ఆ మీసం ఆపద్ధర్మం!
తెలంగాణలోని చెల్లాపూర్ గ్రామంలో మీస మాధవుడు కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. 200 ఏళ్ళ కిందటి మాట. దుబ్బాక సంస్థానాన్ని పాలించే దొరల వల్ల వేధింపులకు గురైన ఆ గ్రామస్తులు కప్పం కట్టకూడదని నిర్ణయించుకున్నారు. నిలువు నామాలు కలిగిన వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టి, ఆ పేరు చెప్పి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. కాశీ నుంచి విగ్రహం తెప్పిద్దామనుకున్నారు. అయితే ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో నిరాదరణకు గురైన ఆలయం నుంచి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠిద్దామన్న ఆలోచన చేశారు.
రాత్రి వేళల్లో ఎడ్ల బండ్ల మీద తిరుగుతూ విగ్రహాన్వేషణ చేశారు. రామ్‌గోపాల్‌పేట అనే గ్రామంలో అలాంటి విగ్రహం కనిపించింది. దాన్ని తెచ్చి, ప్రతిష్ఠించాలనుకుంటూండగా, రామ్‌గోపాల్‌పేట గ్రామస్తులు విగ్రహాన్ని వెతుకుతూ వస్తున్నారని తెలిసింది. దీంతో విగ్రహాన్ని చెరువులో దాచిపెట్టారు. తరువాత విగ్రహ ప్రతిష్ఠకు ఉపక్రమించారు. విగ్రహాన్ని రామ్‌గోపాల్‌పేట వారు గుర్తుపట్టకుండా... దాని తలపై ఉన్న కొప్పును తొలగించి కిరీటం పెట్టారు. విగ్రహానికి వెండి మీసాలను చేర్చారు. దీంతో మీసాల కృష్ణుడు ఆ ఆలయంలో కొలువుతీరి, అదే రూపంలో పూజలందుకుంటున్నాడు.
ఎక్కడుంది?: తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో
ఎలా వెళ్ళాలి?: హైదరాబాద్‌కు 128 కి.మీ., మెదక్‌కు 55 కి.మీ. దూరంలో చెల్లాపూర్ ఉంది. ఆ ప్రాంతాలనుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు: ఈ ఆలయంలో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఇది సుమారు 200 ఏళ్ళ నుంచి నిరంతరాయంగా వెలుగుతూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివల్ల గ్రామం పాడిపంటలు, సిరిసంపదలతో తులతూగుతుందని వారి నమ్మకం. వ్యవసాయ పనులు మొదలు పెట్టగానే స్వామికి ముడుపులు కడతారు. అలాగే, ఎలాంటి వివాదమైనా వేణుగోపాలుని ఆలయం మెట్లు ఎక్కితే ఇట్టే పరిష్కారం అవుతుందనీ, స్వామి సన్నిధిలో అబద్ధం ఆడినవారికి తప్పదని స్థానికులు విశ్వసిస్తారు.
No comments:
Post a Comment