివరాత్రి జాగరణ విశిష్టత💐💐

ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. 
అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. 

చెప్పిన దాని ప్రకారం, 
ఆ రోజు పగలంతా నియమనిష్ఠలతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని 
మొదట పాలతో, 
తర్వాత పెరుగుతో, 
ఆ తర్వాత నేతితో, 
ఆ తర్వాత తేనెతో 
అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. 

మరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. 
దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.

మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. 
కానీ, మాఘ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. 
అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. 
మహాశివుడంటే అందరికి తెలుసు. 
కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. “రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి” అయిందంటారు. 
సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. 
ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది – 
హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!… వగైరా –

‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ||’

నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. 
అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. 
మహా శివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి 
ఓ ప్రత్యేకత వుంది. 
చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, 
ఆ రాత్రి జాగర్ణం వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు 
తాగే అవసరం రాదు. 
అంటె ఆ భక్తుడు జీవన్ముక్తుడౌతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. 
అంతటి మహిమాన్వితమైనది  శివపూజ.

‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’

అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ, అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. 
వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. 
ప్రముఖ విషయం ఒకటే. 
ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, 
బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, 
రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. 
వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. 
దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు.

మహాశివరాత్రి రోజు ఉపవాసము, 
జాగరణ శివపూజ ప్రధానమైంది. 
అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. 
అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. 
వైదిక సాహిత్యంలో దీని అర్థం – 
వేద బోధితమని, ఇష్ట ప్రాపకర్మ అని వుంది. 
దార్శనిక గ్రంథాల్లో ‘అభ్యుదయ ‘ మని, ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని, అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. 
అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ, శాస్త్ర విహిత నియమాది, సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. 
సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.
మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. 
అలా అని ‘ తిథితత్వం ‘ లో చెప్పబడింది. 
ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా, 
మంచి వస్త్రాలు ధరించినా, 
ధూపాలు వెలిగించినా, 
పూజ చేసినా, 
పుష్పాలంకరణ చేసినా 
వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం ‘ అంటాడు శివుడు.

మరి ఉపవాసం అంటే ఏమిటి......?
దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. 
వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే 
ఈ శ్లోకం.
‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)

భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.
‘ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||’

మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. 
వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. 
ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట. 
చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. 
భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పడు. ‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. 
అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. 
అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. 
తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.

‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘

విషయాసక్తుడు నిద్రలో వుంటే అనుద్లో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. 
అందువల్ల శివరాత్రి రోజు జాగరన ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.

శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – 
గరుడ పురాణంలో ఇలా వుంది – 
త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, 
వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. 
అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని  పాటించాలి. 
మీ ప్రకటన ఇలా ఉండాలి – 
‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. 
నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. 
నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. 
రెండవరోజు మాత్రమే తింటాను. 
ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”

వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. 
పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత దాతువులు – ఆవు పేడ – ఆవు పంచితము, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. 
అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ ‘ అనుకుంటూ జపించాలి. 
చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. 
అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. 
ఈ హోమము తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. 

అందమైన శివకథలు వినవచ్చు. 
వ్రతులు మరొకసారి రథరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. 
సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ ‘ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. 
ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే –
 ‘ పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. 
హే లోకేశ్వరా! శివ – భవా! నన్ను క్షమించు. 
ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా, మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. 
హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! 
మీ నివాసానికి వెళ్ళండి. 
మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.

అటు తర్వాత శివ భక్తులకు భోజనము. 
వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. 
నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. 
ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. 
అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు 
మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి 
జరుపు కుంటున్నాం.

ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే, 
ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలనీ, 
శక్తికొలదీ పాలు,గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ, 
ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.

శివరాత్రికి లింగోద్భవకాలమని కూడా పేరు. 
ఆ రోజు అర్థరాత్రి జ్యొతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. 
పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. 
అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం . 
ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడం లోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. 
శివమంటే జ్ఞానమే. 
జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది.

శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు ‘ బిల్వ ‘ మూలంలో ఉంటాయనీ, 
శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. 
కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. 
సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్త్యానుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు.

శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.

Sunday, February 16, 2020

మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం

మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం

భీమవరం  మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. తొమ్మిది దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.
చారిత్రక నేపథ్యం- :
చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు ఈ విధంగా ఉన్నాయి.1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. అమ్మవారి ఆదేశానుసారం వారు అయిదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడితోటలోవెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో 'మామిళ్ళమ్మ'గా తదనంతరం 'మావుళ్ళమ్మ'గా పిలవటం అలవాటయ్యింది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910 వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాల వరకు పాడైంది. 1920 లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కాని ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చి దిద్దాడు.
ఆలయ విశిష్టత- :

ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుని, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడము ఇందలి ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు.... చీరలు వంటి వాటిద్వారా ప్రతియేటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అమ్మవారికి ఆభారణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 65 కిలోల బంగారంతో చీర ఆభరణాలు తయారు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీని కొరకు స్థానిక ప్రముఖులు.... విదేశాలలో ఉన్నవారు స్పందిస్తున్నారు. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేశారు. ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడము, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత అని పూజారి రామలింగేశ్వర శర్మ అంటాడు.
పూజలు, ఉత్సవాలు- :
ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. జ్యేష్టమాసంలో నెల రోజులు గ్రామ జాతర, నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. ప్రతి రోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరిరోజున వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది.
పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ఉన్నది ఈ క్షేత్రము
ఇతర విశేషాలు- :
ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.
1910 సంవత్సరంలో వరదల కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో నాని చాలా వరకూ దెబ్బతిన్నది. దానితో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడు. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంథి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్ధుడువిగ్రహాలను చెక్కారు.
మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంథి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.
ఉత్సవ విశేషాలు- :
ఇక్కడి విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారికి ప్రధర్శనలకు పిలుస్తూ తగిన పారితోషికాలతో ప్రోత్సాహీమ్చడం. ఇక్కడ తొలిరోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు ఇలా జరుగుతుంటాయి.
బుర్రకథలు, హరి కథలు, కోలాటాలు, భజనలు, సంగీత కఛేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభ్నయాలు. ఇలా అనేక ప్రధర్శనలు జరుపుతుంటారు. ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉంది.

విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన మహిమాన్విత తల్లే శ్రీకనకమహాలక్ష్మి.

కనకమహాలక్ష్మి

విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన మహిమాన్విత తల్లే శ్రీకనకమహాలక్ష్మి. ఉత్తరాంధ్ర వాసులకేగాక సకల తెలుగు జనావళికి సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా భాసిల్లుతోందామె. బంగారం కొన్నా వెండి కొన్నా తమ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నా బిడ్డ పుట్టినా విశాఖప్రాంతవాసులు ఆ విశేషాన్ని కనకమహాలక్ష్మికి నివేదించి, ఆశీస్సులు అందుకోవడం ఇక్కడి ఆచారం. ఇది గోపురం లేని గుడి. మూలవిరాట్టుకు భక్తులు స్వయంగా పూజలు నిర్వహించుకోవడం ఈ క్షేత్ర విశిష్టత. ఏ వేళలో అయినా దర్శించుకునేందుకు వీలుగా 24 గంటలూ తెరిచి ఉంచే ఆలయం ఇది. సంక్రాంతి సందర్భంగా ఈ అమ్మవారిని సేవించుకున్నా, స్మరించుకున్నా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ అమ్మవిశేషాలు అందరికోసం...

శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు. ఆమె నెలకొన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు విశాఖ రాజుల కోటబురుజు ఉండేదని, అందుచే తల్లి ఉన్న ఈ ప్రాంతాన్ని బురుజుపేటగా పిలుస్తున్నారని అంటారు. అయితే ఒకసారి శత్రురాజులు బురుజుపై దండెత్తి వచ్చినప్పుడు అమ్మవారిపై దృష్టి పడకుండా ఉండేందుకు విగ్రహాన్ని బావిలో పడవేశారనీ తర్వాత బయటకు తీసి గుడిలో ప్రతిష్టించారని ఒక కథనం. మరో కథనం ప్రకారం కలియుగారంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు దైవ సాన్నిధ్యం పొందాలన్న కోరికతో కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపేట చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అయినందున పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ప్రస్తుత అమ్మవారి క్షేత్రం వద్ద గల బావిలో స్నానమాచరించి సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తుండగా అమ్మవారి వాణి వినిపించింది. కలియుగ భక్తుల కోర్కెలు తీర్చడానికి తాను వెలిశానని, బావిలో ఉన్న తనను బయటకు తీసి ప్రతిష్టించమని అమ్మ కోరింది. కాని బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించి తాను కాశీకి వెళ్లే తొందరలో ఉన్నట్టు నివేదించి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో అమ్మ ఆగ్రహం చెంది బావి నుంచి పైకి వచ్చి తన వామహస్తంలో గల పరిఘ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుణ్ణి సంహరించటానికి ఉద్యుక్తురాలయ్యింది. అది చూసి భీతిల్లిన బ్రాహ్మణుడు రక్ష కోసం శివుణ్ణి ప్రార్థించగా, శివుడు తన దివ్యదృష్టితో సంగతి గ్రహించి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యపరచి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడు. దాంతో అమ్మవారిలో కోపం మటుమాయమై శాంతి, కారుణ్యం నిండగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. అంతట మహేశ్వరుడు ఆమెను కలియుగంలో శ్రీకనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించినట్టూ అలాగే బ్రాహ్మణుడికి దైవ సాన్నిధ్యం ఇచ్చినట్టూ కథనం. ఈ కథనానికి తార్కాణంగా అమ్మవారి మూలవిరాట్టు వామహస్తం మోచేతి వరకూ ఖండించబడి ఉండటాన్ని మనం చూడవచ్చు.
అమ్మ ఆగ్రహం: 

కనకమహాలక్ష్మి ఆలయం మొదటి నుంచీ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే ఉంది. 1912 కాలంలో వీధి వెడల్పు చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం కదపకుండా వీధి మధ్యలోనే ఉంచేసినా 1917లో రోడ్డు మధ్యబాగం నుంచి 30 అడుగుల దూరంలో ఒక మూలగా జరిపారు. అప్పుడే విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలింది. దీంతో ప్రజలు భయభ్రాంతులై అమ్మవారి విగ్రహాన్ని కదిలించడం వల్లే ఈ విపత్తు జరిగిందని భావించి అమ్మవారి విగ్రహాన్ని యథాస్థానంలోకి చేర్చారు. దాంతో ప్లేగు వ్యాధి తగ్గి జనం స్వస్థత చెంది ఇదంతా అమ్మవారి మహాత్మ్యం వల్ల జరిగిందన్న ప్రగాఢ విశ్వాసం ప్రబలింది. అప్పటి నుంచి ప్రజలు అమ్మవారికి ఇతోధికంగా పూజలు చేయడం ప్రారంభించారు. కాగా, ఈ గుడికి పైకప్పు కట్టడానికి జరిగిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అంటే అమ్మకు అది ఇష్టం లేదని గ్రహించి ఆ తర్వాత ఆ ప్రయత్నాలను విరమించారు. అమ్మ సకల జనులకు అందుబాటులో ఉంటుంది. కనుకనే పూజలు చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి నివేదించి సేవించుకొనే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా స్త్రీలు అమ్మను ఐదవతనాన్ని ఇనుమడింపజేసే దేవతామూర్తిగా భావిస్తారు. అమ్మవారికి గురువారం ప్రీతికరమైన రోజు. ఆ రోజున తెల్లవారినది మొదలు రాత్రి వరకు అమ్మను దర్శించి పసుపు, కుంకుమలతో పూజించి నారికేళం సమర్పించడానికి వచ్చే భక్తులకు అంతుండదు.

ఆర్జిత సేవలు...: పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, అష్టోత్తర కుంకుమపూజ, లక్ష కుంకుమార్చన (ప్రతి నెల మొదటి మంగళవారం), స్వర్ణ పుష్పార్చన (ప్రతి నెల రెండో మంగళవారం), శ్రీలక్ష్మీ పూజ (ప్రతి గురువారం, శ్రావణమాసం నెల రోజులు), భారీ వాహన పూజ, ద్విచక్ర, త్రిచక్ర వాహన పూజ, లక్ష పసుపు కొమ్ముల పూజ, సినిమా రీలు, అష్టదళ పద్మారాధన (ప్రతి గురువారం)తో పాటు..
శాశ్వత పూజలు...:

శాశ్వత సహస్రనామార్చన (ప్రతి గురువారం గోత్రనామాలతో పూజ నిర్వహిస్తారు), శాశ్వత పంచామృతాభిషేకం (సంవత్సరంలో ఒక రోజు), శాశ్వత క్షీరాభిషేకం (సంవత్సరంలో ఒక శుక్రవారం), శాశ్వత అష్టోత్తర కుంకుమార్చన (సంవత్సరంలో ఒక రోజు.. దాతలు కోరిన తేదీ), మార్గశిరమాసం పంచామృతాభిషేకం (గురువారం మాత్రమే), మార్గశిరమాసం
పంచామృతాభిషేకం (గురువారం మినహా).

అమ్మవారి మాలధారణ: అయ్యప్ప మాల, కనకదుర్గ మాల, శ్రీశైల మాల ఉన్నట్టుగానే కనకమహాలక్ష్మి మాత కరుణకు కూడా మాలధారణ దీక్ష ఉంది. అమ్మకు ఇష్టమైన మార్గశిరమాసంలో ఈ మాలధారణ దీక్ష పాటిస్తారు. దీక్ష చేపట్టిన భక్తులు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి, ఆకుపచ్చని మాలలను వేసుకుంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు దీక్షను పాటించవచ్చ. దీక్ష ప్రారంభం రోజున గురుమాతచే ఆలయంలో ఆకుపచ్చ వస్త్రాలు ధరించి అమ్మవారికి కుంకుమపూజ చేయాలి. ఆ రోజు నుంచి దీక్ష విరమించే వరకు ప్రతి రోజూ ఉదయం, మధాహ్నం, సాయంత్రం తలస్నానం చేసి అమ్మవారి ఫొటో లేదా ప్రతిమకు అష్టోత్తర పూజలు చేసి శరణుఘోష జరపాలి. దీక్షా సమయంలో బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారం, మత్తు పానీయాలు, ధూమపానానికి దూరంగా ఉండాలి. పాదరక్షలు ధరించకుండా ఏకభుక్తం చేసి రాత్రి అమ్మవారికి నైవేద్యం చేసిన పాలు, ప్రసాదం, పళ్లను భుజించాలి. నేలమీద మాత్రమే నిద్రపోవాలి. దీక్షా కాలంలో అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారి పట్ల ఏకాగ్రత చిత్తం కలిగి ఉండాలి
ముఖ్య ఉత్సవాలు

శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రతి నవంబర్‌ డిసెంబర్‌లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది దేవి శరన్నవరాత్రులు కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతాయి. మూలవిరాట్‌కు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహిస్తుంటారు. లక్ష కుంకుమార్చన, లక్ష చేమంతుల పూజ, లడ్డూల పూజ, క్షీరాభిషేకం, కలువల పూజ, లక్ష తులసిపూజ, లక్ష గాజుల పూజ, పసుపుకొమ్ములతో పూజ... ఇవన్నీ కన్నుల పండువగా జరుగుతాయి. అలాగే శ్రావణమాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు శ్రీలక్ష్మీపూజలు (కుంకుమ పూజలు) నిర్వహిస్తారు. శ్రావణమాసం నెలరోజులు సుమారు ఐదు వేల మంది దంపతులు ఈ కుంకుమ పూజలో పాల్గొంటారు.

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS