Monday, December 10, 2018

మీసాల గోపాలుడు-ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలో


మీసాల గోపాలుడు
చేతవెన్న ముద్ద పట్టిన చిన్నారి కన్నయ్య... గోపికా మానసచోరుడు... కంస-చాణూర మర్దనుడు... గీతాచార్యుడు... ఇలా అనేక పాత్రల్లో శ్రీకృష్ణుని రూపం అందరికీ పరిచితమే... అయితే వీటిలో ఏ రూపంలోనూ మీసం మనకు కనిపించదు... నాసాగ్రాన మౌక్తికాన్ని తప్ప ముక్కుకింద మీసాన్ని ఊహించుకోలేం... కానీ నల్లనయ్య మీసంతో కనిపించే ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి.
 
*శంఖ చక్రపాణి!*
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పేరు వినగానే నోరూరించే పూతరేకులు గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతం వారికి కృష్ణుడు అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది మీసాల కృష్ణయ్య. అఖండ గోదావరి రెండు పాయలై... వశిష్ఠ, గౌతమి నదులయ్యాయి. ఆ నదులను ఆనుకున్న ప్రధాన కాలువలూ, కనుచూపు మేర పచ్చని పంట పొలాలతో ప్రకృతి సోయగాల మధ్య అలరారే పల్లెటూరు పులిదిండి. గౌతమీ గోదావరి నది చెంతనే ఉన్న ఆ గ్రామం మధ్యలో మీసాల వేణుగోపాల స్వామి స్వయంభువుగా వెలిసిన ఆలయం ఉంది.

*ఎక్కడుంది?:*
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలో

*ఎలా వెళ్ళాలి?:*
రాజమండ్రి నగరానికి సుమారు 27 కి.మీ. దూరంలో పులిదిండి ఉంది. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం రాజమండ్రిలో ఉంది.

*ప్రత్యేకతలు:*
సుమారు 300 ఏళ్ళ కిందట వెలసిన పులిదిండి వేణుగోపాల స్వామి నల్లరాతి విగ్రహం విలక్షణంగా ఉంటుంది. కుడిచేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ధరించి, మీసాలతో శోభాయమానంగా స్వామి దర్శనమిస్తారు. నిండు మనసుతో కొలిస్తే, కోరిన కోర్కెలను తీర్చే దైవంగా భక్తులు మీసాల వేణుగోపాలుణ్ణి ఆరాధిస్తారు. స్వామివారికి ఏటా కళ్యాణం, నిత్య ధూపదీప నైవేద్యాలూ జరుగుతున్నాయి. ఆయనకు మొక్కుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది.  ఆయనకు మొక్కుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది. 1967లో విడుదలైన ‘సాక్షి’ సినిమా చిత్రీకరణ ఈ ఆలయంలో జరిగింది.
 
ప్రముఖ నటులు కృష్ణ, విజయనిర్మల మీద వివాహ దృశ్యాన్ని తీశారు. ‘‘ఈ స్వామి దగ్గర పెళ్ళి సీన్‌ నటించారు కాబట్టి మీకు నిజంగా వివాహం జరుగుతుంది!’’ అని హాస్య నటుడు రాజబాబు వారితో అన్నారట. ఆ తరువాత కృష్ణ, విజయనిర్మల దంపతులయ్యారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో విజయనిర్మల స్వయంగా చెప్పారు. ‘సాక్షి’తో పాటు బాపు దర్శకత్వంలో రూపొందిన ‘బుద్ధిమంతుడు’, ‘ముత్యాలముగ్గు’, ‘తూర్పు వెళ్ళే రైలు’ తదితర చిత్రాల షూటింగ్‌ ఈ ఆలయంలో జరిగింది.
 జై శ్రీమన్నారాయణ 
⚛⚛⚛⚛⚛⚛

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS