Thursday, March 6, 2025

మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి



మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవారంభం‌ ...

ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం
భవాబ్ధి తరణోపాయం శంఖచక్రధరంపదమ్

శ్రీ నరసింహుడు సద్యోజాతుడు.  అంటే భక్త రక్షణార్ధం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి.  ఆపదలలో వున్న భక్తులను , వేడుకున్న వెంటనే కాపాడగల దయగల దేవుడు నరసింహస్వామి.  అందుకనే శ్రీ శంకరాచార్యులంతటివారు తనని ఆపదలనుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు.  అంతటి దయామయుడైన ఆ స్వామి  కృష్ణానదీ తీరాన వెలసిన ఐదు క్షేత్రాలను పంచ నారసింహ క్షేత్రాలంటారు. అంతేకాదు  ఈ ఐదు క్షేత్రాలలో స్వామిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. 

అవి
1. మంగళగిరి పానకాలయ్య
2. వేదాద్రి స్నానాలయ్య
3. మట్టపల్లి అన్నాలయ్య
4. వాడపల్లి  దీపాలయ్య
5. కేతవరము  వజ్రాలయ్య

వీటిలో మనమిప్పుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం గురించి తెలుసుకుందాము.  మిగతా నాలుగు క్షేత్రాలకన్నా , ప్రస్తుతం కృష్ణానదికి కొంచెం దూరంగా వున్న క్షేత్రమిది. మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేవి పానకాల స్వామి , గాలి గోపురం , చేనేత వస్త్రాలు (మంగళగిరి చేనేత వస్త్రాలు -  డ్రెస్ మెటీరియల్ , చీరెలు బహుళ ప్రచారం పొందాయి).  ఇవ్వన్నీ ఇక్కడ ప్రసిధ్ధి కెక్కినవే.  ముందుగా ఆలయ చరిత్ర తెలుసుకుందాము.

స్ధల పురాణం ...

మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి.  కొండ దిగువన వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం , కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం , కొండ శిఖరం మీద వున్న గండాల నరసింహస్వామి ఆలయం.  కొండ దిగువన వున్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు.  

హిరణ్యకశిపుని వధానంతరం శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో, రౌద్రంగా , అందరికీ భీతికొల్పుతూ వున్నారు.  దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితం కనబడలేదు.  శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము  సమర్పించినది.  దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారు.  ఈయనే మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి.  ఈయనకి భక్తులు కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని , ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు.  కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. 

పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది.  భక్తులు స్వామికి సమర్పించే  పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు.  పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది.  ఇంక పానకం పోయటం ఆపి , మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.  ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు.  ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా , ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.

పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం వున్నది.  దీనికి పక్కగా ఒక సొరంగం వుంటుంది.  దాన్లోంచి వెళ్తే కృష్ణా తీరాన వున్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చంటారు.  ఋషులు ఇదివరకు ఆ మార్గంగుండానే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసివచ్చి స్వామిని సేవించేవారంటారు.  ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది.

సర్వ మంగళ స్వరూపిణి , సర్వ శుభదాయిని అయిన  శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది.  అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ , మార్కొండ అనే పేర్లుండేవి.

పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో వున్న ఇంకొక కధ.  స్వామి పానకం తాగటం ఎంతమటుకు నిజమో పరీక్షించటానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయడు తన బావమరిది , శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీడుతో కలసి కొండపై స్వామివారి తెరిచివున్న నోట్లోకి తన కుడిచేతిని పోనిచ్చారుట.  చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందిట.  అంకినీడుగారికి తేళ్ళు, పాములు కరచినంత బాధ కలిగిందట.  వెంకటాద్రి నాయుడుగారు చెయ్యి బయటకి తియ్యగా చెయ్యి రక్త మాంసములు లేక శల్యావశిష్టంగా వుండటం చూసి విస్మయం చెందారుట.  అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి , స్వామికి తన శరీరం ఆహారమయిందని, తన జన్మ సార్ధకమయిందని ఆయన ఆలయ గోపురం నిర్మింపచేశారుట. 

కొండ శిఖరానవున్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం వుండదు.  తీరని ఆపదలు వచ్చిన భక్తులు, తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితోగానీ, నూనెతోగానీ దీపం పెడతామని మొక్కుకుని, గండం గడిచిపోగానే  మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. 

కొండకిందవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో వున్న భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఆలయంలో మూర్తులను,  ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్టించారుట.  

#గాలి గోపురం...

ఆలయానికి నాలుగువైపులా గాలి గోపురాలున్నా తూర్పున వున్న గాలి గోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిధ్దికెక్కింది.  మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణంచేబట్టి 3 అంతస్తులు కట్టించారు.  తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు క్రీ.శ. 1807 – 1809 లో ఈ గోపురం పై ఇంకొక 8 అంతస్తులు నిర్మింపచేశారు.

153 అడుగుల ఎత్తు వున్న ఈ గోపురం వెడల్పు 49 అడుగులు మాత్రమే.  వెడల్పు తక్కువగా వుండి ఇంత ఎత్తుగావున్న ఇలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి.  అందుకే ఇది ప్రసిధ్దికెక్కింది.

దీనిని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషం కూడా ప్రచారంలో వున్నది.  గోపురము 14 అంతస్తులూ నిర్మించిన తర్వాత  ఆ గోపురం ఉత్తరానికి  ఒరిగిందట.  గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక , శిల్ప శాస్త్రంలో విజ్ఞుల సలహామేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్ళి, అక్కడ సుప్రసిధ్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారు.  వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు. దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది.  ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు.

#ఉత్సవాలు ...

ఫాల్గుణ మాసంలో 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి.  ఫాల్గుణ శుధ్ద షష్టినాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో చతుర్దశినాడు శాంత నరసింహస్వామికి , శ్రీదేవి , భూదేవులకు కళ్యాణం  జరుగుతుంది. మరునాడు , అంటే పౌర్ణమి రోజు జరిగే రధోత్సవంలో లక్షమంది పైగా ప్రజలు పాల్గొంటారు.  స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రధం లాగటానికి భక్తులు పోటీ పడతారు.  కనీసం ఆ రధం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు.  ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరనాళ్ళుకూడా ప్రసిధ్దికెక్కింది. శ్రీరామ నవమి , హనుమజ్జయంతి , నృసింహ జయంతి , వైకుంఠ ఏకాదశి , మహా శివరాత్రి వగైరా ఇక్కడ జరిగే ఇతర ముఖ్య ఉత్సవాలు.

కొండపైన పానకాలస్వామి ఆలయానికి మెట్ల మార్గమేకాక  వాహనంలో కూడా చేరుకోవచ్చు.

#దర్శన  సమయాలు ...

కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7గం. లనుంచి సాయంత్రం 3 గం.లదాకా మాత్రమే తెరచి వుంటుంది.  సాయంత్రం సమయంలో దేవతలు , ఋషులు స్వామిని సేవించటానికి వస్తారని ఇక్కడివారి నమ్మకం.  అందుకే 3 గం.లకి ఆలయం మూసేస్తారు.

కొండ దిగువనవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమయాలు
ఉదయం 5 గం. లనుంచి 12-30 దాకా తిరిగి సాయంత్రం 4 గం.ల నుంచి 8-30 దాకా.

మార్గము
విజయవాడ గుంటూరు రహదారిలో విజయవాడకు దాదాపు 16 కి.మీ. ల దూరంలో వున్న మంగళగిరి చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి.
భోజన , వసతి సౌకర్యాలు
మంగళగిరి , విజయవాడ , గుంటూర్లలో లభిస్తాయి. 

    || ఓం నమో నారసింహాయ నమః ||

Wednesday, March 5, 2025

శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!



శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!


పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలు కొన్నింటిని శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి.

18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. సతీ దేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ శక్తి పీఠాలు భారత దేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ దేశాలలో కూడా ఉన్నాయి. వాటితో ఒకటి కాశ్మీర్ లో ఉండగా, మరొకటి శ్రీలంకలో ఉంది. మిగతా 16 శక్తిపీఠాలు మన భారత దేశంలో ఉన్నాయి.

అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి

దక్షుడు బృహస్పతియాగం చేయాలనుకుని అందర్నీ ఆహ్వానిస్తాడు. కానీ తనకు నచ్చని శివుడిని పెళ్లిచేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని , అల్లుడు శివుడిని పిలవడు. అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్లు ప్రత్యేకంగా పిలవాలా ఏంటనే ఆలోచనతో ప్రమథగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్లిన సతీదేవి అవమానానికి గురవుతుంది. తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది. ఆగ్రహంతో ఊగిపోయిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగంతో ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకుని తన జగద్రక్షణాకార్యాన్ని పక్కనపెట్టేశాడు. దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి..శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా చెబుతారు. అప్పుడు కూడా ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవికి తోడుగా భైరవుడు(శివుడు) తోడుగా దర్శనమిస్తాడు. 

అష్టాదశ శక్తిపీఠాలు ఇవే అని ప్రామాణికంగా చెప్పే శ్లోకం ఇది

లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగుళాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారణాస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!

ఆదిశంకరాచార్యులు ఈ 18 క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెబుతారు...

శాంకరి - శ్రీలంక

ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు కాని ఒక వివరణ ప్రకారం ఇది తూర్పుతీరంలో ట్రిన్కోమలీలో ఉండొచ్చుని చెబుతారు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందని ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందని చెబుతారు. 

కామాక్షి - కాంచీపురం

కామాక్షీ దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడు ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు. 

శృంఖల - ప్రద్యుమ్ననగరం

కోల్ కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడి వారు చోటిల్లామాతగా పూజిస్తారు. కోల్ కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా చెబుతారు.

చాముండి - క్రౌంచ పట్టణం 

ఈ ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై, కర్ణాటకలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి కురులు ఈపర్వతాలపై పడ్డాయని స్థల పురాణం

జోగులాంబ-అలంపూర్

మన రాష్ట్రంలో వెలసిన నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం.ఇది తెలంగాణ రాష్టం అలంపూర్ లో ఉంది. సతీదేవి పైవరుస దంతాలు, దవడ భాగం పడినట్లు చెబుతారు.

భ్రమరాంబిక - శ్రీశైలం

సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం.ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడే పరమేశ్వరుని ద్వాదశ జోతిర్లింగ క్షేత్రంకూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం

మహాలక్ష్మి - కొల్హాపూర్

ఆది పరాశక్తి ‘అంబాబాయి'గా కొల్హాపూర్, మహారాష్ట్ర వెలసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని స్థలపురాణం.

ఏకవీరిక - మాహుర్యం

మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో, మాహుర్ క్షేత్రంలో వెలిసింది ఏకవీరికాదేవి.సతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల నుంచి పూజలందుకుంటోంది.

మహాంకాళి - ఉజ్జయిని

మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవీ భాగవతంలో ఉంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళీ రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని విశ్వాసం

పురుహూతిక - పిఠాపురం

ఈ పుణ్యక్షేత్రం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠబాగం పడిన చోటు కాబట్టి, ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందంటారు.

గిరిజ - ఒడిశా

ఒడిశా, జాజ్పూర్ లో వెలసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని స్థలపురాణం

మాణిక్యాంబ -ద్రాక్షారామం

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ద్రాక్షారామంలో సతీ దేవి ఎడమ చెంప భాగం పడింది. దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామక్షేత్రాల్లో ఒకటి.

కామరూప- గౌహతి

సతీదేవి యోనిభాగం అసోం రాజధానికి గువాహటిలోని నీలచల పర్వతశిఖరంపై పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థలపురాణం.

మాధవేశ్వరి -ప్రయాగ

అమ్మవారి కుడిచేతి వేళ్ళు ప్రయాగ, ఉత్తరప్రదేశ్ లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రం ఉండదు. నాలుగు దిక్కులా సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది.

వైష్ణవి - జ్వాలాక్షేత్రం

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడుజ్వాలలు నిరంతరం వెలుగుతుంటాయి.ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు.

మంగళ గౌరి - గయ

బీహార్ లోని గయా ప్రాంతంలో సతీదేవి స్తనాలు పడినట్టు చెబుతారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవి. ఈ స్థలపురాణానికి తగినట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళగౌరిగా పూజిస్తారు.

విశాలాక్షి - వారణాసి

సతీదేవి మణికర్ణిక (చెవి భాగం)వారణాసిలో పడిందని స్థలపురాణం.

సరస్వతి - జమ్ముకాశ్మీర్

అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.

🌹🌹🌹🙏🙏🙏

Tuesday, March 4, 2025

నవ గ్రహా పారాయణాలు, పుణ్యతిథులు ..........!!

నవ గ్రహా పారాయణాలు, పుణ్యతిథులు ..........!!


నవగ్రహాల శాంతికి ఆ గ్రహానికి సంబంధిత పారాయణము, పుణ్యతిథుల్లో స్తుతిస్తే ఆ గ్రహ ప్రభావములచే ఏర్పడే ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నవగ్రహాల పారాయణాలు, పుణ్యతిథులు ఏమిటో తెలుసుకుందాం..!

తొమ్మిది నవగ్రహాల్లో వరుస క్రమంలో సూర్యునికి రామాయణము, భవిష్య కల్కి పురాణము, సూర్యపురాణం.

చంద్రునికి శ్రీమద్భాగవతము, భవిష్య కల్కి పురాణము, వాయుపురాణము

కుజునికి- అగ్నిపురాణము, స్కాంధపురాణము, బ్రహ్మవైవర్తన పురాణాల్లో కుమారస్వామి చరిత్ర

బుధునికి- లింగపురాణంలో నరసింహావతారము, విష్ణుపురాణము, నారదపురాణము

గురునికి- బ్రహ్మణపురాణము, వామనపురాణం, లింగపురాణం

శుక్రునికి- బ్రహ్మండపురాణం, భవిష్యపురాణమునందు శ్రీమద్భాగవతంలోని పరశురామావతారం

శనీశ్వరునికి-మార్కండేయపురాణం, కూర్మపురాణం, భవిష్యపురాణం,

రాహువు-దేవీభాగవతం, వరాహపురాణం, గరుడపురాణం,

కేతువుకు- బ్రహ్మవైవర్తన పురాణం, మత్స్యపురాణం వంటివి పఠించాలి.

పుణ్యతిథుల విషయానికొస్తే..?

సూర్యునికి- కార్తిక శుద్ద పూర్ణిమ-కార్తిక మాసంలో రవిజపము ఆరువేల సార్లు చేసి గోధుమలు దానం చేయాలి.

చంద్రునికి- శ్రావణ పూర్ణిమ - శ్రావణ మాసంలో చంద్రజపమును పదివేలసార్లు చేసి తెల్లని వస్తాలతో బియ్యాన్ని దానం చేయాలి.

కుజునికి- చైత్రశుద్ద పూర్ణిమ చైత్రమాసంలో అంగారక జపము ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.

మార్గశిర శుద్ద షష్టి- మార్గశిర మాసంలో అంగారక జపమును ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.

బుధునికి-జ్యేష్ఠ పూర్ణిమ-జ్యేష్ఠ మాసంలో బుధజపాన్ని 17 వేల సార్లు చేసి పెసలు ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయాలి.

గురువు-వైశాఖ తదియ- భాద్రపదమాసంలో బృహస్పతి జపాన్ని 16 వేలసార్లు చేసి శెనగలు దానం చేయాలి.

శుక్రునికి- ఆషాఢశుద్దదశమి- ఆషాఢమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి అలచందలు, తెల్లని వస్త్రాలు దానం చేయాలి.

ఫాల్గుణ శుద్ద పూర్ణిమ - ఫాల్గుణమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి తెల్లని వస్త్రాలు దానం చేయాలి.

శని భగవానునికి - శ్రావణ బహుళ అష్టమి- శ్రావణ మాసంలో శనిజపము చేసి నల్లనువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. రాహువుకు - ఆశ్వీజ బహుళ చతుర్దశి - ఆశ్వీజమాసంలో రాహుజపం 18 వేలసార్లు చేసి మినుములు కాఫీపొడి రంగుకు చెందిన వస్త్రాలను దానం చేయాలి. కేతువుకు- ఆశ్వీజశుద్ద పాడ్యమి- ఆశ్వీజమాసంలో కేతుజపాన్ని ఏడువేల సార్లు చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయాలి.

మాఘశుద్ద అష్టమి - మాఘమాసంలో ఏడువేల సార్లు కేతుజపాన్ని చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయడం ద్వారా నవగ్రహాల ప్రభావంచే కలిగే అశుభ ఫలితాలు దరిచేరవని పురోహితులు సూచిస్తున్నారు.

అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారు

అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారు 


చంద్రుని యొక్క అష్టమికళ ఏ తిధిన ఉంటుందో అది అష్టమి తిధి అనబడుతుంది.

అష్టమిరోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు. అగ్నిపురాణంలో
అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది.

చంద్రుడికి పదహారు కళలున్నాయి.

పాడ్యమి దగ్గరనుంచి పూర్ణిమ వరకు తిథులు పదిహేను పదహారవకళ సాక్షాత్తూ
సచ్చిదానందస్వరూపిణి అయి ఉన్నది.

చంద్రుని యొక్క పదహారుకళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధపాడ్యమి
అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి
చంద్రునిలో ప్రవేసిస్తుంది. ఆరకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును
పూర్ణిమ అంటారు. ఆ తరువాత ప్రతిరోజూ ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయి
సూర్యునిలో చేరిపోతుంది. ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదలి వెళ్ళిపోయిన
రోజును అమావస్యా అంటారు. ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు. ఇవే శుక్ల కృష్ణ
పక్షాలు. ఈ రెండింటిలోనూ కూడా అష్టమినాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు.
అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు.

తిథులు నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం పదహారు.
వీటిని గురించి వసిష్టసంహితలో వివరించబడింది.

ఈ నిత్యల గురించి వామకేశ్వరతంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది.

కామేశ్వరి, భగమాలినీ, నిత్యక్తిన్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,
శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ,
జ్వాలామాలినీ, విచిత్ర, మహానిత్య

ఇవి పదహారునిత్యలు. ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతుండటంచేతనే
చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నాయి. శుక్ల కృష్ణ పక్షాలయందున్న తిధులు నిత్యలు
ఈ దిగువ ఇవ్వబడ్డాయి.

శుక్లపక్షము తిథి,  నిత్యాదేవత    కృష్ణపక్షము తిథి
 
1. పాడ్యమి ,కామేశ్వరి.         1. పాడ్యమి, చిత్ర

2. విదియ, భగమాలిని.          2 జ్వాలామాలిని
3. తదియ ,నిత్యక్షిన్న             3 సర్వమంగళ
4. చవితి , భేరుండా.               4 విజయ

5. పంచమి, వహ్నివాసిని        5 నీలపతాక
6. షష్టి ,మహావజ్రే్ేశ్వరి           6. నిత్య

7. సప్తమి ,శివదూతి               7 కులసుందరి
8. అష్టమి, త్వరిత                  8 త్వరిత

9. నవమి, కులసుందరి.          9  శివదూతి
10. దశమి ,నిత్య                   10. మహావజ్రేేశ్వరి
11. ఏకాదశి ,నీలపతాక          11. ఏకాదశి వహ్నిివాసిని
12. ద్వాదశి ,విజయ              12. ద్వాదశి భేరుండా
13. త్రయోదశి | సర్వమంగళ 13. త్రయోదశి | నిత్యకిన్న
14. చతుర్దశి, జ్వాలామాలిని   14. చతుర్దశి భగమాలిని
15. పూర్ణిమ ,చిత్ర                   15. కామేశ్వరి

 
చంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటే అయినప్పటికీ శుక్ల
కృష్ణ పక్షాలలో నిత్యాదేవతలు వేరుగా ఉంటాయి. ఆ విషయం పైన పట్టిక చూస్తే
తెలుస్తుంది. కాని రెండు పక్షాల యందు అష్టమినాడు మాత్రం “త్వరిత” అనబడే
నిత్యాదేవతయే ఉంటుంది. దాన్నే త్వరితాకళ అని కూడా అంటారు. అనగా ఎటువంటి
మార్పులేనివాడు అష్టమినాటి చంద్రుడు. అందుచేతనే అష్టమినాటి చంద్రునితో దేవి
ముఖాన్ని పోల్చటం జరిగింది.
గుండ్రని ముఖానికి పైన కిరీటము పెట్టటంచేత, దేవి యొక్క లలాటము అర్థచంద్రాకారంగా అష్టమినాటి చంద్రునిలాగా కనిపిస్తుంది.

🌹🙏శ్రీ మాత్రే నమః🙏🌹

Monday, March 3, 2025

అష్ట మంగళ చిహ్నాలు..!!



 అష్ట మంగళ చిహ్నాలు..!!


శ్రీ వైష్ణవ సంప్రదాయం లో  యజ్ఞ యాగాదుల  సమయంలో అష్ట మంగళ చిహ్నాలకి, మహాకుంభాభిషేకానికి  ఎంతో ప్రాధాన్యత వుంది. 

 మహా కుంభానికి చుట్టూ యీ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తారు.
ఈ అష్ట మంగళ శక్తులు మహా కుంభానికి చేరి , పరమాత్మ లో లీనమౌతాయి.

ఇప్పుడు అష్ట మంగళ చిహ్నాలని  వేటిని అంటారో చూద్దాము..

*1. శ్రీ వత్సము.*. 

శ్రీ హరి వక్షస్ధలం మీద లక్ష్మీ దేవి నివసించే ప్రదేశము.  లక్ష్మీ దేవికి జన్మస్థలం పాలకడలి. 

 దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఐరావతమనే ఏనుగు, ఉఛ్ఛైశ్వర్యమనే అశ్వము , కామధేనువు అనే గోమాత తో పాటు ఉద్భవించింది శ్రీ మహా లక్ష్మీ దేవి. శ్రీ మన్నారాయణుని పతిగా పొందిన సౌభాగ్య వతి. 

 ఆయన వక్షస్ధలమునే  నివాసస్ధానము చేసుకొన్న ది. శ్రీ మన్నారాయణుని  ఎన్నటికీ విడివడని హృదయ నివాసిని యైనది. ఆ నివాస స్ధలమునే  శ్రీ వత్సము అని అంటారు.


*2.పూర్ణ కుంభము...*.

బంగారము, వెండి, రాగి  వస్తువులను బిందెలో వేసి ,నీటి తో నింపి బిందె బైట వైపు దారంతో  చుట్టి దాని మీద పసుపు కుంకుమ ,చందనములతో  అలంకరించి,

పట్టు వస్త్రము చుట్టి బిందె లోపల కుడివైపు మామిడి  కొమ్మలు పెట్టి  , దానిలో కొబ్బరికాయ పెట్టి అలంకరించినదే పూర్ణకుంభము. 

 లక్ష్మీ దేవి అంశగాను, మంగళప్రదమై శక్తి చిహ్నంగా భావింపబడుతోంది.  ఎవరైనా ప్రముఖులు, ఉన్నతాధికారులు, అన్ని రంగాల లో వున్నతమైన వారికి స్వాగతం చెప్పే సమయంలో  పూర్ణకుంభంతో ఆహ్వానిస్తారు. 

*3.భేరీ...* 

భేరీ , నాదం వలన  దుష్ట శక్తులు దరి చేరవు.  
భగవంతుని పూజా సమయంలో, హారతి సమయంలో పెద్ద ధ్వనితో , భేరీ మ్రోగిస్తారు.  

భేరీ ధ్వనులతో అమంగళం అప్రతిహతమౌతుంది.  


*4. దర్పణ మండము....*

దర్పణం అంటే పెద్ద అద్దం. శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఎదురు గా పెడతారు.  అద్దంలో శ్రీ హరి ప్రతి బింబం కనపడుతుంది.  

ఆలయ సన్నిధిలో పెట్టిన అద్దంలో , శ్రీ మహావిష్ణువు తన అందం చూసుకొని మురిసేందుకు పెడతారు. 
అన్నీ తానే అనే  తత్వం తెలపడానికి యీ దర్పణం...

*5. రెండు మీనాలు...*

ఒకదాని కొకటి సమంగా జోడిగా ఒకదానిని ఒకటి చూచుకొనే విధంగా అమర్చిన మీనాలు.  మీనాలు రెండూ జీవాత్మ పరమాత్మ . మీనాలు నీళ్ళల్లో మాత్రమే నివసిస్తాయి.  తీరానికి వస్తే జీవం కోల్పోతాయి. 

చేపలు నీటిని విడచి బయటకు రావు. అలాగే జీవాత్మ పరమాత్మ ల ఐక్యత తెలుపుతుంది.  
మనం భగవంతుని ప్రార్ధించేటప్పుడు, మనజీవాత్మ పరమాత్మ తో ఏకమై ప్రార్ధించాలి. 

*6 . శంఖం...*

శంఖం తెల్లగా,స్వఛ్ఛమైనది.  పవిత్ర మైన ఓంకార నాదాన్ని కలిగిస్తుంది.  
శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ శంఖు చక్రాలను ధరించి వుంటాడు.  శంఖాలు రెండు రకాలు. దక్షిణావర్త శంఖం యిది మంగళకరమైనది. 

 పాలకడలి లో శ్రీ మహాలక్ష్మి తో పాటు పుట్టినదే.  యీ వలంపురి శంఖం శ్రీ మహావిష్ణువు ఎడమ చేతిలో వుంటుంది.  వలంపురీ శంఖం నుండి 
ఓంకారనాదం సహజంగానే ధ్వనిస్తుంది.

*7. శ్రీ చక్రం....*

వలయాకారంలో సులభంగా చుట్టేది చక్రం.  కాలాన్ని కాల చక్రం అంటారు. సూర్య భగవానుడు కాలాన్ని నడిపిస్తాడని అంటారు.  

చక్రత్తాళ్వారు శ్రీ  చక్రం యొక్క అంశ.  శ్రీ మన్నారాయణుని ప్రధాన ఆయుధంగా చెప్పబడుతుంది. శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ చక్రమును చేతిలో ధరించి వుంటాడు.

*8. గరుత్మంతుడు.....*

కశ్యపముని వినతల పుత్రుడు.  ఆయనను "గరుడాళ్వార్"అని "పెరియ తిరువడి" అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం.  బ్రహ్మోత్సవాల  సమయంలో  గరుడోత్సవం ఘనంగా జరుపుతారు. 

 గరుత్మంతుడు మహాబలశాలి ,ధైర్యశాలి. 
దానవులతో యుధ్ధం చేసి,అమృత కలశమును భద్రముగా తీసుకుని వచ్చినవాడు. నిరంతరం వైకుంఠం లో శ్రీ మహావిష్ణువు సన్నిధి భాగ్యము పొందిన వాడు గరుత్మంతుడు. 

ఈ పక్షీంద్రుడు వేదస్వరూపుడు,కాంతిమంతుడు. నాగులను ఆభరణములుగా ధరించిన వాడు. వైకుంఠం లో భగవంతుని కి అద్దంగా నిలబడినట్లు చెప్తారు. శ్రీ మహావిష్ణువు ఆలయమునుండి ఊరేగింపు కి బయలుదేరుటకు ముందు అద్దాల సేవ జరుగుతుంది.

సర్వాంతర్యామి యైన భగవంతుడు భక్తుల పూజలను స్వీకరించి సర్వదా సంరక్షిస్తూ వుంటాడు....స్వస్తి..

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

RECENT POST

మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవారంభం‌ ... ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం భవాబ్ధి తరణోపాయం శంఖచక్రధరంపదమ్ శ్రీ...

POPULAR POSTS