'ప్రమథ' అంటే బాగా మథించగలిగె వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు.
వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తాడు.
రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో " సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం .."
అంటే వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు.
మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.
అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:
*వీరభద్రుడు:*
దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు.
సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.
*ఆది వృషభం:*
ధర్మదేవత. శివున్ని మోయ గలిగె వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మ దేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు.
*నందీశ్వరుడు:*
శిలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా, ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గానీ శివదర్శనం లభించదు.
*భృంగి:*
శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని పిలవబడ్డాడు.
కేవలం శివున్ని ఆరాధిస్తూ పార్వతీ దేవిని విస్మరించి శాపగస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త, మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు.
*స్కందుడు:*
కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.
పై ఐదుగురు వీరమహేశ్వర గురువులు. వారి గోత్ర పురుషులు. నేటికీ వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు.
రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ:
శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగమునుంది వచ్చి పంచ మఠములను స్థాపించి, శివాద్వైతాన్ని బోధించారు. మరల లింగైక్యు లయ్యారు.
*కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు:*
బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కపాల హస్తుడు. కాశీ పురాధీశుడు
*రిటి:*
ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.
*బాణుడు:*
శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీ కృష్ణునితోయుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.
*చండీశుడు:*
ఒక గోప బాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని, గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేసాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్చిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు.
ఇలా ఎందరో ప్రమథ నాయకులు.
దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పప్పిలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు. అంతే గాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే. బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు. అనన్యశివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము. ఈనాటికీ వీరు వీరమాహేశ్వరులని, జంగమదేవతలని పిలువబడతారు. ఇక జంగమలు గురుపరంపరలో ఉంటే, శిష్య పరంపర చెందిన శివశరణలు కూడా గణములలో స్థానం పొందారు.
ఎంతో మంది స్త్రీలు శరణలయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు. 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణలెళ్లరు శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతుంది. గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ సారూప్యం తో ఉంటారు, కొందరు ఇచ్చాధార రూపాలతో ఉంటారు. రకరకాల ముఖాలతో, రక రకాల శరీరాలతో, అవయవాలలో వింతగా ఉంటారు ప్రమథ గణాలు.
వీరి శక్తుల, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే!!
వీరి పేర్లు తలచుకోవడమే మహా ప్రసాదము.
సర్వం శివమయం.. హరహర మహాదేవ శంభోశంకరా... 🙏
No comments:
Post a Comment