Saturday, June 1, 2024

ఆంజనేయ స్వామి లేని #ఒంటిమిట్ట రామాలయం

*ఆంజనేయ స్వామి లేని #ఒంటిమిట్ట రామాలయం*
                  

రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ ఉండరంటారు. దేశంలో ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తాయి.కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం. ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలున్న ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం.

 *ఆంధ్రా అయోధ్యగా పిలిచే ఈ ఆలయం కడప జిల్లాలో ఉంది.*

ఆంధ్రా అయోధ్యగా అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయం బయట హనుమంతుడి గుడి విడిగా ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా జరిగే సీతారామ కల్యాణాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు.

 #స్థలపురాణం 

   ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి.

     ఒకప్పుడు ఒంటిమిట్ట కీకారణ్యంలా ఉండేదట. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట.

      అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ... అయితే   ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ అంటారు.

   ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవాళ్లైన వీళ్లు ఈ అటవీప్రాంతాన్ని సంరక్షించేవారు.

   ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని చెప్పగా, ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట.రాజు ఈ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు. దాంతో వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు.ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS