Saturday, April 29, 2023

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంతి

 శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంతి


*ఓం శ్రీ వాసవాంబాయైనమః*

*ఓం కుసుమ పుత్రీచ విద్మహే*
*కన్యకుమారి ధీమహి*
*తన్నో వాసవీ ప్రచోదయాత్‌*

_*ఉపోద్ఘాతం - చరిత్ర*_

స్త్రీలోని ఆత్మీయతకు , అనురాగానికి , సౌమ్యానికి , త్యాగగుణానికి , పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం *‘వాసవీ కన్యకా పరమేశ్వరి’*. సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత గ్రంధ ఆధారంగా వాసవి కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల సహోదరి. 10వ , 11వ శతాబ్ధానికి చెందిన కుసుమశ్రేష్ఠి - కుసుమాంబ (కౌసుంబి) దంపతుల గారాల బిడ్డ , పుణ్యాల పంట వాసవాంబ. కుసుమ శ్రేష్ఠి వేంగి దేశంలోని *‘వసాల్‌’* ప్రాంతాన్ని పాలించేవాడు. కుసుమ శ్రేష్ఠిని ఆ రోజులలో అంతా పెద్ద శ్రేష్ఠి (ఈ శ్రేష్ఠి పదం కాల క్రమేణా శెట్టి గా రూపాంతరం చెందింది) అని పిలిచే వారు. ప్రజలంతా ఎంతగానో గౌరవించేవారు. *‘వసాల్‌’* దేశంలో పుట్టింది కనుక ఆమె *‘వాసవి’* అయింది. కన్యారాశిలో పుట్టింది కనుక *‘కన్యక’* అయింది. వాసవి అమ్మను పూజించే వారిని శ్రేష్ఠులు అంటారు. ఈ పదమే వ్యవహారంలో శెట్టి అయింది. ఈ శ్రేష్ఠులు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండి గోవును పూజించేవారు. గోదావరిని స్థానికులు గోమతి అని పిలుస్తారు అదేవిధంగా గోమాతను కుడా *‘గోమతి అని స్థానికంగా వ్యవహరిస్తారు.’* . ఈ పేరే *‘గోమ్టి’గా* మారింది. గోవును పూజించే గోమతి తీర వాసులు కనుక వీరిని *‘గోమట్లు’* అని పిలిచేవారు. ఈ పేరే వ్యవహారంలో *‘కోమట్లు’గా* మారింది.

_*శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి చరితామృతం*_

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి గోమతీ లేదా ఆర్యవైశ్య కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జననం నకు ముందు గోమాతను పూజించుట వల్ల వీరికి గోమతి అను పేరు వచ్చింది. శ్రీ పాద శ్రీ వల్లభుడు గో ప్రియుడు. బహుశా ఈ కారణం వల్లే ఆర్యవైశ్య కులస్తులంటే వారికి అబిమానం మెండు. ప్రస్తుతం ఈ కులస్తులు అధికంగా ఆంధ్రప్రదేశ్‌లోను , ఇంకా తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాలలోను నివశిస్తున్నారు. అయితే మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921 మరియు 1931 మధ్య కాలంలో ఒక కమీషన్ వేసారు . దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి అందరూ గోమతీ కులస్తులు గల వైశ్య అసోసియేషన్(1905 లో స్థాపించబడినది) వారు తమ పేరును *‘గోమతీ’* నుండి *“ఆర్యవైశ్య”* గా మార్చుకున్నారు.
ఆర్య అంటే గొప్ప వంశస్థుడు , గౌరవింపతగినవాడు అని అర్ధం. క్రీ.శ. 10 , 11వ శతాబ్ధాల తరువాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యుల కులదేవత గా ఏర్పడ్డారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ (జ్యేష్టశైలం - బృహత్శిలానగరం) అనే పట్టణంలో ఉన్నది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని *“వైశ్యుల కాశీ”* గా భావిస్తారు.

*శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జననం*

వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు (విమలాదిత్య మహారాజు) అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10 , 11వ శతాబ్ధాలలో కుసుమశ్రేష్టి సుమారు 18 పరగణాలను జ్యేష్టశైలం - బృహత్శిలానగరం (పెనుగొండ) ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. కుసుమశ్రేష్టి , ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. నగరేశ్వరస్వామి (శివుడు) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేరని వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా , నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా , వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. అంతట ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి , దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి , శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం.

వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి , శుక్రవారం ఉత్తర నక్షత్రం , కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల , మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరుపాక్షుడు అని అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి , సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.

భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి , విలువిద్య , కత్తిసాము మొదలైన యుద్ధవిద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను , తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.

*సహోదర వివాహ క్షణాలు*

విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధిశ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. అంతలో విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమశ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. అదే రోజు ఆదిపరాశక్తి పూజకు మంగళ వాద్యాలతో వెళ్లుచున్న వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహమాడదలచాడు. కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి వాసవి దివ్య బాలికయని కావున వివాహం సమ్మతం కాదని తెలుపగా ఒక నెల రోజుల వ్యవది నిచ్చి వివాహానికి సమ్మతించనిచో సైన్యంతో యుద్ధం చేసి వాసవిని తీసుకొని పోతానన్నాడు. విష్ణువర్ధుని కోరిక కుశమశ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు , అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు , వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు , వారి కులాలలో అంతరం ఉంది. విష్ణువర్ధనుడు క్షత్రియుడు. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను , స్నేహితులతోను చర్చించగా , అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని , ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది.

*అనంతర పరిణామాలు*

కుశుమశ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవి ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ , దాన , భేద , దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమశ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు , పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది , కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా , మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధునుడితో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.

భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమశ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పని చేసాయి. తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి , తన కూతురిని విష్ణువర్ధునుడికి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల మధ్య ఐకమత్యం దెబ్బతింది. విష్ణువర్ధనుడు దెబ్బతిన్న పాములా పగపట్టి , తన శత్రువులను తుదముట్టించడానికి , తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుశుమశ్రేష్టికి అండగా నిలిచారు. నాటి సమావేశం లో మొదటిసారిగా వాసవాంబిక తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియజేసెను.

*వాసవి దేవి ప్రతిస్పందన*

వాసవి సభలోకి ప్రవేశించి , అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది - *“నేను వివా హానికి నిరాకరించినట్లయితే విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు. యుద్ధం వల్ల ఎంతోమంది సైన్యం నశిస్తారు. అపార జననష్టం , ధననష్టం జరుగుతుంది. ఎంతోమంది పుణ్యస్త్రీలు వైధవ్యంతో బాధ పడతారు. తన వల్ల ఇంత రక్తపాతం జరుగకూడదు. ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి ? మన స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి ? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం . దృడ సంకల్పం , పట్టుదల ఉన్న వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు”*. వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించి నడవడానికి నిర్ణయించుకున్నారు.

*అమర దీపం అసాధారణ త్యాగం ఆత్మార్పణ*

వాసవి సూచనలను అనుసరించి , ఒకానొక మాఘ శుద్ధ పాడ్యమి రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవీ కన్యకాంబ ని దేవుని అంశగా అనుమానించి , తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. దానికి ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు , స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు , విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు , వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమశ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారందరికీ దేశభక్తి , నిజాయితి , సమాజ సేవ , సహనం మొదలగు వాటి గురించి వివరించింది. ఆమె నోటి నుండి పై పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో , తిరిగి వాసవాంబిక రూపంలో ప్రత్యక్షం అయింది. వెంటనే వాసవాంబిక తనకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ కావించుకొనెను. అప్పుడు 102 గోత్రాలకు చెందిన వారు కుడా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్నిగుండంలో దూకారు

*విష్ణువర్ధునుడి మరణం*

విష్ణువర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు వేగులు అప్పటి వరకు జరిగిందంతా విష్ణువర్ధునుడికి చెప్పారు. ఆ వార్త విన్న విష్ణువర్ధనుడు రక్తం కక్కు కుని , తలపగిలి అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం , విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధునుడి చర్యలను ఖండించి , ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు.

*అహింసే ముగింపు*

ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణ పొలిమేరలకు చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు వచ్చి అతన్ని ఈ విధంగా ఓదార్చాడు - *“సోదరా , గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవాంబిక మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది.”* ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ , గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా 101 శివలింగాలని ప్రతిష్టించాడు. రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవీ కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు. వాసవీ కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు , మత విశ్వాసాన్ని నిలిపినందుకు , స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేసినందుకు గాను ఆమె ఎప్పటికి అజరామరం అయింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా , శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది.

*శ్రీపాద శ్రీ వల్లభుడు – వాసవాంబిక*

సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం ప్రకారం ఆర్య మహాదేవి యొక్క తేజో కిరణమే శ్రీ వాసవీ కన్యక. అనసూయ మాత *“అగ్నియోగం”* వల్ల జన్మించిన కవలపిల్లలే శ్రీపాద శ్రీ వల్లభులు మరియు శ్రీ వాసవీ కన్యక. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి శ్రీపాద శ్రీ వల్లభుల సహోదరి. ఆమె ముఖ వర్చస్సు సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభుల వారిని పోలిఉండును . శ్రావణ శుద్ధ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) రోజు శ్రీపాద శ్రీ వల్లభులు ఎక్కడున్నా బృహత్సిలానగరం దీనికే జ్యేష్టశైలం అనికుడా పేరు (పెనుగొండ) నకు వచ్చెదరు . ఆ రోజు వాసవీ కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల వారికి రక్షా బంధనం కట్టుపుణ్య దినము. ఆరోజు ఎవరైతే పిఠాపురం నందు శ్రీ పాదుల వారి సన్నిధానం లో ఉంటారో వారికి చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. శ్రీ వాసవీ కన్యకాంబ నామస్మరణ ఎక్కడ చేయబడుచుండునో అక్కడ గుప్త రూపం లో శ్రీపాద శ్రీ వల్లభులు నివసించును. శ్రీపాద భక్త భందువులందరూ( వైస్యులైన లేదా కాకున్నా ) తప్పనిసరిగా పిఠాపురం నకు 90 కి .మీ. దూరంలో ఉన్నపశ్చిమ గోదావరి జిల్లలో గల పెనుగొండ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ని దర్శించుకుంటే మంచిది.

*కొన్ని ముఖ్య విషయాలు*

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కేవలం ఆర్యవైశ్య కులస్తులకు మాత్రమే కులదేవత అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. వాసవాంబిక శ్రీపాద శ్రీ వల్లభుల సహోదరి. శ్రీపాద వల్లభ మరియు దత్త భక్తులందరూ కులగోత్రాలకతీతంగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరిని దర్శించి తీరవలసిందే.

వాసవాంబిక ఆత్మార్పణ జరిగిన తరువాత పెనుగొండను అనేక మంది క్షత్రియ రాజులు పరిపాలించారు. వారందరూ వారి రాజకోటను పెనుగొండ ఊరి అవతలే కట్టుకున్నారు. ఏ ఒక్కరాజు పెనుగొండ లోపల ఉండి పాలించడానికి సాహసించలేదు.

వైశ్యులు గోవుకు  8216 , మఠాలకు 8217 , ను స్థాపించి పూజించడం వల్ల వీరిని గోమఠాల వారని అది క్రమేణా కోమట్లు గా మారిందని చరిత్ర చెబుతోంది.

స్వారోచిషమనువు కాలంలో (10వ -11వ శతాబ్దంలో) 18 సామంత రాజ్యాలకు ప్రధాన పట్టణం పెనుగొండ (జ్యేష్టశైలం/బృహత్శిలానగరం)- ఆ 18 నగరాలు: బృహత్ శిలానగరం , నిరవద్యపురం , వీరనారాయణపురం , విశాలపురం , చిన్నజగన్నాధము , పెద్దజగన్నాధము , చిన్నత్రిగుణపురం , పెద్దత్రిగుణపురం , పిఠాపురం , కళింగపురం , ధర్మ పురం , ధనదపురం , నరస పురం , పాంచాల పురం , భీమపురం , ఆసంటము , ఘంటశాలము , పాలకొలను.

శ్రీపాద శ్రీ వల్లభులు తమ 16వ యేట శరీరమును గుప్తపరుచుచున్నట్లు తన సహోదరి అయిన వాసవికి తెలియజేయగా ఆమె మరికొంత కాలం ఈ రూపమునే ఉండి భక్తులను ఉద్దరించమని వేడుకుంటుంది.

*వాసవీ కన్యకాష్టకం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః |
శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమో నమః || ౧ ||

జయాయై చంద్రరూపాయై చండికాయై నమో నమః |
శాంతిమావహనోదేవి వాసవ్యై తే నమో నమః || ౨ ||

నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమో నమః |
పాహినః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః || ౩ ||

అపర్ణాయై నమస్తేస్తు కౌసుంభ్యై తే నమో నమః |
నమః కమలహస్తాయై వాసవ్యై తే నమో నమః || ౪ ||

చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః |
సుముఖాయై నమస్తేస్తు వాసవ్యై తే నమో నమః || ౫ ||

కమలాయై నమస్తేస్తు విష్ణునేత్ర కులాలయే |
మృడాన్యైతే నమస్తేస్తు వాసవ్యై తే నమో నమః || ౬ ||

నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరీ |
శ్రియం నోదేహి మాతస్త్వం వాసవ్యై తే నమో నమః || ౭ ||

త్వత్పాదపద్మవిన్యాసం చంద్రమండల శీతలం |
గృహేషు సర్వదాఽస్మాకం దేహి శ్రీ పరమేశ్వరి || ౮ ||

*శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరీ అష్టోత్తరశతనామావళిః*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 

ఓం శ్రీవాసవాంబాయై నమః |
ఓం శ్రీకన్యకాయై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం ఆదిశక్త్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం కరుణాయై నమః |
ఓం ప్రకృతిస్వరూపిణ్యై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం శుభాయై నమః | ౯

ఓం ధర్మస్వరూపిణ్యై నమః |
ఓం వైశ్యకులోద్భవాయై నమః |
ఓం సర్వస్యై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం త్యాగస్వరూపిణ్యై నమః |
ఓం భద్రాయై నమః |
ఓం వేదవేద్యాయై నమః |
ఓం సర్వపూజితాయై నమః | ౧౮

ఓం కుసుమపుత్రికాయై నమః |
ఓం కుసుమదంతీవత్సలాయై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం గంభీరాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం సౌందర్యనిలయాయై నమః |
ఓం సర్వహితాయై నమః |
ఓం శుభప్రదాయై నమః |
ఓం నిత్యముక్తాయై నమః | ౨౭

ఓం సర్వసౌఖ్యప్రదాయై నమః |
ఓం సకలధర్మోపదేశకారిణ్యై నమః |
ఓం పాపహరిణ్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం ఉదారాయై నమః |
ఓం అగ్నిప్రవిష్టాయై నమః |
ఓం ఆదర్శవీరమాత్రే నమః |
ఓం అహింసాస్వరూపిణ్యై నమః |
ఓం ఆర్యవైశ్యపూజితాయై నమః | ౩౬

ఓం భక్తరక్షణతత్పరాయై నమః |
ఓం దుష్టనిగ్రహాయై నమః |
ఓం నిష్కళాయై నమః |
ఓం సర్వసంపత్ప్రదాయై నమః |
ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః |
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
ఓం లీలామానుషవిగ్రహాయై నమః |
ఓం విష్ణువర్ధనసంహారికాయై నమః |
ఓం సుగుణరత్నాయై నమః | ౪౫

ఓం సాహసౌందర్యసంపన్నాయై నమః |
ఓం సచ్చిదానందస్వరూపాయై నమః |
ఓం విశ్వరూపప్రదర్శిన్యై నమః |
ఓం నిగమవేద్యాయై నమః |
ఓం నిష్కామాయై నమః |
ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం ధర్మసంస్థాపనాయై నమః |
ఓం నిత్యసేవితాయై నమః |
ఓం నిత్యమంగళాయై నమః | ౫౪

ఓం నిత్యవైభవాయై నమః |
ఓం సర్వోపాధివినిర్ముక్తాయై నమః |
ఓం రాజరాజేశ్వర్యై నమః |
ఓం ఉమాయై నమః |
ఓం శివపూజాతత్పరాయై నమః |
ఓం పరాశక్త్యై నమః |
ఓం భక్తకల్పకాయై నమః |
ఓం జ్ఞాననిలయాయై నమః |
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః | ౬౩

ఓం శివాయై నమః |
ఓం భక్తిగమ్యాయై నమః |
ఓం భక్తివశ్యాయై నమః |
ఓం నాదబిందుకళాతీతాయై నమః |
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
ఓం సర్వసరూపాయై నమః |
ఓం సర్వశక్తిమయ్యై నమః |
ఓం మహాబుద్ధ్యై నమః |
ఓం మహాసిద్ధ్యై నమః | ౭౨

ఓం సద్గతిదాయిన్యై నమః |
ఓం అమృతాయై నమః |
ఓం అనుగ్రహప్రదాయై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం వసుప్రదాయై నమః |
ఓం కళావత్యై నమః |
ఓం కీర్తివర్ధిన్యై నమః |
ఓం కీర్తితగుణాయై నమః |
ఓం చిదానందాయై నమః | ౮౧

ఓం చిదాధారాయై నమః |
ఓం చిదాకారాయై నమః |
ఓం చిదాలయాయై నమః |
ఓం చైతన్యరూపిణ్యై నమః |
ఓం చైతన్యవర్ధిన్యై నమః |
ఓం యజ్ఞరూపాయై నమః |
ఓం యజ్ఞఫలదాయై నమః |
ఓం తాపత్రయవినాశిన్యై నమః |
ఓం గుణాతీతాయై నమః | ౯౦

ఓం విష్ణువర్ధనమర్దిన్యై నమః |
ఓం తీర్థరూపాయై నమః |
ఓం దీనవత్సలాయై నమః |
ఓం దయాపూర్ణాయై నమః |
ఓం తపోనిష్ఠాయై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః |
ఓం శ్రీయుతాయై నమః |
ఓం ప్రమోదదాయిన్యై నమః |
ఓం భవబంధవినాశిన్యై నమః | ౯౯

ఓం భగవత్యై నమః |
ఓం ఇహపరసౌఖ్యదాయై నమః |
ఓం ఆశ్రితవత్సలాయై నమః |
ఓం మహావ్రతాయై నమః |
ఓం మనోరమాయై నమః |
ఓం సకలాభీష్టప్రదాయై నమః |
ఓం నిత్యమంగళరూపిణ్యై నమః |
ఓం నిత్యోత్సవాయై నమః |
ఓం శ్రీకన్యకాపరమేశ్వర్యై నమః | ౧౦౮

*ఇతి శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ అష్టోత్తరశతనామావళిః |*

*🌸శ్రీ వాసవీ దేవి పాట🌸*

కుసుమ శ్రేష్టి కూతురా వాసవాంబా
వైశ్యకులా దేవతా కన్యకాంబా ||కు||
కుసుమాంబా పుత్రికా వాసవాంబా
విరుపాక్షా సోదరీ కన్యకాంబా ||కు||
అందరికీ మోక్షమిచ్చు వాసవాంబా
పెనుగొండా వాసవీ కన్యకాంబా ||కు||
అమ్మా... కన్యకా వాసవాంబా
కరుణించీ కాపాడు కన్యకాంబా ||కు||

*🌹వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలు🌹*

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం - పూలబజారు , కర్నూలు జిల్లా.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - పెనుగొండ.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - పెద్దకార్పముల , పెద్దకొత్తపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా , తెలంగాణ - 509412

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం , కల్వకుర్తి , నాగర్ కర్నూల్ జిల్లా.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం , నందిగామ , కృష్ణా జిల్లా.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, గాంధి బజార్ , షిమోగ - 577 202 , కర్ణాటక.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం , కోత్వాల్ , చెన్నై600001

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం , అమ్మవారి శాల , ప్రొద్దుటూరు 516360

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం , కార్ వీధి , తాడిపత్రి - 515411

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం , బైరెడ్డిపల్లి , చిత్తూరు జిల్లా

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం , విశ్వేశ్వర పురం , బెంగళూరు - 560004

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం , శ్రీ నగర్ , బెంగళూరు - 560050.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, బిగ్ బజారి , కోలార్ - 563101 , కర్ణాటక

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎస్ కే పి టి వీధి , బళ్ళారి - 583101

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - పెనుగొండ , అనంతపురం జిల్లా

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - హిందూపురం , అనంతపురం జిల్లా

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - కొత్తవూరు , అనంతపురం , అనంతపురం జిల్లా

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - పాతవూరు. అనంతపురం
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - గోరంట్ల , అనంతపురం జిల్లా

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - వాసవి శివ నగర్ , కుషైగుడ , హైదరాబాదు, రంగా రెడ్డి జిల్లా - 500062

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - శ్రీనివాస్ నగర్ కాలనీ , రామచంద్రాపురం , హైదరాబాదు , మెదక్ జిల్లా - 500032

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం , అమ్మవారి శాల , జమ్మలమడుగు 516434.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం , మాఛర్ల , గుంటూరు , 522426,

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం , రెంటఛింతల , గుంటూరు ,
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం , దాచేపల్లి , గుంటూరు , 522414

🙏🙏🕉️🙏🙏🌷🙏🙏🕉️🙏🙏

Wednesday, April 26, 2023

ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు?

*ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు?* 

 'ప్రమథ' అంటే బాగా మథించగలిగె వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు. 
వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తాడు.
రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో " సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం .."
అంటే వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు. 
మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.
 అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:
*వీరభద్రుడు:*
దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు. 
సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.
 *ఆది వృషభం:*
ధర్మదేవత. శివున్ని మోయ గలిగె వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మ దేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు.
*నందీశ్వరుడు:*
శిలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా, ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గానీ శివదర్శనం లభించదు.
*భృంగి:*
 శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని పిలవబడ్డాడు.
కేవలం శివున్ని ఆరాధిస్తూ పార్వతీ దేవిని విస్మరించి శాపగస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త, మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు. 
*స్కందుడు:*
కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.
 పై ఐదుగురు వీరమహేశ్వర గురువులు. వారి గోత్ర పురుషులు. నేటికీ వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు.
 రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ: 
శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగమునుంది వచ్చి పంచ మఠములను స్థాపించి, శివాద్వైతాన్ని బోధించారు. మరల లింగైక్యు లయ్యారు.
*కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు:*
బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కపాల హస్తుడు. కాశీ పురాధీశుడు
*రిటి:*
ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.
 *బాణుడు:*
శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీ కృష్ణునితోయుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.
*చండీశుడు:*
ఒక గోప బాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని, గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేసాడు.  కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్చిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు.
ఇలా ఎందరో ప్రమథ నాయకులు.
 దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పప్పిలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు. అంతే గాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే. బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు.  అనన్యశివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము. ఈనాటికీ వీరు వీరమాహేశ్వరులని, జంగమదేవతలని పిలువబడతారు. ఇక జంగమలు గురుపరంపరలో ఉంటే, శిష్య పరంపర చెందిన శివశరణలు కూడా గణములలో స్థానం పొందారు.
ఎంతో మంది స్త్రీలు శరణలయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు. 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణలెళ్లరు శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతుంది. గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ సారూప్యం తో ఉంటారు, కొందరు ఇచ్చాధార రూపాలతో ఉంటారు. రకరకాల ముఖాలతో, రక రకాల శరీరాలతో, అవయవాలలో వింతగా ఉంటారు ప్రమథ గణాలు. 
వీరి శక్తుల, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే!!
వీరి పేర్లు తలచుకోవడమే మహా ప్రసాదము.
సర్వం శివమయం.. హరహర మహాదేవ శంభోశంకరా... 🙏

Wednesday, April 12, 2023

అరుణాచలంలో ఉన్న గణపతి ఆలయాలు

అరుణాచలంలో ఉన్న గణపతి ఆలయాలు


  అరుణాచల ఆలయంలోఅనేక గణపతి ఆలయాలు ఉన్నాయి.

వాటిలో ముఖ్యమైనవి అష్ట గణపతులు...

  . 1 రాజగోపురంలో ఉన్న శక్తి గణపతి ఈయన గోపురంలో ఎడమ ప్రక్కన ఉంటాడు.

2 రెండవ గణపతులలో సంబోభావ వినాయకుడు ఈయన కుమార స్వామి ఆలయం వెనకాల సర్వసిద్ధి గణపతి ఈయననే శివగంగై వినాయకుడు అంటారు.

3 మూడవ ఆలయం మంగై పేలయ్యారు ఈయన రెండవ గోపురం బల్లాల గోపురం అక్కడికి వెళ్ళితే ఎడమ ప్రక్కన కళ్యాణ సుందరయ్య మండపం ఇందులో లోపలికి వెళ్ళితే ఒక సందులో ఉంటుంది ఆలయం.

4 నాలుగవ ఆలయం యనైతిరి  కొండ వినయగర్ ఇది మూడవ గోపురం కిలి గోపురం దగ్గర ఎడమవైపున ఉంటుంది.

5 అయిదవ ఆలయం వాలమురి గణపతి ఈయన ఆలయంలో మూడవ గోపురం ప్రదక్షణం చేసినప్పుడు వెనుక కు వెనుకు వెళ్ళితే మూడు ఆలయాలు ఉంటాయి అక్కడ ఉంది ఈ ఆలయం..

. 6 ఆరవ ఆలయం సంబంధ వినాయకుడు ఈయన కిలి గోపురం దాటి స్వామివారి ఆలయానికి వెళ్లేటప్పుడు ఎడమవైపున ఉంటుంది ఈ ఆలయం స్వామి వారు ఎరుపు రంగులో ఉంటారు.

7 ఏడవ ఆలయం విజయ రాఘవ గణపతి ఈయన అమ్మవారి ఆలయంలోకి వెళుతుండగా సరిగ్గా నవగ్రహ మండపం దాటి దీనికి ఎడమ ప్రక్కన పెద్ద ఆలయం ఉంటుంది స్వామివారు సింధూర వర్ణంలో ఉంటారు.

 8 ఎనిమిదవ ఆలయం ఈయన సూక్ష్మ గణపతి ఆలయానికి ముందు నవగ్రహ చిత్రగుప్త ఉన్న మండపంలో మూడవ స్థంభం లో క్రింద పక్కన ఉంటాడు. ఇలా గణపతులను దర్శించడానికి క్రింద ఒక మ్యాప్ ను ఇవ్వడం జరిగింది దీని ఆధారంగా అష్ట గణపతులను దర్శించి తరించండి.

అరుణాచలశివ 🌹

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS