Sunday, December 30, 2018

విజయనగరం సంస్ధానాధీశుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మ వారి ఆలయం

విజయనగరం

     విజయనగరం సంస్ధానాధీశుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మ వారి ఆలయం యం.జి.రోడ్, మూడు లాంతర్ల సెంటర్ కు సమీపంలో ఉంది.  గుడి నిత్యం భక్తులుతో సందడిగా ఉంటుంది.  మంగళవారం నాడు మరికొంత విశేషముగా ఉండును.  విజయదశమి వెళ్ళిన మొదటి మంగళవారం నాడు  " సిరిమాను " ఉత్సవం చాల ఘనంగా జరుగుతుంది.  సిరిమాను ఉత్సవాలు వీక్షించుటకు ఉత్తరాంధ్ర ప్రాంతము నుంచి సందర్శకులు తరలి వస్తారు.  అమ్మ  వారి ఆదేశం ప్రకారం ఒక వృక్షం ను సిరిమానుగా వడ్రంగి చేత తయారు చేయుంచుదురు.  ఆలయ పూజారి (అమ్మ వారు) సిరిమాను పై భాగంలో ఆశీనుడుగా ఊరేగుతాడు.  అమ్మ వారి గుడి నుంచి రాజకోట వరకు మూడు పర్యాయములు తిరుగుతుంది. 
     సిరిమాన ఉత్సవం ముగిసిన పిమ్మట (15 రోజులు తరువాత) ఊయల - కంభాల ఉత్సవాలు జరుగుతాయి.  అమ్మవారిని మేళతాళాలుతో ఊరేగిస్తు " వనం గుడి" తీసుకొని వెళ్ళి అనుపు ఉత్సవం జరుపుతారు.  అమ్మ వారి మూల విరాట్టు ను వనం గుడిలో దర్శించగలము.  రైల్వే స్టేషన్ ప్రాంతములో వనం గుడి ఉంటుంది. 
     హౌరా - చెన్నై రైలు మార్గంలో విజయనగరం జంక్షన్ కలదు.  జంక్షన్ నుంచి రాయపూర్ కు రైలు మార్గం ఉంది.  రాయపూర్ జాతీయ రహదారి (NH-26) కలదు. రైల్వే స్టేషన్ కు సమీపంలో RTC బస్ స్టాండ్ ఉంది.  జిల్లా కేంద్ర మైన విజయనగరం నందు యాత్రికులుకు మంచి వసతుల, రవాణా సౌకర్యములున్నాయి.
                                          కె. కె. మంగపతి
                                          Yatra - Telugu

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు భాగవతం, మహాభారతం

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు 
భాగవతం, మహాభారతం
1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.
2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.
13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.
14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.
17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.
18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.
20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.
21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.
23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.
24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.
30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.
34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.
36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.
39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.
40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.
43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.
44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.
ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.
:::::::::::::::::::::::::::::::::::::
రామాయణం
:::::::::::::::::::::::::::::::::::::
1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16 దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.
సేకరణ  : -  మన వేదం

పంచలింగాలు

పంచలింగాలు

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు.
ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
అందులో కీలకమైన పంచలింగాలు.
పృథ్విలింగం,
ఆకాశలింగం,
జలలింగం,
తేజోలింగం,
వాయులింగములను
పంచభూతలింగాలు అంటారు.
1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం.
కంచిలోఉంది.
ఏకాంబరేశ్వర స్వామి అంటారు.
పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి.
అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది.
ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది.
లింగ దర్శనముండదు.
అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు.
ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది.
ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు.
అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి.
బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది.
అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు.
ఈయన పేరే అరుణాచలేశ్వరుడు.
అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని
శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం.
ఈయన పేరు కాళహస్తీశ్వరుడు.
అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ.
సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.
ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.
ఓం నమః శివాయ..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
    ఓం శ్రీ సాయి రామ్                   శ్రీ మాత్రే నమః

ఏ రోజు ఏ వ్రతం చేయాలి? వాటి శుభఫలాలు

ఏ రోజు ఏ వ్రతం చేయాలి? వాటి శుభఫలాలు
వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. దాని ప్రకారం ఒక్కో దేవతకూ ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో, వ్రతం ఏదో ముందుతరాలవారు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం! రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు.
ఆదివారవ్రతం:

చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతానక్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారంనాడు ఉపవాసం ఉండి, సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగ ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారంనాడు ఆరంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలూ ఆచరించాలి. అలా ఆచరించలేనివారు కనీసం 12 వారాలైనా చేయాలి.
వ్రతవిధానం:
ఆదివారంనాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆపైన గంగాజలాన్ని, లేదా శుద్ధోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం ఉంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.
సోమవార వ్రతం:
అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.
వ్రతవిధానం:
చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ‘ఓం నమశ్శివాయ’అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పూవులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరాన్ని ధరించాలి. పూజాసమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతోపాటు పాలు, పెరుగు, తెలుపురంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయాలి.
మంగళవారం:
ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవారవ్రతం ఆచరించాలి.
వ్రతవిధానం:
ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, రుణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపు రంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరం లేదా మూలమంత్రం పఠించాలి.
బుధవారవ్రతం:
 
స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి.
వ్రతవిధానం:
ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజచేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పండ్లు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.
గురువారవ్రతం:
మానసికప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యాఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి.
వ్రతవిధానం:
ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్లపాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు, ఒక పూట తప్పనిసరిగా ఉపవాసం ఉండి, స్వామికి నివేదించిన పదార్థాలను స్వీకరించాలి.
శుక్రవార వ్రతం:
దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది.
వ్రతవిధానం:
ఈ పూజను శ్రావణమాసం లేదా ఏమాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారంనాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లనితల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.
శనివారవ్రతం:

వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం చేయాలి.
వ్రతవిధానం:
శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారంనాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచరణ చేయాలి. వేంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వులనూనె, గేదెనెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి....మీ..చింతా గోపి శర్మ సిద్ధాంతి
..9866193557

ఏకాదశ రుద్రులు

ఏకాదశ రుద్రులు

శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకా య త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడినది. దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్రయంబకుడు , 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11.శ్రీమన్మహాదేవుడు. ఏకాదశ రుద్రులు మరియు వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు క్రింద ఈయబడినవి.
1.అజపాదుడు- ధీదేవి
2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి
3. త్రయంబకుడు- ఆశనదేవి
4.వృషాకపి- ఉమాదేవి
5.శంభుడు- నియుత్ దేవి
6.కపాలి- సర్పిదేవి
7.దైవతుడు- ఇల దేవి
8.హరుడు- అంబికాదేవి
9.బహురూపుడు- ఇలావతీదేవి
10.ఉగ్రుడు- సుధాదేవి
11.విశ్వరూపుడు- దీక్షాదేవి
అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి పండుగలలో కనుమరోజు భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచు న్నారు. వాటి వివరణ
1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):
పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.
2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):
పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనముకలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను.
3. త్రయంబకేశ్వరుడు - ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):
రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను.
4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):
తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను.
5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):
మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.
6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):
రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.
పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు.
7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):
దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు.
ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.
8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను.
ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మిగ్రామ మునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను.
9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి):
దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారము నందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.
10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్ప వారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపు వ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితి నని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించివిష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్త ములచే ప్రతిష్ఠింపబడెను.
11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):
పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.
శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈకార్తీకమా స పుణ్యదినములలోఏకాదశ రుద్రులకు మాకుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు........ సర్వేజనాః సుఖినోభవంతు.......... సమస్త సన్మంగళాని సంతు........ స్వస్తి.

Monday, December 10, 2018

మీసాల గోపాలుడు! - తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో

ఆ మీసం ఆపద్ధర్మం!
 తెలంగాణలోని చెల్లాపూర్‌ గ్రామంలో మీస మాధవుడు కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. 200 ఏళ్ళ కిందటి మాట. దుబ్బాక సంస్థానాన్ని పాలించే దొరల వల్ల వేధింపులకు గురైన ఆ గ్రామస్తులు కప్పం కట్టకూడదని నిర్ణయించుకున్నారు. నిలువు నామాలు కలిగిన వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టి, ఆ పేరు చెప్పి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. కాశీ నుంచి విగ్రహం తెప్పిద్దామనుకున్నారు. అయితే ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో నిరాదరణకు గురైన ఆలయం నుంచి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠిద్దామన్న ఆలోచన చేశారు.
 
రాత్రి వేళల్లో ఎడ్ల బండ్ల మీద తిరుగుతూ విగ్రహాన్వేషణ చేశారు. రామ్‌గోపాల్‌పేట అనే గ్రామంలో అలాంటి విగ్రహం కనిపించింది. దాన్ని తెచ్చి, ప్రతిష్ఠించాలనుకుంటూండగా, రామ్‌గోపాల్‌పేట గ్రామస్తులు విగ్రహాన్ని వెతుకుతూ వస్తున్నారని తెలిసింది. దీంతో విగ్రహాన్ని చెరువులో దాచిపెట్టారు. తరువాత విగ్రహ ప్రతిష్ఠకు ఉపక్రమించారు. విగ్రహాన్ని రామ్‌గోపాల్‌పేట వారు గుర్తుపట్టకుండా... దాని తలపై ఉన్న కొప్పును తొలగించి కిరీటం పెట్టారు. విగ్రహానికి వెండి మీసాలను చేర్చారు. దీంతో మీసాల కృష్ణుడు ఆ ఆలయంలో కొలువుతీరి, అదే రూపంలో పూజలందుకుంటున్నాడు.
 
ఎక్కడుంది?: తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో
 
ఎలా వెళ్ళాలి?: హైదరాబాద్‌కు 128 కి.మీ., మెదక్‌కు 55 కి.మీ. దూరంలో చెల్లాపూర్‌ ఉంది. ఆ ప్రాంతాలనుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
 
ప్రత్యేకతలు: ఈ ఆలయంలో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఇది సుమారు 200 ఏళ్ళ నుంచి నిరంతరాయంగా వెలుగుతూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివల్ల గ్రామం పాడిపంటలు, సిరిసంపదలతో తులతూగుతుందని వారి నమ్మకం. వ్యవసాయ పనులు మొదలు పెట్టగానే స్వామికి ముడుపులు కడతారు. అలాగే, ఎలాంటి వివాదమైనా వేణుగోపాలుని ఆలయం మెట్లు ఎక్కితే ఇట్టే పరిష్కారం అవుతుందనీ, స్వామి సన్నిధిలో అబద్ధం ఆడినవారికి తప్పదని స్థానికులు విశ్వసిస్తారు.

మీసాల గోపాలుడు-ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలో


మీసాల గోపాలుడు
చేతవెన్న ముద్ద పట్టిన చిన్నారి కన్నయ్య... గోపికా మానసచోరుడు... కంస-చాణూర మర్దనుడు... గీతాచార్యుడు... ఇలా అనేక పాత్రల్లో శ్రీకృష్ణుని రూపం అందరికీ పరిచితమే... అయితే వీటిలో ఏ రూపంలోనూ మీసం మనకు కనిపించదు... నాసాగ్రాన మౌక్తికాన్ని తప్ప ముక్కుకింద మీసాన్ని ఊహించుకోలేం... కానీ నల్లనయ్య మీసంతో కనిపించే ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి.
 
*శంఖ చక్రపాణి!*
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పేరు వినగానే నోరూరించే పూతరేకులు గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతం వారికి కృష్ణుడు అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది మీసాల కృష్ణయ్య. అఖండ గోదావరి రెండు పాయలై... వశిష్ఠ, గౌతమి నదులయ్యాయి. ఆ నదులను ఆనుకున్న ప్రధాన కాలువలూ, కనుచూపు మేర పచ్చని పంట పొలాలతో ప్రకృతి సోయగాల మధ్య అలరారే పల్లెటూరు పులిదిండి. గౌతమీ గోదావరి నది చెంతనే ఉన్న ఆ గ్రామం మధ్యలో మీసాల వేణుగోపాల స్వామి స్వయంభువుగా వెలిసిన ఆలయం ఉంది.

*ఎక్కడుంది?:*
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలో

*ఎలా వెళ్ళాలి?:*
రాజమండ్రి నగరానికి సుమారు 27 కి.మీ. దూరంలో పులిదిండి ఉంది. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం రాజమండ్రిలో ఉంది.

*ప్రత్యేకతలు:*
సుమారు 300 ఏళ్ళ కిందట వెలసిన పులిదిండి వేణుగోపాల స్వామి నల్లరాతి విగ్రహం విలక్షణంగా ఉంటుంది. కుడిచేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ధరించి, మీసాలతో శోభాయమానంగా స్వామి దర్శనమిస్తారు. నిండు మనసుతో కొలిస్తే, కోరిన కోర్కెలను తీర్చే దైవంగా భక్తులు మీసాల వేణుగోపాలుణ్ణి ఆరాధిస్తారు. స్వామివారికి ఏటా కళ్యాణం, నిత్య ధూపదీప నైవేద్యాలూ జరుగుతున్నాయి. ఆయనకు మొక్కుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది.  ఆయనకు మొక్కుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది. 1967లో విడుదలైన ‘సాక్షి’ సినిమా చిత్రీకరణ ఈ ఆలయంలో జరిగింది.
 
ప్రముఖ నటులు కృష్ణ, విజయనిర్మల మీద వివాహ దృశ్యాన్ని తీశారు. ‘‘ఈ స్వామి దగ్గర పెళ్ళి సీన్‌ నటించారు కాబట్టి మీకు నిజంగా వివాహం జరుగుతుంది!’’ అని హాస్య నటుడు రాజబాబు వారితో అన్నారట. ఆ తరువాత కృష్ణ, విజయనిర్మల దంపతులయ్యారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో విజయనిర్మల స్వయంగా చెప్పారు. ‘సాక్షి’తో పాటు బాపు దర్శకత్వంలో రూపొందిన ‘బుద్ధిమంతుడు’, ‘ముత్యాలముగ్గు’, ‘తూర్పు వెళ్ళే రైలు’ తదితర చిత్రాల షూటింగ్‌ ఈ ఆలయంలో జరిగింది.
 జై శ్రీమన్నారాయణ 
⚛⚛⚛⚛⚛⚛

స్వర్ణ దేవాలయం

శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం”

శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.
ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”. కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు. ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశారు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను “జీర్ణోద్ధరణ” కూడా కావించారు.
ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు.
ఇవిగో..ఆ స్వర్ణ దేవాలయ అపురూప చిత్రాలు .. చూసి తరించండి..!! శుభం భూయాత్

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS