Monday, May 2, 2022

అక్షయ తృతీయ , బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?

అక్షయ తృతీయ , బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?



మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి , ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా ! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?
 
అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని , ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.
 
అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి , ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం , హోమం , వ్రతం , పుణ్యం , దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం  నిలుస్తుందనీ , జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.
 
అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి , ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో , అప్పుచేసో , తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు , అప్పులు , పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS